14 సెంచరీలు, 5,000కుపైగా పరుగులు.. సడన్‌గా ఇలా చేశాండేది భయ్యా..!
దక్షిణాఫ్రికా టెస్ట్ దిగ్గజం డీన్ ఎల్గర్ తన 21 ఏళ్ల ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. 86 టెస్టుల్లో 14 సెంచరీలు, 5,347 పరుగులు సాధించిన ఈ మాజీ కెప్టెన్, 2026 కౌంటీ సీజన్ తర్వాత పూర్తిగా ఆటకు దూరమవుతారు. కుటుంబంతో సమయం గడపడమే తన రిటైర్‌మెంట్ నిర్ణయానికి ప్రధాన కారణమని ఎల్గర్ వెల్లడించారు. టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ ఫైటర్ ప్లేయర్‌కు ఇది చివరి సీజన్.

టెస్టుల్లో 14 సెంచరీలు, 5,000కు పైగా పరుగులు సాధించిన ఆ దిగ్గజ బ్యాట్స్‌మెన్, 20 ఏళ్ల కెరీర్‌కు అకస్మాత్తుగా ముగింపు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయనెవరో కాదు, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ డీన్ ఎల్గర్. ప్రొఫెషనల్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీ జట్టు ఎసెక్స్ తరపున ఆడుతున్న 39 ఏళ్ల ఎల్గర్.. 2026 కౌంటీ సీజన్ ముగిసిన తర్వాత ఆటకు పూర్తిగా దూరమవుతానని వెల్లడించాడు. దీంతో రెండు దశాబ్దాలకు పైగా సాగిన అతడి సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి తెరపడనుంది.
కుటుంబం కోసమే ఈ నిర్ణయం..
రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ప్రధాన కారణాన్ని కూడా ఎల్గర్ వెల్లడించాడు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో ఇక కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు.
తన పిల్లలు వేగంగా ఎదుగుతున్నారని.. భాగస్వామి, పిల్లలతో కలిసి ఉండటానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. సుదీర్ఘకాలం క్రికెట్ కోసం ప్రయాణాలు చేసిన తనకు ఇప్పుడు కుటుంబం కోసం సమయం కేటాయించాలనుందని స్పష్టం చేశాడు.
86 టెస్టులు.. 5,347 పరుగులు..
డీన్ ఎల్గర్ దక్షిణాఫ్రికా తరపున 86 టెస్టులు ఆడాడు. 37.92 సగటుతో 5,347 పరుగులు సాధించాడు. అతడి టెస్టు కెరీర్‌లో 14 శతకాలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి.
2017లో బంగ్లాదేశ్‌పై చేసిన 199 పరుగులు అతడి అత్యధిక టెస్టు స్కోరు. కేవలం ఒక పరుగు తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకున్నా.. ఆ ఇన్నింగ్స్ అతడి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.
దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా 18 మ్యాచ్‌లు..
ఎల్గర్ కేవలం బ్యాటర్‌గానే కాకుండా దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. మొత్తం 18 టెస్టుల్లో ప్రొటీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన కెప్టెన్సీ కాలంలో జట్టును ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానం నుంచి రెండో స్థానానికి తీసుకెళ్లిన ప్రయాణాన్ని తన కెరీర్‌లో గర్వించదగ్గ ఘట్టంగా ఎల్గర్ పేర్కొన్నాడు. కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో సాధించిన విజయం తనకు ప్రత్యేకమైనదని చెప్పాడు.
2006లో అండర్ 19 ప్రపంచకప్‌కు కెప్టెన్ గా..
ఎల్గర్ దక్షిణాఫ్రికా క్రికెట్‌లో చిన్న వయసులోనే తన ప్రతిభను చాటుకున్నాడు. 2006 అండర్-19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అనంతరం అంతర్జాతీయ స్థాయిలో ఎదిగి.. దాదాపు 12 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఇంగ్లాండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఎసెక్స్ తరఫున ఆడుతున్నాడు.
ఎసెక్స్‌తోనూ కీలక పాత్ర..
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత 2024లో ఎసెక్స్ జట్టులో చేరిన ఎల్గర్.. అక్కడ సీనియర్ బ్యాటర్‌గా కీలక పాత్ర పోషించాడు. యువ ఆటగాళ్లకు తన అనుభవాన్ని పంచుకోవడంతో పాటు క్రీజులో ఎక్కువసేపు నిలబడే పాతతరం బ్యాటింగ్ శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఎసెక్స్ క్రికెట్ డైరెక్టర్ క్రిస్ సిల్వర్‌వుడ్ కూడా ఎల్గర్ సుదీర్ఘ కెరీర్, పట్టుదల, క్రికెట్‌పై అతడికున్న నిబద్ధతను ప్రశంసించాడు.
జట్టు కోసం ఏదైనా చేస్తా..
తనను అభిమానులు ఎలా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాడో కూడా ఎల్గర్ చెప్పాడు. ఎప్పుడూ గెలుపే లక్ష్యంగా మైదానంలో పోరాడే ఆటగాడిగా తనను గుర్తుంచుకోవాలని అన్నాడు.
ఓటమి ఎదురైనప్పటికీ ప్రత్యర్థి ఆటగాళ్లను గౌరవిస్తూ చేతులు కలిపే వ్యక్తిగా ఉండాలనుకున్నానని చెప్పాడు. జట్టు కోసం కష్టపడటానికి, అవసరమైతే గాయాలను కూడా లెక్కచేయకుండా పోరాడటానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడినని తెలిపాడు.
21 ఏళ్ల ప్రయాణానికి చివరి అడుగు..
ఎల్గర్ ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ 21 ఏళ్లకు పైగా సాగింది. అంతర్జాతీయ స్థాయిలో కఠిన పరిస్థితుల్లోనూ నిలకడగా పరుగులు చేసిన బ్యాటర్‌గా అతడికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇప్పుడు 2026 కౌంటీ సీజన్ అతడి కెరీర్‌లో చివరి అధ్యాయం కానుంది. సీజన్ పూర్తయిన తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్న ఎల్గర్.. రెండు దశాబ్దాలకు పైగా తన జీవితంలో భాగమైన క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. పోరాటం.. పట్టుదల.. జట్టు కోసం త్యాగం.. ఇవే తన క్రికెట్ ప్రయాణానికి గుర్తులుగా మిగలాలని కోరుకుంటున్న ఈ సౌతాఫ్రికా దిగ్గజానికి ఇదే చివరి కౌంటీ సీజన్!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




