Aditya 369: నేడు మళ్లీ థియేటర్లలోకి బాలయ్య క్లాసిక్ మూవీ ఆదిత్య 369
ఆదిత్య 369.. ఈ మూవీ.. ఎవర్‌గ్రీన్..నాటి తరం.. నేటి తరం అనే తేడా లేకుండా అందరినీ అలరించే చిత్రం. 34 ఏళ్ల తర్వాత ఇవాళ రీ రిలీజ్ అవుతోంది. మరోసారి ప్రేక్షకులను టైమ్ ట్రావెల్ వరల్డ్‌లోకి తీసుకెళ్లనుంది. తెలుగు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు టేకింగ్, బాలకృష్ణ నట విశ్వరూపానికి ఈ సినిమా ఓ నిదర్శనం.

ది టైమ్ మిషన్ అనే పుస్తకం చదవడం వల్ల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆలోచనల్లో పురుడుపోసుకుంది ఆదిత్య 369 అనే సినిమా. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అద్భుతం జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు.. కానీ అద్భుతం జరిగిపోయింది. బాలకృష్ణ హీరోగా మోహిని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 34 ఏళ్ల క్రితం విడుదలై అఖండ విజయం సాధించింది. టైమ్ ట్రావెల్ , సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి ప్రేక్షకులను కూడా అలరించేందుకు ముందుకొచ్చింది.
భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో జరిగే కథలో బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో బాలకృష్ణ నటన అబ్బురపరుస్తుంది. ఆ పాత్రలో బాలకృష్ణను తప్ప ఇంకా ఎవరినీ ఊహించికోలేనని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెప్పారంటే ఆయన నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆదిత్య 369 సినిమాలో మొదట హీరోయిన్‌గా విజయశాంతిని తీసుకోవాలని భావించారట. అయితే విజయశాంతి కాల్‌షీట్స్ ఖాళీగా లేకపోవడంతో సినిమాటోగ్రాఫర్ పీసీశ్రీరామ్ సూచనతో మోహినిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక సిల్క్‌స్మిత కూడా ఈ మూవీలో ఓ ముఖ్యపాత్రలో నటించి మెప్పించింది. ఇక టైటిల్ కోసం ఆలోచిస్తుంటే బోయింగ్ 737 విమానం గుర్తుకురావడంతో ఆదిత్య 369 అనే టైటిల్ ఖరారు చేశారట దర్శకుడు సింగీతం.
ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణ సారధ్యంలో, పీసీ శ్రీరామ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందివ్వడంతో మరపురాని ఆణిముత్యం లాంటి సినిమాగా రూపొందింది ఆదిత్య 369. ఇవాళ రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా చిన్నపిల్లలతో పాటు పెద్దవారికి ఈ వేసవికి విందు భోజనం లాంటి వినోదాన్ని అందిస్తుందనడంతో ఎలాంటి సందేహం లేదు. 34 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ఆదిత్య 369 స్టోరీ.. ఇప్పటికీ నిత్యనూతనంగా ఉండటమే ఈ సినిమా విజయ రహస్యం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.