సెక్యూరిటీ గార్డులు బయటకు నెట్టేశారు.. ఆయన డైరెక్టర్ కాళ్ళు పట్టుకొని నాకు అవకాశం ఇప్పించాడు..
కంటెంట్ పరంగా కొన్ని విమర్శలున్నా జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు. గతంలోలా ఇప్పుడీ షోకు అంత క్రేజ్, ఆదరణ లేకపోయినా చాలా మంది ఈ షోతోనే తమ ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. జబర్దస్త్ లో కంటెస్టెంట్లుగా, టీమ్ లీడర్స్ గా చేసిన వారిలో ఇప్పుడు చాలా మంది వెండితెరపై వెలుగుతున్నారు.

జబర్దస్త్ నటుడు రాజమౌళి ఓ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు బోలే షావలితో తనకున్న అనుబంధాన్ని వివరించారు. తన జీవితంలోని కీలక మలుపులలో బోలే షావలి ఎలా అండగా నిలిచారో రాజమౌళి భావోద్వేగంతో పంచుకున్నారు. కేవలం కెరీర్ ప్రారంభంలోనే కాకుండా, అత్యంత క్లిష్టమైన కరోనా మహమ్మారి సమయంలోనూ బోలే షావలి చూపిన ప్రేమ, అండ రాజమౌళికి పునర్జన్మ నిచ్చాయని తెలిపారు. రాజమౌళి సినీ రంగ ప్రవేశానికి బోలే షావలి ఒక వారధిగా నిలిచారు. మహబూబాబాద్‌లో శ్రీరామభద్ర అన్న ప్రోగ్రాంలో రాజమౌళి ప్రదర్శనను చూసిన బోలే షావలి, ఆయన ప్రతిభను గుర్తించి సినిమా ప్రపంచానికి పరిచయం చేయాలని సంకల్పించారు. 16 ఏళ్ల వయసు అనే సినిమా అవకాశం కోసం రాజమౌళిని ప్రొడ్యూసర్, డైరెక్టర్ మీటింగ్‌కు తీసుకెళ్లారు. ఆ రోజు రాజమౌళి తాగిన వ్యక్తిగా నటించాల్సి వచ్చింది. సెక్యూరిటీ గార్డుల చేత బయటకు నెట్టేశారట, లోపలికి వెళ్లి బోలే షావలి పట్టుదలతో ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాళ్ళు పట్టుకొని, “ఈ అబ్బాయికి అవకాశం ఇయ్యండి సార్. గొప్ప ఆర్టిస్ట్” అని వేడుకున్నారు. ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటూ, తన కెరీర్‌కు పునాది వేసిన బోలే షావలిని రాజమౌళి మహానుభావుడిగా అభివర్ణించారు. ఆ తర్వాత శ్రీహరి గారి “యమహో యమ” చిత్రంలో బోలే షావలి ద్వారానే తనకు అవకాశం వచ్చిందని రాజమౌళి తెలిపారు. జితేందర్ ఈ సినిమాకు దర్శకులుగా వ్యవహరించారు. అంతకుముందు “జాతరకు వచ్చిన హీరోలు” అనే మినీ మూవీలో గెటప్ శ్రీనుతో కలిసి తాను నటించినట్లు కూడా రాజమౌళి వెల్లడించారు.
కరోనా మహమ్మారి సమయంలో రాజమౌళి తీవ్ర అనారోగ్యం పాలై, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు బోలే షావలి ఒక దేవదూతలా అండగా నిలిచారట. కూకట్‌పల్లిలోని పద్మజ హాస్పిటల్‌లో చేరడానికి డబ్బులు లేని స్థితిలో, అర్థరాత్రి 12 గంటల సమయంలో, వర్షం పడుతున్నా కూడా బోలే షావలి స్వయంగా వచ్చి లక్ష రూపాయల అడ్మిషన్ ఫీజు చెల్లించారని, అప్పటి ఖర్చుల కోసం పదివేలు ఇచ్చి వెళ్ళారని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. అప్పుడు రాజమౌళి షుగర్ స్థాయి 573 శాతం పెరిగి, శరీరం చికిత్సకు సహకరించలేదట. ఈ క్లిష్ట సమయంలో, బోలే షావలి ఇంట్లో స్వయంగా పచ్చ జొన్నలు కొని తెచ్చి, గ్రైండ్ చేసి గడక వండించి, మటన్, చికెన్ తెచ్చి వండి ప్రతిరోజూ హాస్పిటల్‌కు తీసుకొచ్చేవారట. ఆ ఆహారం ద్వారానే రాజమౌళి షుగర్ స్థాయి అదుపులోకి వచ్చి, చికిత్స ప్రారంభమైందని తెలిపారు. కోవిడ్ ఆసుపత్రికి రావడానికి భయపడని బోలే షావలి ధైర్యం, రాజమౌళి పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. ఒకవేళ బోలే రాలేకపోతే, తన అసిస్టెంట్‌నో లేదా డ్రైవర్‌నో పంపించి ఆహారం అందించేవారట. అంతేకాదు, ఆసుపత్రి మేనేజ్‌మెంట్ చేస్తున్న ప్రభు సురేష్‌తో మాట్లాడి, “ఈ అబ్బాయికి ఏమైనా అయితే, రెండు రాష్ట్రాల్లో ఉన్న తన అభిమానులు మీ హాస్పిటల్‌ను ఊరుకోరు. సరైన చికిత్స అందించాలి” అని హెచ్చరించి, సరైన వైద్యం అందేలా చూశారని రాజమౌళి తెలిపారు.
బోలే షావలి గొప్ప మానవతావాది, అన్నదాత అని రాజమౌళి ప్రశంసించారు. మహబూబాబాద్ నుండి ఎవరైనా వచ్చినా, ముందుగా కడుపు నిండిందా అని అడిగి, ఆకలి తీర్చాకే మిగిలిన విషయాలు మాట్లాడతారని రాజమౌళి అన్నారు. సమయం ఉంటే వండి పెడతారని, లేకపోతే కొనుక్కుని వచ్చి పెడతారని వివరించారు. ఎవరినీ పస్తు ఉంచని గొప్ప మనసు బోలే గారిదని పేర్కొన్నారు. నాభి నిండితే నవాబుకైనా జవాబు చెప్పొచ్చు అనే నానుడిని గుర్తు చేస్తూ, బోలే షావలి ఎప్పుడూ ఇతరుల ఆకలిని తీర్చడానికే ప్రాధాన్యత ఇస్తారని రాజమౌళి అన్నారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న అప్ కమింగ్ ఆర్టిస్టులకు బోలే షావలి వెంటనే సహాయం చేస్తారని రాజమౌళి వెల్లడించారు. కరోనా సమయంలో బోలే ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వబోయినప్పుడు, “నువ్వు ఏడ్చుకుంటూ తీసుకుపోయావు, నవ్వుకుంటూ వచ్చి నాకు ఇవ్వు. అప్పటిదాకా ఇయ్యకు నాకు” అని బోలే అన్న మాటలు రాజమౌళిని ఎంతగానో కదిలించాయి. బోలే షావలి కేవలం ఒక సంగీత దర్శకుడే కాదు, ఒక ప్రాణదాత, ఆపదలో అండగా నిలిచే నిజమైన స్నేహితుడు అని రాజమౌళి భావోద్వేగంతో తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
