అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే శోభితా ఇంట్లో గోధుమరాయి, పసుపు దంచడం తదితర ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. మరోవైపు అక్కినేని ఫ్యామిలీలో నూ ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ముందుగా గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని అనుకున్నారట. రాజస్థాన్‌లోని ఓ మంచి ప్యాలెస్‌లో నాగ చైతన్య- శోభితల పెళ్లి చేద్దామని ఆలోచించారట. అయితే ఇప్పుడీ ఆలోచనను విరమించుకున్నారట. హైదరాబాద్‌లోనే తన కుమారుడి పెళ్లి చేయాలని నాగార్జున ఫిక్స్ అయ్యారట. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రాండ్ వెడ్డింగ్ కోసం వేదికను సిద్ధం చేసే బాధ్యతలను ఓ ప్రముఖ ఆర్డ్ డైరెక్టర్ కు అప్పగించినట్లు సమాచారం. నాగ చైతన్య- శోభితల వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.
కాగా నాగ చైతన్య- శోభితలు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమను ఇరు పెద్దలు కూడా ఆశీర్వదించడంతో ఈ ఏడాది ఆగస్టులో ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ ప్రేమ పక్షుల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నారు.
కాగా ఎంగేజ్ మెంట్ తర్వాత తమ సినిమా పనుల్లో బిజీ అయిపోయిన ఈ లవ్ బర్డ్స్ తొలిసారిగా జంటగా కనిపించారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు నాగ చైతన్య. చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నార. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే తండేల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.