AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పలాస 1978 మూవీ రివ్యూ

నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ తదితరులు సమర్పణ: తమ్మారెడ్డి భరద్వాజ విడుదల: సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్‌ డేట్‌: మార్చ్ 6 పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె, కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్ నిర్మాత : ధ్యాన్ అట్లూరి. రచన- దర్శకత్వం : […]

పలాస 1978 మూవీ రివ్యూ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 10, 2020 | 9:43 PM

Share

నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ తదితరులు సమర్పణ: తమ్మారెడ్డి భరద్వాజ విడుదల: సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్‌ డేట్‌: మార్చ్ 6 పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె, కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్ నిర్మాత : ధ్యాన్ అట్లూరి. రచన- దర్శకత్వం : కరుణ కుమార్.

అప్పుడప్పుడూ వెండితెరమీద వాస్తవ సంఘటనలు ప్రత్యక్షమవుతుంటాయి. మరికొన్ని సార్లు వాస్తవ ఘటనలు కాకపోయినప్పటికీ, ఆయా పాత్రలు మాట్లాడే భాష, యాస వల్ల ఆ ఘటనలు నిజంగా జరిగాయేమో అన్న భావన కలుగుతుంటుంది. పలాస 1978 అలాంటి చిత్రమే. ఇందులోని పాత్రలు, సన్నివేశాలూ ఎవరినీ ఉద్దేశించినవి కావని దర్శకనిర్మాతలు ప్రకటించారు. అప్పటి నలిగిపోయిన జీవితగాథలను ఇప్పటితరాన్ని కదిలించేలా తెరకెక్కించారా..? కథ పలాసలో తక్కువ కులంలో పుట్టినవాళ్లు రంగారావు (తిరువీర్‌), మోహన్‌రావు (రక్షిత్‌). తండ్రి నేర్పిన ఆటాపాటతో జీవితాన్ని సాగదీస్తుంటారు. వీరి కులానికి చెందిన భైరాగి అదే ఊళ్లో పెద్ద షావుకారు(జనార్దన్‌) దగ్గర పనిచేస్తుంటాడు. భైరాగి అండతో… తమ్ముడు చిన్న షావుకారు (రఘు కుంచె)తో వైరం పెంచుకుంటాడు పెద్ద షావుకారు. ఒకసారి థియేటర్‌కి వెళ్లిన ఆడవాళ్లతో పెద్ద షావుకారు కొడుకు అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అక్కడ మాటామాటా పెరిగి, అది కాస్తా కొట్లాటదాకా వెళ్తుంది. రంగారావు మీద చేయి చేసుకుంటాడు షావుకారు కొడుకు. దాంతో అన్నదమ్ములు ఇద్దరూ ఒకటై అతన్ని కాపుగాసి కొడతారు. వెంటనే భైరాగి రంగంలోకి దిగుతాడు. అతన్ని కూడా చంపేస్తారు ఇద్దరు సోదరులు. అప్పటి నుంచీ వీరిని చిన్న షావుకారు చేరదీస్తాడు. అతను రాజకీయంగా ఎదగడానికి అన్నదమ్ములు ప్రచారం చేసి, రిగ్గింగ్‌ చేసి, రౌడీయిజమ్‌ చేసి సాయం చేస్తారు. ఒకానొక సందర్భంలో చిన్న షావుకారుకి, రంగారావుకీ మాటామాటా పెరుగుతుంది. దాని వల్ల ఇంట్లో అన్నదమ్ములు విడిపోతారు. రంగారావు పెద్ద షావుకారు దగ్గర, మోహన్‌రావు చిన్న షావుకారు దగ్గర చేరుతారు. అక్కడి నుంచి ఎత్తుకుపైఎత్తు అన్నట్టు సాగుతుంది వారి వ్యవహారం. ఒకానొక సందర్భంలో ఇద్దరు అన్నదమ్ములూ ఒకటవుతారు. షావుకారు కుటుంబం ఒకటవుతుంది. షావుకారు కుటుంబానికి, అన్నదమ్ములకు మధ్య జరిగిన గొడవలో ఎవరు గెలిచారు? సెబాస్టియన్‌ ఎవరు? అతనికి మోహన్‌రావు అంటే కోపం ఉందా? ప్రేమ ఉందా? మోహన్‌రావు భార్యను ఎవరు చంపారు? రంగారావు పెళ్లి పీటల మీదకు వెళ్లిందా? లేదా? చివరికి ఏమైంది? అనేది ఆసక్తికరం. ప్లస్‌ పాయింట్లు – నటీనటుల నటన – పాత్రలు మాట్లాడే యాస – కెమెరా పనితనం – ఎడిటింగ్‌ మైనస్‌ పాయింట్లు – అక్కడక్కడా లాజిక్కులు మిస్‌ కావడం – కన్విన్సింగ్‌గా లేని క్లైమాక్స్

సమీక్ష బలవంతుడు ఎప్పుడూ బలవంతుడే. అణగారిన వర్గాలు ఎప్పుడూ బలవంతుల భవిష్యత్తుకోసం పనిచేయాల్సిందే. జీవితాన్ని వారికి పణంగా పెట్టి కాపు కాయాల్సిందేనని చెప్పిన చిత్రమిది. ఈ పరిస్థితి పలాసలో మాత్రమే కాదనీ, దేశం అంతటా అలాంటి పరిస్థితులే ఉన్నాయనీ చెప్పే ప్రయత్నం చేశారు డైరక్టర్‌. నటీనటులకు మేకప్‌లు లేకుండా తీసిన సినిమా ఇది. 1978నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. నటీనటులు తమ పాత్రల్లో బాగా నటించారు. డబ్బింగ్‌ పర్ఫెక్ట్ గా కుదిరింది. సన్నివేశాల్లో తీవ్రతను ధ్వనింపజేయడానికి బీప్‌లు లేకుండా అక్కడక్కడా బూతులు కూడా వాడారు. శ్రీకాకుళం పాటలు బావున్నాయి. నక్కిలీసు గొలుసు పాట బావుంది. విఘ్నేశ్వరుడు తల నరికినప్పుడు ఇంకో తల పెట్టాలనిపించిన దేవుడికి, ఏకలవ్యుడి చేతివేలు పోయినప్పుడు మళ్లీ వేలును అతికించాలని ఎందుకు అనిపించలేదు వంటి డైలాగులు మాస్‌ని అట్రాక్ట్ చేస్తాయి. ‘భైరాగి బండను ఎత్తినవాడివి.. భైరాగిని ఎత్తలేవా?’, ‘నువ్వు నా కడుపులో పుట్టినావా.. నేను నీ కడుపులో పుట్టినానా’, ‘అన్నా..నా పెళ్లాన్ని చంపినారు.. షావుకారు కాడికి పోదాం పదరా’… వంటి డైలాగులు బావున్నాయి. అగ్రకులం వాళ్లు ఒక్కటైనప్పుడు, తక్కువ కులాల మధ్య ఐక్యత ఎందుకు లేదనే ఆలోచన సెబాస్టియన్‌ మాటల్లో కనిపిస్తుంది. అయితే సినిమాలో అక్కడక్కడా లోపాలు కూడా కనిపిస్తాయి. పాతిక వసంతాలు గడిచిన తీరు, మోహనరావు ఆ పాతికేళ్లలో తిరిగిన ఊళ్లు… అతను నేర్చుకున్నదేంటి? వంటి విషయాల్లో క్లారిటీ ఉండదు. తమిళంలో పరియేరుమ్ పెరుమాళ్ ఈ తరహా చిత్రమే. పలాసను చూస్తున్నంత సేపు సుబ్రమణ్యపురం, అసురన్‌, తెలుగు రంగస్థలం… ఇలా చాలా సినిమాలు గుర్తుకొస్తాయి. క్లైమాక్స్ లో సెబాస్టియన్‌ చెప్పే మాటలు కన్విన్సింగ్‌గా అనిపించవు. రాజ్యాంగాన్ని గౌరవించే అధికారిగా అతను హత్యలు చేయడు. కానీ హత్యలు చేయడం కన్నా, చేయించడం కూడా నేరమేనని అతనికి తెలియదా? మోహనరావును పురిగొల్పి హత్యలు చేయించడం ఎంత వరకు సబబు… ఇలాంటి లాజిక్కులకు అందని అంశాలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి. రఘుకుంచె నటన బావుంది. ఇంటర్వెల్‌ సీన్‌ బావుంది. రక్షిత్‌, నక్షత్ర మధ్య వచ్చే సన్నివేశాలు బావున్నాయి. శ్రీకాకుళం యాస మెప్పిస్తుంది. కమర్షియల్‌ అంశాలు పెద్దగా లేని, ఇలాంటి సినిమాలు నేటి సినీ ప్రేక్షకుడిని ఎంత వరకు అలరిస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఫైనల్‌గా… పలాస.. వైవిధ్యమైన ప్రయత్నం! – డా. చల్లా భాగ్యలక్ష్మి