AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponniyin Selvan Full Review: చోళుల జీవన విధానాన్ని చెప్పే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’

తమిళనాడులో మెజారిటీ జనాల ఆదరణ చూరగొన్న నవల పొన్నియిన్‌ సెల్వన్‌. చోళ రాజులు, వాళ్ల జీవితాలు, అప్పట్లో జరిగిన కుట్రలు కుతంత్రాలు, అప్పటి సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక వ్యవహారాలు, ప్రయాణాలు, సముద్రయానాలు వంటి ఎన్నో విషయాలను చెప్పిన నవల

Ponniyin Selvan Full Review: చోళుల జీవన విధానాన్ని చెప్పే 'పొన్నియిన్‌ సెల్వన్‌'
ponniyin selvan movie review
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Sep 30, 2022 | 1:25 PM

Share

చరిత్ర ఎప్పుడూ మనల్ని ఊరిస్తూ ఉంటుంది. సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్న సమయంలో చాలా పనులు వాయిదా పడుతుంటాయి. అలాంటిది అవేమీ లేనప్పుడు మన పూర్వీకులు అంతంత దూరాలు ఎలా ప్రయాణాలు చేశారు? వాళ్ల కోటలు ఎలా ఉండేవి? రక్షణ దళాలు ఎలా పనిచేసేవి? సమాచారాన్ని ఎలా చేరవేసుకునేవారు, సంస్కృతి, సంప్రదాయాల మాటేంటి? అన్నీ ఆసక్తికరమైన అంశాలే. పొన్నియిన్‌ సెల్వన్‌లో అలాంటి ఇంట్రస్టింగ్‌ విషయాలను స్క్రీన్‌ మీద ప్రెజెంట్‌ చేసే ప్రయత్నం చేశారు మణిరత్నం. శుక్రవారం విడుదలైన తొలి భాగం ఎలా ఉంది? చదివేయండి.

దర్శకత్వం: మణిరత్నం

స్క్రీన్‌ప్లే: మణిరత్నం, కుమారవేల్‌, ఇళంగోకుమారవేల్‌

ఇవి కూడా చదవండి

మాటలు: తనికెళ్ల భరణి

నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్‌ కృష్ణమూర్తి

నటీనటులు: విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత దూళిపాళ, ప్రభు, ఆర్‌.శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, జయరామ్‌, ప్రకాష్‌రాజ్‌, రెహమాన్‌, ఆర్‌.పార్తిబన్‌ తదితరులు

కెమెరా: రవివర్మన్‌

ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌

సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌

నిర్మాణ సంస్థలు: మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్

విడుదల: సెప్టెంబర్‌ 30, 2022

సుందర చోళుడు (ప్రకాష్‌రాజ్‌) పెద్ద కుమారుడు ఆదిత్య కరికాళచోళుడు (విక్రమ్‌), చిన్న కుమారుడు అరుళ్‌మొళి వర్మన్‌ అలియాస్‌ పొన్నియిన్ సెల్వన్‌ (జయం రవి), కుమార్తె కుందవై (త్రిష). వానర్‌ కులానికి చెందిన పరాక్రమవంతుడు వల్లవరాయన్‌ వందియదేవన్‌ (కార్తి). అత్యంత పరాక్రమవంతుడిగా పేరు తెచ్చుకుంటాడు ఆదిత్య కరికాళచోళుడు (విక్రమ్‌). రాష్ట్రకూటుల మీద ఆదిత్య చేసిన దండయాత్రలో తన పరాక్రమాన్ని చూపిస్తాడు వల్లవరాయన్‌. అతని ధైర్యసాహసాలను గమనించిన ఆదిత్య..వల్లవరాయన్‌ని ఓ సాయం కోరుతాడు. ఆ పని మీద వెళ్లిన వల్లవరాయన్‌కి చోళ రాజ్యానికి సంబంధించిన గొప్ప రహస్యం తెలుస్తుంది. ఆ విషయాన్ని సుందర చోళుడికి, కుందవైకి చెబుతాడు. కుందవై ఆజ్ఞ మేరకు లంకలో ఉన్న అరుళ్‌మొళి వర్మన్‌ని కలుసుకుంటాడు. సుందర చోళుడిని వల్లవరాయన్‌ కలుసుకోవడానికి నందిని పరోక్షంగా సాయపడుతుంది. బదులుగా కుందవైకి సంబంధించిన ఓ సమాచారం చెప్పాలని కోరుతుంది. మొత్తం కథకు సూత్రధారిగా ఉన్న వల్లవరాయన్‌ అనుకున్న పనులను చేయగలిగాడా? అతనికి తెలిసిన రహస్యంలో పెరియ పళువేట్టరైయార్‌ పాత్ర ఏంటి? పూంగుళలి, వానది మనసులో ఉన్న విషయాలను వల్లవరాయన్‌ ఎలా అర్థం చేసుకున్నాడు? కొడంబలూర్‌ రహస్యాన్ని వల్లవరాయన్‌తో పాటు తెలుసుకున్న ఇంకో వ్యక్తి ఎవరు? పాండ్య రాజు వీరపాండ్యన్‌కి నందినితో ఉన్న అనుబంధం ఎలాంటిది? రవి దాసన్‌ ఎందుకు పొన్నియిన్‌ సెల్వన్‌ మీద పగపట్టాడు? తంజావూరులో అడుగుపెట్టనని ఆదిత్య అనడానికి కారణం ఏంటి? వంటివన్నీ స్క్రీన్‌ మీద చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

తమిళనాడులో మెజారిటీ జనాల ఆదరణ చూరగొన్న నవల పొన్నియిన్‌ సెల్వన్‌. చోళ రాజులు, వాళ్ల జీవితాలు, అప్పట్లో జరిగిన కుట్రలు కుతంత్రాలు, అప్పటి సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక వ్యవహారాలు, ప్రయాణాలు, సముద్రయానాలు వంటి ఎన్నో విషయాలను చెప్పిన నవల. కాల్పనిక విషయాలకు కొదవలేకపోయినా, ఆనాటి సంగతులను ఒడిసిపట్టిన నవల. బృహత్‌నవలగా పేరున్న పొన్నియిన్‌ సెల్వన్‌ని స్క్రీన్‌ మీద అంతే గ్రేస్‌ఫుల్‌గా ప్రెజెంట్‌ చేయడానికి ప్రయత్నించారు మణిరత్నం. కేరక్టర్లను పరిచయం చేయడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకున్నారు. ఏ విషయాన్ని ఎంత వరకు చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే విషయాల మీద నిక్కచ్చిగా వ్యవహరించారు. చోళరాజ్యంలో స్త్రీలకున్న ప్రాముఖ్యత, రాచరికంలో వారి భాగస్వామ్యాన్ని కూడా కళ్లకు కట్టినట్టు చూపించారు. అటు నందిని, ఇటు కుందవైతో పాటు రాజమాతల మాటలకున్న విలువను కూడా చూపించారు.

సినిమా కోసం కేవలం పాత్రలు, డ్రామా మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేయకుండా, నాటి జీవన శైలిని కూడా కథలో అందంగా చొప్పించారు మణిరత్నం. శైవ, వైష్ణవులకు మధ్య జరిగే వివాదాలు, గుర్రాల మీద ప్రయాణాలు, రాణీవాసం, రహస్యద్వారాలు, తండ్రి మాటకు ఇచ్చే విలువ, శ్రీలంకలో బౌద్ధం ప్రవేశించిన తీరు, యుద్ధరీతులు, ప్రేమ, పగ, ఐశ్వర్యం, అరణ్యాలు, విలువిద్య, కత్తి యుద్ధాలు, ఆడామగా సమానంగా అన్నీ పనులు చేయడం… ఇలా చాలా విషయాలను సందర్భోచితంగా చొప్పించి విజువల్‌ వండర్‌గా తెరకెక్కించారు. కథలో ఏవో మలుపులు ఊహించుకుని సినిమా చూసేవారికి స్క్రీన్‌ప్లే కాస్త నిరాశపరచవచ్చు. కానీ చరిత్రని చరిత్రగా చూడగలిగితే మాత్రం నచ్చి తీరుతుంది. కెమెరా పనితనం బావుంది. విజువల్‌ ఎఫెక్ట్స్ బావున్నాయి. ఎడిటింగ్‌ గురించి తప్పక ప్రస్తావించి తీరాల్సిందే. ఐశ్వర్య, త్రిష, శోభిత ధూళిపాల, ఐశ్వర్య లక్ష్మీ… ఇలా ప్రతి ఒక్కరి పాత్రకూ ప్రాముఖ్యతనిచ్చారు డైరక్టర్‌.. ఇంటర్వెల్‌ సీన్‌, క్లైమాక్స్ సన్నివేశాలు బావున్నాయి.

రంద్రాన్వేషణ చేయకుండా, చరిత్రను చూస్తున్నామన్న భావనతో చూస్తే సినిమా నచ్చుతుంది. పేర్లన్నీ తమిళంలో ఉండటం వల్ల, తెలుగువారికి వాటిని గుర్తుపెట్టుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కథను మళ్లీ చెప్పాలనుకున్నప్పుడు ఆ పేర్లు గుర్తురాక కాస్త గందరగోళంగానూ అనిపించవచ్చు. అయినా ఏకాగ్రతతో చూస్తే సినిమా నచ్చుతుంది. తనికెళ్ల భరణి డైలాగులు, ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యాయి. సెకండ్‌ పార్ట్ కి మణిరత్నం ఇచ్చిన లీడ్‌ కూడా ఆసక్తికరంగా ఉంది. చోళ చరిత్రను మణిరత్నం చక్కగా డీల్‌ చేశారు. – డా. చల్లా భాగ్యలక్ష్మి