ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. నాకు అండగా నిలిచింది ఆయనే.. కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ మా ఇంటి బంగారం. సామ్ భర్త రాజ్ నిడిమోరు కథ అందించగా.. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది.

ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి రీసెంట్ గా మా ఇంటి బంగారం సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందిని. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో దివంగత దర్శకుడు శోభన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. శోభన్‌ను తలుచుకుంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఖడ్గం సినిమా సెట్స్‌లో జరిగిన ఒక సంఘటన ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిందని తెలిపారు. ఆ రోజు వంశీ దర్శకత్వంలో జరుగుతున్న షూటింగ్‌లో తాను హడావిడిగా ఉన్నప్పుడు, వంశీ తనపై కోపగించుకుని గెట్ అవుట్ ఫ్రమ్ మై సెట్ అని అన్నారని, లోపలికి వస్తే కాళ్లు ఇరగ్గొడతానని తిట్టేశారని నందిని రెడ్డి తెలిపారు. దాంతో తీవ్రంగా బాధపడిన తాను వెక్కి వెక్కి ఏడుస్తున్నానని చెప్పారు.
అప్పుడు దర్శకుడు శోభన్ వచ్చి, ఆమె చేయి పట్టుకుని వైజాగ్‌లోని ఒక అందమైన మూన్‌లైట్ బీచ్‌కి తీసుకెళ్లారని తెలిపారు. అక్కడ కూర్చుని, ఆమెను డైవర్ట్ చేయడానికి శోభన్ తనకీ, తన భార్యకీ మధ్య జరిగిన ప్రేమకథను పంచుకున్నారని నందిని గుర్తుచేసుకున్నారు. చిన్న పిల్లల్ని ఓదార్చినట్లుగా తనను ఓదార్చి, ” వాడెవడ్రా నిన్ను గెట్ అవుట్ అనడానికి.? మనం వెళ్లి వాడికి గెట్ అవుట్ చెప్దాం రా” అని ధైర్యం చెప్పారని వివరించారు. శోభన్ చూపిన ఆ ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధలను తాను ఎప్పటికీ మర్చిపోలేనని కన్నీళ్లతో చెప్పారు.
“అది ఒక మూమెంట్. నాకు ఆయన చాలా మిస్సవుతున్నారు. ఆయన నిజంగా ఏ కష్టం వచ్చినా నాకు అండగా నిలిచే వ్యక్తి. నా జీవితంలో ఆయనే నాకు గో-టు పర్సన్” అని నందిని రెడ్డి ఎమోషనల్ అయ్యారు. పరిశ్రమలోకి తాను కొత్తగా వచ్చినప్పుడు, చంద్రలేఖ సెట్‌కి వెళ్లినప్పుడు కూడా శోభన్ తన అప్రిహెన్షన్‌ను అర్థం చేసుకున్నారని తెలిపారు. ఆ రోజు తనను ఇంటికి తీసుకెళ్లి, తన కుటుంబంతో పాటు భోజనం పెట్టి, తన భార్యను పరిచయం చేశారని చెప్పారు. “ఏం నాన్నా, ఏం నాన్నా” అంటూ తనను తన రెక్కల కిందకు తీసుకుని, ఎంతో ప్రేమ, ఆప్యాయత, మద్దతును అందించేవారని నందిని తెలిపారు. శోభన్ ఒక అద్భుతమైన మానవతావాది అని, ఆయన ఇంకా బతికి ఉంటే ఎంతో మంది జీవితాలకు సహాయం చేసేవారని నందిని అన్నారు. ఆయన మరణించినప్పుడు తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయినంత బాధ కలిగిందని, ఆ సమయంలో ఆ నిజాన్ని అంగీకరించడం చాలా కష్టమైందని చెప్పారు. జీవితం ముందుకు సాగినా, ఇప్పుడు శోభన్ కుమారుడు సంతోష్ హీరోగా ఎదిగినప్పుడు, తాను అతనిని చూసిన ప్రతిసారీ శోభన్ గుర్తుకొస్తారని నందిని రెడ్డి తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
