Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur kaaram Review: గుంటూరు కారం ఫుల్ రివ్యూ.. ఇరగదీసిన మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు పూనకాలే

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారంపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి సినిమాల్లో అదే అగ్ర తాంబూలం తీసుకుంది. మరి అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Guntur kaaram Review: గుంటూరు కారం ఫుల్ రివ్యూ.. ఇరగదీసిన మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు పూనకాలే
Gunturukaaram
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 12, 2024 | 6:52 AM

మూవీ రివ్యూ: గుంటూరు కారం

నటీనటులు: మహేష్ బాబు శ్రీ లీల మీనాక్షి చౌదరి రమ్యకృష్ణ జయరాం జగపతిబాబు వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్ తదితరులు

సంగీతం: తమన్

ఎడిటర్: నవీన్ నూలి

సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస

నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ

రచన- దర్శకత్వం: త్రివిక్రమ్

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారంపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి సినిమాల్లో అదే అగ్ర తాంబూలం తీసుకుంది. మరి అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

వెంకట రమణ (మహేష్ బాబు) గుంటూరు మిర్చి యార్డులో ఉంటాడు. పదేళ్ల వయసులోనే అమ్మ (రమ్యకృష్ణ) వదిలేసి వెళ్లడంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు. అయితే పాతికేళ్ల తర్వాత తాత (ప్రకాష్ రాజ్) నుంచి రమణకు పిలుపు వస్తుంది. కూతురు రాజకీయ జీవితానికి అడ్డు రాకుండా ఉండాలని రమణతో ఒక సంతకం చేయించాలి అనుకుంటాడు ఆయన తాత. కానీ అమ్మ మీద కోపంతో రమణ ఆ సంతకం చేయడు. ఈ పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు లాయర్ పాని (మురళి శర్మ) కూతురు ఆముక్త మాల్యద (శ్రీలీల) చూసి ప్రేమలో పడతాడు. ఇదిలా ఉంటే పదేళ్ల వయసులోనే రమణను అమ్మ ఎందుకు వదిలేస్తుంది.. ఆ తర్వాత పాతికేళ్లకు మళ్ళీ ఎందుకు పిలుస్తుంది అనేది అసలు కథ..

కథనం:

ఏ దర్శకుడు సినిమా అయినా యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.. కామెడీ ఎలా ఉందో చూద్దాం అనుకుంటారు.. కానీ త్రివిక్రమ్ సినిమా మాత్రమే మాటల కోసం చూస్తారు. ఆయన పెన్నుకు ఉన్న పవర్ అలాంటిది. అలా మాటలతో మాయ చేయడం గురూజీ స్టైల్. గుంటూరు కారం మొదటి నుంచి ఒకే టెంపోలో వెళుతుంది. ఈ సినిమాను ప్రధానంగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ చుట్టూ రాసుకున్నాడు త్రివిక్రమ్. విడిపోయిన తల్లి కొడుకులను కలిపే కథ ఇది. కథాపరంగా చూసుకుంటే చాలా చాలా సింపుల్ కానీ స్క్రీన్ ప్లేతో మాయ చేయాలని చూశాడు త్రివిక్రమ్. అందులో సక్సెస్ అయ్యాడు కూడా. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల కంటే ఈ సారి యాక్షన్ సీన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు గురూజీ. దానికి తోడు చాలా రోజుల తర్వాత వన్ లైనర్స్ ఎక్కువగా రాశాడు. అన్నింటికీ మించి గుంటూరు యాస ఉండడంతో పాటు.. మాటల్లో ఎటకారం కూడా ఎక్కువగా ఉంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం మహేష్ బాబు కామెడీతోనే అయిపోతుంది. రెండు మూడు యాక్షన్ సీన్స్, చాలా వరకు అభిమానులు కోరుకునే సన్నివేశాలతోనే నింపేశాడు మాటల మాంత్రికుడు. ఇంటర్వెల్ వరకు కూడా కథలో పెద్దగా వేగం ఉండదు. సెకండాఫ్ మాత్రం కాస్త బెటర్ గా రాసుకున్నాడు త్రివిక్రమ్. ఫన్ మూమెంట్స్ చాలానే ఇచ్చాడు త్రివిక్రమ్. మహేష్ బాబు ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కేవలం ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గుంటూరు కారం సినిమాను కాపాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రమ్యకృష్ణ, మహేష్ మధ్య బాండింగ్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. మహేష్, శ్రీలీల మధ్య వచ్చే ట్రాక్ అంతా ఆకట్టుకుంటుంది.. సరదా సరదాగా గడిచిపోతుంది. మహేష్ బాబును మాత్రమే చూడాలి అనుకుంటే గుంటూరు కారం అదిరిపోయింది.. చాలా కాలం తర్వాత మహేష్ లోని కామెడీ యాంగిల్ ఇందులో బయటికి వచ్చింది.

నటీనటులు:

మహేష్ బాబు నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మరోసారి పూర్తిగా స్క్రీన్ మీద విశ్వరూపం చూపించాడు సూపర్ స్టార్. తన భుజాలపై గుంటూరు కారం సినిమాను మోసాడు. శ్రీ లీల ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మీనాక్షి చౌదరి జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపిస్తుంది అంతే. డైలాగ్స్ పెద్దగా ఉండవు. రమ్యకృష్ణ క్యారెక్టర్ కూడా అంతంత మాత్రం గానే ఉంది. ఇంపార్టెంట్ రోల్ అయినా కూడా ఎందుకు త్రివిక్రమ్ ఆమెను పూర్తిస్థాయిలో వాడుకోలేదు అనిపించింది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్, జయరాం లాంటి వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

తమన్ సంగీతం ఓకే. రీ రికార్డింగ్ రిపీట్ మోడ్ లో అనిపించినా.. కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రం అదిరిపోయింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది కానీ త్రివిక్రమ్ నిర్ణయం కాబట్టి చేసేదేం లేదు. దర్శకుడిగా కంటే రచయితగా త్రివిక్రమ్ ఈసారి ఎక్కువ మ్యాజిక్ చేసాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా గుంటూరు కారం.. రమణ గాడు పండక్కి గుర్తుండిపోతాడు..