ఐవోఏ ఎన్నికల్లో పీటీ ఉషకు బిగ్ షాక్.. సైనా నెహ్వాల్‌కు కీలక పదవి..!
PT Usha IOA Election: భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు పీటీ ఉషకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న ఆమెకు తాజా ఎన్నికల్లో ఆశించిన మద్దతు లభించలేదు. క్రీడాకారుల ప్రతినిధుల ఎంపిక కోసం జరిగిన పోలింగ్‌లో 40 ఓట్లతో ఐదో స్థానానికి పరిమితమయ్యారు. మరోవైపు సైనా నెహ్వాల్, అంజు బాబీ జార్జ్ సహా నలుగురు మహిళా క్రీడాకారిణులు అర్హత సాధించారు.

PT Usha IOA Election: భారత క్రీడా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ఒలింపిక్ సంఘం (Indian Olympic Association – IOA) అధ్యక్షురాలు పీటీ ఉష (PT Usha)కు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. రెండోసారి అధ్యక్షురాలిగా కొనసాగాలని భావిస్తున్న ఆమెకు క్రీడాకారుల ప్రతినిధుల ఎంపికలో తగిన మద్దతు లభించలేదు. ఐవోఏ జనరల్ బాడీలో అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారుల (SOM) ప్రతినిధుల ఎంపిక కోసం సోమవారం ఆన్‌లైన్‌లో పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఉష ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు.
సైనా, అంజు బాబీ జార్జ్‌కు అవకాశం..!
మహిళల ప్యానెల్‌లో మొత్తం ఆరుగురు పోటీ పడగా.. ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ (Saina Nehwal), మాజీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ (Anju Bobby George), మాజీ ఆర్చర్ డోలా బెనర్జీ (Dola Banerjee), మాజీ హాకీ కెప్టెన్ రాణీ రాంపాల్ (Rani Rampal) టాప్-4లో నిలిచారు. దీంతో వీరంతా ప్రతినిధులుగా అర్హత సాధించారు. మరోవైపు 40 ఓట్లు మాత్రమే పొందిన పీటీ ఉష ఐదో స్థానానికి పరిమితమయ్యారు. ఆరో స్థానంలో నిలిచిన మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి అనితా పాల్ కూడా అర్హత సాధించలేకపోయారు.
పురుషుల ప్యానెల్ ఏకగ్రీవం..!
మహిళల విభాగంలో పోటీ ఆసక్తికరంగా సాగగా.. పురుషుల ప్యానెల్‌లో మాత్రం నలుగురు ప్రముఖ క్రీడాకారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ (Gagan Narang), మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ (Vijender Singh), మాజీ రెజ్లర్ యోగేశ్వర్ దత్ (Yogeshwar Dutt), మాజీ టేబుల్ టెన్నిస్ ఆటగాడు కమలేష్ మెహతా (Kamlesh Mehta)కు అవకాశం దక్కింది.
పీటీ ఉష అధ్యక్ష పదవిపై ప్రభావం ఉంటుందా..?
తాజా పోలింగ్‌లో ఓటమి పీటీ ఉషకు రాజకీయంగా, క్రీడా పరిపాలన పరంగా కీలక పరిణామంగా మారింది. అయితే ఈ ఫలితం ఒక్కటే ఆమె ఐవోఏ అధ్యక్ష పదవికి సంబంధించిన తుది నిర్ణయాన్ని సూచించదు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. భారత ఒలింపిక్ సంఘంలో క్రీడాకారుల ప్రతినిధుల ఎంపికలో చోటుచేసుకున్న ఈ మార్పులు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
