K.Viswanath: మెగాఫోన్ పడితే ఒంటిపై ఖాకీ దుస్తులు ఉండాల్సిందే.. విశ్వనాథ్ డ్రెస్ వెనుక కథ ఏంటంటే..
విశ్వనాథ్ కలం నుంచి రాలిన ఎన్నో అద్భుతమైన చిత్రాలు.. మరెన్నో పాత్రలు ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. దర్శకుడిగా విశ్వనాథ్ స్థానం ప్రత్యేకం.
సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని ఆరంభించి.. ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు కాశీనాధుని విశ్వనాథ్. తొలి చిత్రానికే రాష్ట్ర ప్రభుత్వం అందించిన నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు రచయిత్రి యద్ధనపూడి సులోచనరాణి కథను సమకూర్చగా.. భమిడిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి కలిసి మాటలు అందించారు. ఈ మూవీ తర్వాత సిరిసిరి మువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులో వచ్చింది. అలా దాదాపు 60 చిత్రాలకు దర్శకత్వం వహించారు. జేవీ సోమయాజులతో ఆయన తెరకెక్కించిన శంకరాభరణం సాధించిన విజయం గురించి చెప్పక్కర్లేదు. ఒకటి.. కాదు రెండు కాదు.. విశ్వనాథ్ కలం నుంచి రాలిన ఎన్నో అద్భుతమైన చిత్రాలు.. మరెన్నో పాత్రలు ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. దర్శకుడిగా విశ్వనాథ్ స్థానం ప్రత్యేకం. లెజండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్ మెగాఫోన్ పడితే ఒంటిపై ఖాకీ దుస్తులు ఉండాల్సిందే. ఈ విషయం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విశ్వనాథ్.
సెట్ లో ఖాకీ యూనిఫామ్ ధరించడానికి చాలా పెద్ద కథే ఉందని అన్నారు. “సౌండ్ రికార్డిస్టుగా ఉండి దర్శకుడిగా మారాను. ఓ రకంగా తలబిరుసు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవాడ్ని. ఎమ్మెల్యే అయినవాడు మంత్రి కావాలనుకుంటాడు. మంత్రి ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. సినిమాల్లోనూ అంతే. ఏ విభాగంలో అడుగుపెట్టినా.. చిట్టచివరి లక్ష్యం మాత్రం దర్శకుడి కుర్చీనే. అలాంటి కుర్చీ నాకు దక్కితే కళ్లు నెత్తికెక్కే ప్రమాదం ఉంటుంది కదా ? దర్శకుడిగా ఎదిగిన నాకు ఎలాంటి గర్వం తలకు ఎక్కకూడదు. సాటి కార్మికులతో నేను ఒకడిని అని నన్ను నేను గుర్తుచేసుకోవడానికే ఈ ఖాకీ చొక్కా. నా సెట్ లో పనిచేసే పెయింటర్స్, లైట్ బాయ్స్, హెల్పర్స్ అందరికీ ఇవే దుస్తులు ఉంటాయి. కాకపోతే వాళ్లకు నిక్కరు, నాకు ప్యాంటు అంతే తేడా.
మొదటి సినిమా నుంచి ఈ దుస్తులనే ధరిస్తాను. తొలి సినిమా సమయంలో చాలా భయం వేసేది. నాకు తెలిసిన పాత్రికేయులు మీ సినిమా కోసం రాస్తాం అంటుంటే.. మొదటి సినిమాకు ఏం రాయొద్దు. ఎందుకంటే నా సినిమా తుస్సుమంటే మీరేం రాసినా ఉపయోగం ఉండదు. రెండు మూడు సినిమాలు తెరకెక్కించిన తర్వాత నాలో ప్రతిభ ఉంది అనిపిస్తే రాయండి అని చెప్పాను” అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.