K.Viswanath: కళాతపస్వి సినిమాల్లో సంగీతానికి పెద్ద పీట.. ఎవర్‌గ్రీన్ సాంగ్స్.. ఏ సినిమాలోనివో తెలుసా..

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, కళలకు పట్టంకడుతూ తెరకెక్కిన శంకరాభరణం సినిమాలో పాటలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి.

K.Viswanath: కళాతపస్వి సినిమాల్లో సంగీతానికి పెద్ద పీట.. ఎవర్‌గ్రీన్ సాంగ్స్.. ఏ సినిమాలోనివో తెలుసా..
K Viswanath Hit Songs
Follow us

|

Updated on: Feb 03, 2023 | 8:57 AM

విశ్వనాథ్‌ సినిమాలు అంటే సంగీతం – సంగీతం అంటే విశ్వనాథ్‌ సినిమాలు అన్నంతగా ఆయన చిత్రాలు తెరకెక్కాయ్. విశ్వనాథ్‌ ప్రతి సినిమాలోనూ సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఉండేది. ప్రతి పాటా ఒక ఆణిముత్యమే, ఒక అద్భుతమే. ఆ సినిమాల్లోని ప్రతి పాటా ఎంతో మధురంగా శ్రావ్యంగా ఉంటాయ్‌. పిల్లాడికి జోల పాడినట్టు, బుజ్జగిస్తున్నట్టు సాగుతాయ్‌. అంత అందంగా ఉంటాయ్‌ విశ్వనాథ్‌ సినిమాల్లోని పాటలు. ప్రేక్షకుల అభిరుచులను మార్చేసిన సినీ మాంత్రికుడు విశ్వనాథ్‌. తన ప్రతి సినిమాను ఒక అద్భుత కళారూపంగా మలిచేవారు. అప్పటివరకున్న మూస పద్ధతికి భిన్నంగా సినిమాలు తీస్తూ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప దర్శకుడు విశ్వనాథ్‌. సినీ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచి దశాబ్దాలు గడిచినా తన సినిమాలను గుర్తుపెట్టుకునేలా చేసిన సినీ దిగ్గజం విశ్వనాథ్‌.

విశ్వనాథ్‌ సినీ జీవితంలో శంకరాభరణం ఓ మైల్‌స్టోన్‌ మూవీ. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా… తెలుగు సినిమాకు సరికొత్త దారి చూపించింది. తెలుగు ఫిల్మ్ హిస్టరీలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, కళలకు పట్టంకడుతూ తెరకెక్కిన శంకరాభరణం సినిమాలో పాటలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి.

అప్పటివరకున్న ట్రెండ్‌కి భిన్నంగా తెరకెక్కిన సినిమా శంకరాభరణం. 1980లో విడుదలైన ఈ సినిమా ఒక పెను సంచలనం. సంగీత ప్రధానంగా వచ్చిన శంకరాభరణం మూవీ… తెలుగు సినిమా దిశాదశ మార్చేసింది. ఈ సినిమాలోని సంగీతం, సాహిత్యం ఇప్పటికీ వీనుల విందుగా ఉంటుందంటే విశ్వనాథ్‌ దర్శక నైపుణ్యం ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. శంకరాభరణం సినిమాలోని పాటలు తెలుగు సినిమా రూపురేఖల్నే మార్చేశాయ్‌.

ఇవి కూడా చదవండి

స్వాతిముత్యం, ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్‌ హిట్‌. 1985లో రిలీజైన ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది. కమల్‌హాసన్‌లోని మరో నటుడిని ఆవిష్కరించింది. ఈ మూవీలోని ప్రతి పాట ఎంతో శ్రావ్యంగా ఉంటాయ్‌. చెవులకు హాయినిస్తాన్‌. వటపత్ర శాయికి వరహాల లాలి-రాజీవ నేత్రునికి రతనాల లాలి-మురిపాల కృష్ణునికి మత్యాల లాలి-జగమేలు స్వామికి పగడాల లాలి పాట అయితే సంగీత ప్రియులను మరో లోకంలోకి తీసుకెళ్లింది.

స్వాతిముత్యంలోని సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సాంగ్‌ అయితే మరో ఎత్తు. ఈ పాటలోని సాహిత్యం, భావం మనల్ని మనమే ప్రశ్నించుకునేలా ఉంటుంది. విశ్వనాథ్‌ సినిమాల్లోని పాటలు… ఎలా ఉంటాయో, సాంగ్స్‌కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మరోసారి తెలియజెప్పిన పాట ఇది.

స్వాతిముత్యంలో ప్రతి పాటా ఒక ఆణిముత్యమే, సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. మనసు పలికే మౌనగీతం-మమత లొలికే స్వాతిముత్యం-అణువు అణువు ప్రణయ మధువు అంటూ సాగే సాంగ్‌ నవదంపతుల భావోద్వేగాలను సరికొత్తగా ఆవిష్కరించింది.

కె.విశ్వనాథ్‌ ప్రతి సినిమాకీ సంగీతమే ప్రాణం. కథతోపాటు సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం విశ్వనాథ్‌ స్టైల్‌. అలాంటి సినిమాల్లో ఒకటి సిరివెన్నెల. 1986లో వచ్చిన సిరివెన్నెల సినిమా సైతం సంగీత ప్రియుల్ని ఓలలాడించింది. ప్రతి పాటా ఒక ఆటం బాంబులా పేలింది. విధాత తలపున ప్రభవించినది-అనాది జీవన వేదం-అది ప్రణవ నాదమ్‌ అంటూ ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లిపోయారు విశ్వనాథ్‌.

సంగీత ప్రాధాన్యమున్న సిరివెన్నెల చిత్రంలో అన్ని పాటలూ సూపర్‌ హిట్టే. ఆదిభిక్షువు వాడినేమి కోరేది-బూడిదిచ్చే వాడినేమి అడిగేది, ఈ గాలి-ఈ నేల… ఈ ఊరు సెలయేరు, చందమామ రావే జాబిల్లి రావే… ఇలా ప్రతి పాటా ప్రజలను అలరించాయ్‌. ఎంతో మధురంగా, శ్రావ్యంగా సాగిన పాటలు ఒక ఊపు ఊపాయి.

1987లో వచ్చిన శృతిలయలు మూవీ ఓ సంచలనం. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకోవడమే కాకుండా, ఉత్తమ దర్శకునిగా నంది పురస్కారం, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు విశ్వనాథ్‌. ఈ సినిమాలోని ఇన్ని రాశులయునికీ-ఇంతి చెలువపు రాశి-కన్నె రాశి కూటమి సాంగ్‌ సూపర్‌ హిట్‌. రాశుల గురించి వివరిస్తూ వచ్చిన ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌.

తెలవారదేమో స్వామి-నీ తలపున మునకలో అలసిన దేవేరి అలవేలు మంగకు, శ్రుతిలయలు సినిమాలోని మరో పాట ఇది. ఈ పాట ఉత్తమ నంది అవార్డు గెలుచుకుంది.

1988లో విడుదలైన స్వర్ణ కమలం మరో మ్యూజికల్‌ సూపర్ డూపర్‌ హిట్‌. ఈ సినిమా కూడా ఉత్తమ నంది అవార్డు గెలుచుకుంది. ఉత్తమ నటీనటులుగా వెంకటేష్‌, భానుప్రియ నంది పురస్కారాలు అందుకున్న ఈ మూవీ సంగీత ప్రియులను అలరించింది. అందెల రవమిది పదములదా అంటూ బాలు-వాణిజయరాం కలిసి ఆలపించిన పాట ఇప్పటికీ మధురానుభూతికి పంచుతుంది.

స్వాతికిరణం, 1992లో వచ్చిన ఈ సినిమాకి ప్రాణమే సంగీతం. సంగీత ప్రధానమైన చిత్రంగా తెరకెక్కిన స్వాతికిరణంలోని ప్రతి పాటా ఒక ఆణిముత్యమే. సంప్రదాయ సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఈర్ష్యా ద్వేషాలను కళ్లకు కట్టినట్టు చూపించారు విశ్వనాథ్‌. ఈ మూవీలోని ఆనతినీయరా హరా-సన్నుతి సేయగా-సమ్మతినీయరా దొరా అంటూ సాగిన పాట మరో అద్భుతం. ఈ పాటకు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డు గెలుచుకున్నారు సింగర్‌ వాణిజయరాం

కుల వ్యవస్థ, వరకట్నం లాంటి సామాజిక ఇష్యూస్‌ని ప్రశ్నిస్తూ అనేక సినిమాలను తెరకెక్కించారు విశ్వనాథ్‌. సప్తపది, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం, శుభలేఖ, శుభోదయం ఆ కోవలోని సినిమాలే. అలా వచ్చినదే స్వయంకృషి మూవీ. డిగ్నిటీ ఆఫ్ లేబర్ థీమ్‌తో థీమ్‌తో… చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్‌ హిట్టే. సిన్నీసిన్నీ కోరికలడగ సీనివాసుడు నన్నడగ పాట అప్పట్లో అందరి నోట్లో నానింది.

1987లో విడుదలైన స్వయంకృషి చిత్రంలోని పాటలన్నీ సంగీత ప్రియులను అలరించాయ్‌. సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి-మొగ్గా సింగారం సాంగ్‌ అయితే సరికొత్త ట్రెండ్‌కి నాంది పలికింది.

ఏదో అద్భుత కళాఖండం కట్టినట్టుగా, గులాబీ మొక్కకు అంటుకట్టినట్టుగా ఉంటాయ్‌ విశ్వనాథ్‌ సినిమాలు. ఆయన సినిమాలే కాదు… సినిమాల్లోని పాటలూ అలాగే ఉంటాయి. అందుకే, విశ్వనాథ్‌ సినిమాలే కాదు… ఆయన సినిమాల్లోని పాటలు కూడా అప్పుడు ఇప్పుడూ ఎవర్‌గ్రీనే. అందుకే, ఆయన సినిమాలన్నీ చరిత్రలో నిలిచిపోయాయి. ప్రజల హృదయాలపై బలమైన ముద్ర వేసుకున్నాయి.

తన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోతున్న ప్రజలకు తమ కళలను గుర్తుచేస్తూ ప్రేక్షకులకు కొత్త రుచులను చూపించారు విశ్వనాథ్‌. శంకరాభరణం సినిమా వచ్చి నాలుగు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే అదీ విశ్వనాథ్‌ గొప్పతనం. ఎన్నో అద్భుత పాత్రలను సృష్టించారు. విలువలను వదలకుండా తరతరాల ప్రేక్షకులను అలరించేలా జనరంజకంగా సినిమాలను తెరకెక్కించిన సినీ దిగ్గజం ఆయన. అందుకే, తెలుగు సినీ పరిశ్రమలో ఆయన కీర్తి అజరామరం. ఆ మాటకొస్తే భారత చలనచిత్ర పరిశమ్రలోనే గొప్ప దర్శకుడు, ఒక లెజెండ్‌ విశ్వనాథ్‌

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..