Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే అరెస్ట్ పక్కా..! జరిమానా ఎన్ని లక్షలో తెలుసా.?

'రండి.. ఆడండి.. గెలవండి' అంటూ బెట్టింగ్‌ యాప్‌ల ముగ్గులోకి దింపుతున్న ఒక్కొక్క సెలబ్రిటీకి పులుసు కారిపోతోంది. 'నేను సంపాదించా.. మీరూ సంపాదించండి' అని ఎర వేసిన ఇన్‌ఫ్లుయెన్సర్లందరి చమురు వదులుతోంది. ఇప్పటికైతే.. 11 మందికి యాంకర్లు, సెలబ్రిటీలకు నోటీసులు అందాయ్. అవసరమైతే అరెస్టులూ ఉంటాయ్ అని టాక్. ఇంతకీ.. ఇంత సడెన్‌గా ఎందుకీ నోటీసులు? ఎవరెవరికి నోటీసులిచ్చారు? ఇకపై ఆ లిస్ట్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు?

బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే  అరెస్ట్ పక్కా..! జరిమానా ఎన్ని లక్షలో తెలుసా.?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 18, 2025 | 8:26 AM

పోయేది తమ ప్రాణం కాదు కదా.. ‘ముగ్గులోకి దింపుదాం, ఆడిద్దాం, కోట్లు సంపాదించుకుందాం’.. ఇదే ధోరణితో వెళ్లారు కొందరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు. కాని, చట్టం తన పని తాను చేసుకుంటూపోతే ఏం జరుగుతుందో, అది ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే రుచి చూస్తున్నారు కొందరు సెలబ్రిటీస్. బెట్టింగ్‌ యాప్స్‌పై పెద్ద యుద్ధమే చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. చాలాకాలంగా వీటిని అణచివేయాలనే చూస్తున్నారు. కాని, అంత పెద్ద వ్యవస్థపై ఫైట్‌ చేయడం అభినందనీయమే అయినా.. అంత ఈజీగా జరిగే పనైతే కాదు. అందుకే, మరోవైపు నుంచి నరుక్కొస్తున్నారు. సాధారణంగా.. ఫలానాది బెట్టింగ్‌ యాప్‌ అని, వాటి పేర్లు ఫలానా అని సాధారణ ప్రజలకు తెలీదు. కాని, వాటిని అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తున్నది మాత్రం.. తిన్నది అరక్క, సంపాదిస్తున్నది చాలక, బతకడం చేతగాక సోషల్‌ మీడియాలో వీడియోలు చేస్తున్న కొందరు అతిగాళ్ల వల్లే. ముందు వాళ్ల తోక కట్‌ చేస్తే.. 90 పర్సెంట్‌ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయినట్టే. అందుకే.. పోరాటాన్ని ఆ దిశగా కొనసాగించారు ఐపీఎస్ సజ్జనార్.

చెట్టు మీద కాకులన్నిటినీ వెళ్లగొట్టాలంటే.. పది రాళ్లు వేయక్కర్లేదు. ఒక్క రాయి చాలు. అదే పని జరిగింది మొన్న. లోకల్‌ బాయ్‌ నాని పేరుతో వీడియోలు చేసే విశాఖ కుర్రాన్ని అరెస్ట్‌ చేశారు. బైక్‌పై దేశ విదేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తున్న భయ్యా సన్నీ యాదవ్‌ను.. దొరికితే అరెస్ట్‌ చేద్దామని చూస్తున్నారు. ఆ దెబ్బకు మిగతా వాళ్లంతా సెట్‌ అయ్యారు. ‘అయ్యయ్యో వద్దమ్మా.. బెట్టింగ్‌ యాప్స్‌ జోలికి వెళ్లకండమ్మా’ అంటూ ఒక్కక్కరుగా క్షమాపణలు చెప్పి మరీ వీడియోలు రిలీజ్ చేశారు. ‘తెలిసీ తెలియక తప్పు చేశాం.. ఇకపై వాటిని ప్రమోట్‌ చేయబోం’ అంటూ ప్రామిస్‌ చేస్తున్నారు. కాని, చట్టానికి ఒక్కటే తెలుసు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అనే రూల్‌ మాత్రమే తెలుసు. అందుకే, ‘హాయ్‌ గాయ్స్‌’ అంటూ ఎవరెన్ని హొయలొలుకుతూ సారీ చెప్పినా.. చట్టం ఊరుకోవడం లేదు. బహుశా.. తమకూ నోటీసులు వస్తాయ్, తేడా వస్తే అరెస్టులూ జరుగుతాయ్‌ అని తెలుసుకున్నారు కాబోలు.. తప్పైపోయిందని వీడియోలు పెట్టారు.

టాలీవుడ్‌ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత, రీతూ చౌదరి, టేస్టీ తేజ.. వీళ్లందరూ వీడియోలు రిలీజ్ చేశారు. వీళ్లకి ఎంతలా భయం పట్టుకుందంటే.. ‘బెట్టింగ్‌ యాప్స్‌ను బాధ్యతగా ప్రమోట్ చేస్తున్నా’ అని వెర్రి కామెంట్స్‌ చేసిన హర్ష సాయి సైతం దిగొచ్చాడు. ఇల్లీగల్‌ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయబోనంటూ పోస్ట్‌ పెట్టాడు. అయినా సరే.. చట్టం ఊరుకోలేదు. బెట్టింగ్‌ యాప్స్‌కు గతంలో ప్రచారం చేసిన హర్షసాయి, టేస్టీ తేజ, కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, సుప్రీత, అజయ్‌, సన్నీ యాదవ్‌, ఇమ్రాన్‌ఖాన్‌, సందీప్‌లపై బీఎన్‌ఎస్‌ 318(4) 3, 3ఏ, టీఎస్‌జీఏ, 66డీఐటీఏ-2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కన్జ్యూమర్‌ ఫోరం సవరణ చట్టం-1986 చట్టం ప్రకారం.. మోసపూరితమైన యాప్‌లు, ఉత్పత్తులకు ప్రచారం చేసే సెలబ్రిటీలపై ఏడాది నుంచి మూడేళ్ల పాటు నిషేధం విధించవచ్చు. 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. చేసిన తప్పే మళ్లీ చేస్తే జైలుశిక్ష తప్పదు అని పోలీస్‌ అధికారులు వార్నింగ్‌ ఇస్తున్నారు.

బెట్టింగ్స్‌ ద్వారా మనదేశంలో జరుగుతున్న అక్రమ వ్యాపారం దాదాపు ఎనిమిదన్నర లక్షల కోట్ల రూపాయలు. ప్రతి రోజు కనీసం 14 కోట్ల మంది ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కాస్తున్నారు. ఇక.. క్రికెట్‌ మెగా ఈవెంట్లు ఉన్నప్పుడైతే.. ఏకంగా రోజుకు 34 కోట్ల మంది ‘కాయ్ రాజా కాయ్’ అంటుంటారని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. కాని, ఇల్లీగల్‌ బెట్టింగ్‌ యాప్స్‌తో ఒక్కరికి కూడా డబ్బులొచ్చిన దాఖలాలు లేవు. డబ్బు పోగొట్టుకోవడమే తప్ప ఏ ఒక్కరూ సంపాదించింది లేదు. పైగా.. ఆస్తులు పోగొట్టుకుని వీధిన పడ్డ వ్యాపారులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, డాక్టర్లు బోలెడంత మంది ఉన్నారు. ఆస్తి, పరువు పోగొట్టుకుని.. చివరికి ఆత్మహత్య చేసుకున్న వాళ్లు వేలల్లో ఉన్నారు. ఒక్క తెలంగాణలోనే ఏడాది కాలంలో కనీసం 1000 మంది ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఓ అంచనా. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెంత మంది ఉంటారో. వీళ్లందరి ప్రాణాలు పోవడానికి, ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడడానికి ప్రధాన కారణం.. కొందరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లే. అందుకే, ముందుగా ఆ సెలబ్రిటీల భరతం పడుతున్నారు పోలీసులు. సో.. ఇకపై మరింత మంది సెలబ్రిటీల లెక్కలు కూడా తేలబోతున్నాయనే చర్చ జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి