Maestro Movie Review: అంధాధున్ సినిమా… తెలుగులో మాస్ట్రోగా మెప్పిస్తుందా?.. నితిన్ మాస్ట్రో మూవీ రివ్యూ..

Maestro Movie: ఒక ప‌క్క థియేట‌ర్లు రిలీజ్ అయ్యాయి. సినిమాలు థియేట‌ర్ల‌లో చూడ‌టానికి ఆడియ‌న్స్ కూడా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు.

Maestro Movie Review: అంధాధున్ సినిమా... తెలుగులో మాస్ట్రోగా మెప్పిస్తుందా?.. నితిన్ మాస్ట్రో మూవీ రివ్యూ..
Nithin
Follow us

|

Updated on: Sep 17, 2021 | 9:08 AM

ఒక ప‌క్క థియేట‌ర్లు రిలీజ్ అయ్యాయి. సినిమాలు థియేట‌ర్ల‌లో చూడ‌టానికి ఆడియ‌న్స్ కూడా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో నితిన్ లాంటి క్రేజ్ ఉన్న హీరో సినిమాను ఎందుకు ఓటీటీకి ఇచ్చారు? అందులోనూ నేష‌న‌ల్ లెవ‌ల్లో అప్లాజ్ తెచ్చుకున్న అంధాధున్ క‌థ‌ను బిగ్ స్క్రీన్స్ కి ఇవ్వ‌కుండా ఎందుకు స్కార్ట్ వాచ్‌కి అలో చేశారు? సినిమా ఔట్‌పుట్ ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్‌లో లేదా? లేకుంటే థియేట‌ర్ల‌క‌న్నా ఓటీటీల్లోనే ఈ కంటెంట్‌కి రెస్పాన్స్ బావుంటుంద‌నుకున్నారా?… నితిన్ మాస్ట్రో ఓటీటీ డీల్ అయిపోయింద‌న్న‌ప్ప‌టి నుంచీ వినిపిస్తున్న డిస్క‌ష‌న్ ఇది. ఇప్పుడు ఈ డిస్క‌ష‌న్ మారింది. ఇంత‌కీ సినిమా ఎలా ఉంది? ఒరిజిన‌ల్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా దించేశారా? లేకుంటే చెడిపేశారా? అనే మాట‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ సినిమా ఎలా ఉన్న‌ట్టు… మీరు కూడా చ‌దివేయండి. ఆల‌స్యం ఎందుకు?

సినిమా: మాస్ట్రో నిర్మాత‌లు: సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి న‌టీన‌టులు: నితిన్‌, న‌భా న‌టేష్‌, త‌మ‌న్నా, న‌రేష్‌, జిష్షుసేన్ గుప్తా, అన‌న్య నాగ‌ళ్ల‌, హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, మంగ్లీ, ర‌చ్చ ర‌వి, బాల‌కృష్ణ త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వం: మేర్ల‌పాక గాంధి సంగీతం: మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్‌ ఒరిజిన‌ల్ క‌థ‌: హిందీ అంధాధున్‌ సెన్సార్‌: యు/ఎ ర‌న్ టైమ్‌: 137.55ని! కెమెరా: జె.యువ‌రాజ్‌ విడుద‌ల‌: 17.9.2021

అరుణ్ (నితిన్‌) చూపున్నా లేన‌ట్టు న‌టిస్తుంటాడు. స‌ర్వేంద్రియానాం న‌య‌నం ప్ర‌ధానం అంటారు. అయితే ఆ చూపు లేక‌పోతే చేస్తున్న ప‌నిమీద రెట్టింపు ఫోక‌స్ ఉంటుంద‌ని అత‌ని న‌మ్మ‌కం. అందుకే బ్లైండ్ ప‌ర్స‌న్‌గా ప్రాక్టీస్ చేస్తాడు. అత‌నికి పియానో అంటే ఇష్టం. తన‌కు తెలిసిన విద్య‌ను న‌లుగురికీ నేర్పుతుంటాడు. అత‌ని పియానో ట్ర‌బుల్ ఇస్తే సెకండ్ హ్యాండ్ కొనాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలోనే అత‌నికి సోఫీ (న‌భా న‌టేష్‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమె క‌థ గురించి తెలుసుకున్న అరుణ్ ప్ర‌తిరోజూ సోఫీ హోట‌ల్‌కే వెళ్లి పియానో వాయిస్తుంటాడు. అక్క‌డికి వ‌చ్చిన ఏజ్ ఓల్డ్ న‌టుడు మోహ‌న్ (న‌రేష్‌) త‌న మ్యారేజ్‌ యానివ‌ర్శ‌రీ సంద‌ర్భంగా ప్రైవేట్‌గా త‌న ఇంట్లో పియానో వాయించాల‌ని అనుకుంటాడు. అందుకు ఒప్పుకున్న అరుణ్‌, ఇంటికి వెళ్లే స‌రికి మోహ‌న్‌ భార్య సిమ్ర‌న్ (త‌మ‌న్నా) ఉంటుంది. క‌ళ్లు లేన‌ట్టు న‌టించిన అరుణ్ అక్క‌డ చూసిన విష‌యాలేంటి? లోక‌ల్ పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లిన అత‌నికి ఎదురైన బిట‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఎలాంటివి? కిడ్నీలు అమ్ముకునే ముఠా అరుణ్ వెంట ఎందుకు ప‌డ్డారు? అరుణ్ చూపు పోగొట్ట‌డానికి సిమ్రన్ ఏం చేసింది? మోహ‌న్ కుమార్తె ప‌ల్ల‌వితో అరుణ్‌కున్న అనుబంధం ఎలాంటిది? అస‌లు క్లైమాక్స్‌లో సీన్‌కీ, కుందేలుకీ ఉన్న లింకేంటి? ఇలాంటి బోలెడ‌న్ని ట్విస్టుల‌తో సాగుతుంది మాస్ట్రో.

చాక్లెట్‌బోయ్‌గా, మాస్ డైలాగులు చెప్పే క‌మ‌ర్షియ‌ల్ హీరోగా తెలుగు స్క్రీన్‌కి బాగా ప‌రిచ‌య‌మున్న నితిన్‌కి ఈ సినిమా కొత్త ఎక్స్ పీరియ‌న్స్. సెటిల్డ్ పెర్ఫార్మ్ గా ఈ మూవీలో బాగానే ప్రూవ్ చేసుకున్నారు నితిన్‌. యంగ్ వైఫ్‌గా, సేమ్ టైమ్ త‌న‌కంటూ కోరిక‌లున్న అమ్మాయిగా త‌మ‌న్నా యాక్టింగ్ గుడ్‌. ఒరిజిన‌ల్‌లో చేసిన ట‌బుని మెప్పించగ‌లిగారా? మ‌ర‌పించ‌గ‌లిగారా? వంటి మాట‌లు ప‌క్క‌న‌పెడితే న‌టిగా త‌మ‌న్నా త‌న బెస్ట్ చేశారు. పాత వైభ‌వాన్ని గుర్తు చేసుకుంటూ మిగిలిన జీవితాన్ని గ‌డిపే భ‌ర్త‌గా మోహ‌న్ కేర‌క్ట‌ర్‌లో విగ్ స‌ర్దుకుంటూ ఈజ్‌తో చేసేశారు న‌రేష్‌. సీఐ బాబీ కేర‌క్ట‌ర్‌కి జిష్షు సేన్, అత‌ని భార్య ల‌క్కీగా శ్రీముఖి ,ఆటో డ్రైవ‌ర్‌గా ర‌చ్చ‌ర‌వి, లాట‌రీ టిక్కెట్లు అమ్ముకునే లేడీగా మంగ్లీ, డాక్ట‌ర్‌గా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, మోహన్ కూతురు అన‌న్య‌గా ప‌ల్ల‌వి, ఎదురింటి ప్రిన్సిపాల్‌ ఓల్డ్ లేడీ, కింది పోర్ష‌న్‌లో ఉన్న చిన్న పిల్లాడు, ఇలా ఎవ‌రి కేర‌క్ట‌ర్ల‌లో వాళ్లు ప‌ర్ఫెక్ట్ గా యాక్ట్ చేశారు. మ‌ధ్య‌లో రాణి పేరుతో పిల్లిని, ట్యూన్ల కోసం ఇళ‌య‌రాజాను వాడుకున్న తీరు కూడా బావుంది.

పెద్ద‌గా చెప్పుకోవ‌డానికి చూపించ‌డానికి అవ‌కాశం లేక‌పోయినా, ఉన్నంత‌లో లొకేష‌న్లు కూడా ఫ్రెష్‌గా అనిపించాయి. కెమెరా వ‌ర్క్ బావుంది. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం ఆద్యంతం సూప‌ర్ అని చెప్ప‌లేం కానీ, వెన్నెల్లో ఆడ‌పిల్ల పాట‌లో ఎలివేట్ అయింది. పియానో ప్లే చేసిన ప్ర‌తిసారీ ఆహ్లాదంగా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది.

ఈ సినిమాకు సంబంధించి స్పెష‌ల్‌గా మెన్ష‌న్ చేయాల్సింది మేర్ల‌పాక గాంధీని. తెలుగుకు త‌గ్గ‌ట్టు ఏవేవో మార్పులు చేస్తున్నామ‌నే పేరు పెట్టి ఒరిజిన‌ల్‌ని చెడ‌గొట్ట‌లేదు. ఒరిజిన‌ల్‌లో ఉన్న ఎమోష‌న్స్ ని మిస్ కాకుండా చేశారు. అలాగ‌ని కొత్త‌గా కూడా ఏం ట్రై చేయ‌లేదు. యాక్చువ‌ల్‌గా ఒరిజిన‌ల్ అంధాధున్ బ్లాక్ కామెడీ థ్రిల్ల‌ర్‌. తెలుగులో ఆ కామెడీ మిస్ అయింది. ఎక్క‌డా న‌వ్వులు పుట్టించేలా గిలిగింత‌లు పెట్టే స‌న్నివేశాలేం ఉండ‌వు. అలాగ‌ని థ్రిల్లింగ్ మిస్ అయింద‌ని కూడా చెప్ప‌లేం. ఒరిజినల్‌ని చూసిన వారు జ‌స్ట్ ఇక్క‌డెలా తీశార‌ని తెలుసుకోవాల‌నే దృష్టితోనే చూస్తారు. కానీ ఫ‌స్ట్ టైమ్ వ్యూయ‌ర్స్ కి మాత్రం డెఫ‌నెట్‌గా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

డా. చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి TV9 E T  Desk 

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: నేడు ఈడీ అధికారుల ముందుకు హీరో తనీష్.. ప్రశ్నల వర్షం కురిపించనున్న అధికారుల..

Sonu Sood: సోనూసూద్ పై ఇన్‌కం టాక్స్ దాడులు.. ఐదు వేల రూపాయలతో ముంబాయి వచ్చిన మెస్సియా ప్రస్తుత ఆస్తులు ఎంతో తెలుసా?

Prabhas: షూటింగ్‌ గ్యాప్‌లో ప్రభాస్‌ ఏం చేస్తుంటాడో తెలుసా.? అసలు విషయాన్ని బయటపెట్టిన దర్శకుడు ఓంరౌత్‌..