AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eagle Movie Review: ‘ఈగల్’ మూవీ రివ్యూ.. రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మెప్పించిందా ?..

సూర్య వర్సెస్ సూర్య తర్వాత దాదాపు పదేళ్ల గ్యాప్ తీసుకుని యంగ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ఈగల్. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతికి రావాల్సి ఉన్నా.. మిస్ అయిపోయింది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం..

Eagle Movie Review: 'ఈగల్' మూవీ రివ్యూ.. రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మెప్పించిందా ?..
Eagle Movie OTT
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 09, 2024 | 12:46 PM

Share

మూవీ రివ్యూ: ఈగల్

నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య తపర్, వినయ్ రాయ్, నవదీప్, అజయ్ ఘోష్, మధుబాల, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని, కరమ్ చావ్లా, కమిల్ ప్లొచ్కీ

ఎడిటర్: కార్తిక్ ఘట్టమనేని

సంగీతం: దేవ్‌జండ్

నిర్మాతలు: టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కార్తిక్ ఘట్టమనేని

సూర్య వర్సెస్ సూర్య తర్వాత దాదాపు పదేళ్ల గ్యాప్ తీసుకుని యంగ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ఈగల్. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతికి రావాల్సి ఉన్నా.. మిస్ అయిపోయింది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం..

కథ:

తలకోనలోని ఓ కొండ మీద రెండు గిరిజన తెగలు సహదేవ్ వర్మ (రవితేజ) విగ్రహాన్ని పెట్టుకొని దేవుడిలా పూజలు చేస్తుంటారు. మరోవైపు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ నళిని రావు (అనుపమ పరమేశ్వరన్) ఒకరోజు తన న్యూస్ పేపర్లో పత్తి గురించి ఓ ఆర్టికల్ రాస్తుంది. ఆ ఒక్క ఆర్టికల్ కారణంగా దేశమంతా అలెర్ట్ అవుతుంది. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. నళినిని కూడా ఇంటరాగేట్ చేస్తారు. ఒక్క ఆర్టికల్‌కే ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారని.. అప్పుడు సహదేవ్ గురించి ఆరా తీయడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలోనే కామ్రేడ్ పద్మ (ప్రణీత పట్నాయక్), ఆ ఊరు ఎమ్మెల్యే (అజయ్ ఘోష్), అతని పిఎ (శ్రీనివాస్ రెడ్డి), పోలీస్ (మిర్చి కిరణ్) ఇలా సహదేవ్‌తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని అతడి గురించి అడిగి నిజాలు తెలుసుకుంటుంది నళిని. ఈ క్రమంలోనే తను అన్వేషిస్తున్న మనిషి ఊహకు కూడా అందనంత పెద్ద వాడు అని అర్థమవుతుంది. గతంలో కాంట్రాక్ట్ కిల్లర్ అని తెలుస్తుంది. ఎక్కడో లండన్‌లో ఉండాల్సిన సహదేవ్.. ఏపీలోని తలకోనకు ఎందుకు వచ్చాడు.. అతడి జీవితంలోకి రచన (కావ్య తపర్) ఎందుకు వచ్చింది..? ఇదంతా మిగిలిన కథ..

కథనం:

జీరో ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్ళిన సినిమాలు సర్ప్రైజ్ చేస్తే భలే కిక్ ఉంటుంది.. ఈగల్ చూసిన తర్వాత చాలా మంది ఆడియన్స్‌కు బహుశా ఇదే కిక్ వస్తుందేమో..? రవితేజ గత సినిమాల ప్రభావమో.. లేదంటే సంక్రాంతికి వాయిదా పడటమో కారణం తెలియదు కానీ ఎందుకో దీనిపై భారీ అంచనాలు అయితే లేవు. ఇదే ఈగల్ సినిమాకు ప్లస్ అయింది. ఫస్టాఫ్ వరకు కూడా రవితేజ ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నాడో అర్థమవుతుంది. ఏముంది ఇందులో.. కథలో కన్ఫ్యూజన్.. ఎమోషన్ లేని ఎలివేషన్స్ తప్ప అనిపిస్తుంది. ఫస్టాఫ్ దాదాపు గంట 20 నిమిషాలుంటే.. ప్రతీ 10 నిమిషాలకు ఓసారి హీరో ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. చూస్తున్నపుడు రవితేజ కేజియఫ్‌లా అనిపిస్తుంది.. ఎలివేషన్స్ పరంగా మాత్రమే. దీన్ని ఒకే కథలా కాకుండా.. ఎపిసోడ్స్ వైజ్‌గా రాసుకున్నాడు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని. ఇంటర్వెల్ వరకు నెమ్మదిగానే లాక్కొచ్చాడు. మధ్యలో అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, మిర్చి కిరణ్‌తో కామెడీ ట్రాక్ పెట్టారు. అది కొంతవరకు మాత్రమే మెప్పిస్తుంది. కీలకమైన సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది. కావ్య తపర్ ఎపిసోడ్ కాస్త స్లో అనిపించినా.. యాక్షన్ బ్లాక్స్ మాత్రం దిమ్మ తిరిగిపోయాయి. ముఖ్యంగా హౌజ్ ఎపిసోడ్, అమ్మవారి ఎపిసోడ్స్ అయితే మాటల్లేవు.. విజిల్స్ మాత్రమే. ఈగల్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ యాక్షన్ ఎపిసోడ్స్.. కార్తిక్ ఘట్టమనేని వాటిని డిజైన్ చేసిన తీరు చాలా బాగుంది. అర్హత ఉన్న వాడి చేతిలోనే ఆయుధం ఉండాలి.. కథ చాలా సింపుల్.. దీని చుట్టూనే కథ అల్లుకున్నాడు కార్తిక్ ఘట్టమనేని.. ఆయుధమే కథ కాబట్టి యాక్షన్ సన్నివేశాలే ఈ సినిమాకు ప్రాణం. సినిమా అంతా రవితేజ హీరోయిజంపైనే నడపాలని ఫిక్సైపోయాడు. ఈ క్రమంలోనే ప్రతీ సీన్ ఎలివేషన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే కొన్నిసార్లు మాత్రమే అది వర్కవుట్ అయినట్లు కనిపించింది. అక్రమ ఆయుధాలు చెడ్డవాళ్ల చేతుల్లోకి వెళ్తే.. అది అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి.. వాళ్లను ఎలాగైనా అడ్డుకోవాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేసాడు కార్తిక్. అందులో దాదాపు 70 శాతం సక్సెస్ అయ్యాడు. అయితే స్క్రీన్ ప్లే లోపాలు, ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ కారణంగా ఈగల్ రేంజ్ కాస్త తగ్గింది.. లేదంటే ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచుండేది.

నటీనటులు:

రవితేజ గురించి చెప్పేదేముంది.. కారెక్టర్ ఏదైనా అందులో దూరిపోతాడు. ఈగల్ పాత్రను అలాగే చేసాడు రవితేజ. ఇక నవదీప్‌కు నేనేరాజు నేనేమంత్రి తర్వాత మంచి పాత్ర పడింది. అనుపమ పరమేశ్వరన్ కారెక్టర్ కథను ముందుకు నడిపిస్తుంది. కావ్య తపర్, వినయ్ రాయ్ పాత్రలు చిన్నవే అయినా.. బాగా చేసారు. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, మిర్చి కిరణ్‌ కామెడీ పర్లేదు. మిగిలిన వాళ్లు ఓకే..

టెక్నికల్ టీం:

దేవ్‌జండ్ అందించిన సంగీతం పర్లేదు.. పాటలు ఓకే. ఆర్ఆర్ బాగుంది. సినిమాటోగ్రఫర్ పరంగా కార్తిక్ ఘట్టమనేని వర్క్ సుప్రీమ్.. అలాగే దర్శకుడిగానూ బాగానే చేసాడు. మేకింగ్ పరంగా సుప్రీమ్. ఎడిటింగ్ కాస్త వీక్. ఫస్టాఫ్ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సి ఉండుంటే బాగుండేది. టెక్నికల్‌గా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే డబ్బును నీళ్లలా ఖర్చు చేసింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఈగల్.. ఎంగేజింగ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.