Ghattamaneni Family: రమేష్ బాబు భార్య మృదుల గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
రమేష్ బాబు భార్య మృదుల ఘట్టమనేని కుటుంబంలో ఒక ఆదర్శ గృహిణిగా, సమర్థవంతమైన వ్యాపార భాగస్వామిగా నిలిచారు. అత్తమామలతో ప్రేమగా మెలగడం, మరిది మహేష్ బాబును ఒక కొడుకుు మాదిరిగా ట్రీట్ చేస్తూ, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించారు. దివంగత రమేష్ బాబు సినీ నిర్మాణ వ్యవహారాల్లో పాలుపంచుకుంటూ, ఆర్థిక కష్టాల్లో అండగా నిలిచి, వ్యాపార దక్షతను ప్రదర్శించారు.

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హీరోగా పది సంవత్సరాల పాటు సినీ పరిశ్రమలో కొనసాగారు.1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు సినిమాలో చిన్ననాటి అల్లూరి పాత్రలో నటించిన రమేష్ బాబు, 1977లో మనుషులు చేసిన దొంగలుతో బాలనటుడిగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. నీడలో కీలక పాత్ర పోషించిన ఆయన, 1987లో సామ్రాట్తో హీరోగా రీ-ఎంట్రీ ఇచ్చారు. బజార్ రౌడీతో సోలో హీరోగా తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ముగ్గురు కొడుకులులో తండ్రి కృష్ణ, తమ్ముడు మహేష్ బాబుతో కలిసి నటించారు. 1994లో పచ్చ తోరణంలో చివరిసారిగా హీరోగా కనిపించిన రమేష్ బాబు, 1997లో ఎన్‌కౌంటర్లో సహాయ పాత్రలో నటించారు. ఆ తర్వాత నటనకు స్వస్తి పలికారు.
రమేష్ కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడు మృదులతో వివాహం జరిగింది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మృదుల, అప్పటినుంచి ఘట్టమనేని కుటుంబానికి ఒక ఆదర్శ గృహిణిగా, బలమైన ఆధారంగా నిలిచారు. మృదుల తన తొలి రోజుల్లో అత్తమామలను ఎంతో అద్భుతంగా చూసుకునేవారు. కుటుంబ సభ్యులందరి పట్ల ఆమె చూపించిన ప్రేమ, అనురాగాలు అపారమైనవని ఫిల్మ్ జర్నలిస్టులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా మరిది మహేష్ బాబును, ఆడపడుచులు పద్మావతి, మంజుల, ప్రియదర్శినిలను ఆమె ప్రేమగా చూసుకున్నారు. మహేష్ బాబు కూడా తమ కుటుంబ వ్యవహారాల్లో వదిన మృదుల మాటకు అత్యంత విలువిస్తారని ఘట్టమనేని కుటుంబ సన్నిహితులు చెబుతుంటారు. రమేష్ బాబు నటనకు స్వస్తి చెప్పి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టినప్పుడు, మృదుల ఆయనకు వెన్నంటి నిలిచారు. రమేష్ బాబు ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, కృష్ణా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థల్లో ఆమె బోర్డ్ డైరెక్టర్లలో ఒకరిగా ఉంటూ, వ్యాపార వ్యవహారాలను సమర్థవంతంగా పర్యవేక్షించారు. అర్జున్, అతిథి వంటి సినిమాలతో రమేష్ బాబు ఆర్థికంగా దెబ్బతిన్న క్లిష్ట పరిస్థితుల్లోనూ మృదుల ధైర్యంగా అండగా నిలిచారు. అంతేకాదు, ఆయనను దూకుడు, ఆగడు వంటి సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించేలా ప్రోత్సహించారు. తిరిగి తమ సంస్థలను లాభాల బాటకు తీసుకురావడంలో మృదుల వ్యాపార దక్షత ఎంతో ప్రశంసనీయం.
ఓ వైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే, మరోవైపు తమ కంపెనీ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మృదుల ఆదర్శ గృహిణిగా పేరు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయేవరకు మృదులను తన పెద్ద కూతురిగానే ట్రీట్ చేశారట. మృదుల, రమేష్ బాబు దంపతులకు భారతి, జయకృష్ణ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి ఐదుగురు సంతానంలో రమేష్ బాబే పెద్దవారు. ఆయన తర్వాత మంజుల, పద్మావతి, మహేష్ బాబు, ప్రియదర్శిని ఉన్నారు. రమేష్ బాబు అనారోగ్యంతో మరణించినప్పుడు కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ సమయంలోనూ మృదుల ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించి, కుటుంబానికి అండగా నిలిచారు. ఆమె ఘట్టమనేని కుటుంబానికి ఒక ప్రేరణగా, శక్తిగా నిలిచారు. కాగా రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ ఇటీవలే.. శ్రీనివాస మంగాపురం సినిమాతో తెరంగేట్రం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
