Pingara vs kantara: పింగార మూవీ కాపీ కొట్టి కాంతార సినిమా తీశారా..? బ్లాక్ బాస్టర్‌ను ముసిరిన మరో వివాదం
బాక్సాఫీస్‌ను కాంతారా బద్ధలు కొడుతున్న వేళ ఒక్కొక్కటిగా వివాదాలు ఆ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి. కాంతారా దెబ్బకు గతంలో ఈ థీమ్‌తో వచ్చిన పాటలు, సినిమాలు బయటపడుతున్నాయి. అవన్నీ ఈ బ్లాక్‌బస్టర్‌కు ఏ మేరకు నష్టం కలిగిస్తాయో చెప్పలేం కాని, ప్రస్తుతానికి అయితే కాంతారా భాష, ప్రాంతమనే భేదం లేకుండా దూసుకుపోతుంది.
డివైన్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తూ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న చిత్రం కాంతారా. ఇప్పటికే 215 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్టు టాక్. శాండల్‌వుడ్ చరిత్రలో ఆల్ టైమ్ హిట్‌గా నిలిచిపోయింది కాంతారా. IMDBలో 10కి గాను 9.3 రేటింగ్ సాధించిన భారతీయ చిత్రంగా కాంతారా రికార్డు నెలకొల్పింది. ఎంత వేగంగా ఈ చిత్రం ప్రేక్షకుల క్రేజ్ సంపాదించుకుందో అంతే స్పీడ్‌గా ఈ సినిమాను కాంట్రోవర్సీలు చుట్టుముడుతున్నాయి. తమ కళారూపం భూత కోలను ఈ చిత్రంలో తప్పుగా చూపారని తుళు ప్రజలు నిరసన తెలిపారు. ట్విట్టర్, రెడిట్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో ఈ చిత్ర కథ గురించి రాజకీయ చర్చలూ జరుగుతున్నాయి.
కర్నాటకలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలతో పాటు కేరళలోని కొన్ని జిల్లాల్లోని తుళు భాష మాట్లాడే ప్రజలు ఏటా ఆత్మలు లేదా దేవతలు కొలిచే ఒక జానపద సంప్రదాయం భూతకోల. తుళు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం భూత కోల లేదా దైవ కోల అనేది వైదికేతర సంప్రదాయం. ఇందులో పూర్వీకులను భూతాలు లేదా దైవాలుగా ఆరాధించే సంప్రదాయం ఇది. ఈ వేడుకలో భాగంగా భూతాలకు ప్రతిబింబాలుగా నిలిచే విగ్రహాలు తీసుకొని డప్పులు వాయిస్తూ, మతాబులు పేల్చుతూ ఊరేగింపు నిర్వహిస్తారు. ఊహించని శక్తుల నుంచి ఈ ఆత్మలు గ్రామాన్ని రక్షిస్తాయన్నది ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఈ భూత కోల అన్నది హిందూ సంప్రదాయంలో భాగమని ఈ చిత్ర హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రకటించడం వివాదంగా మారింది. అయితే వరాహరూపం పాటలో వరాహాన్ని విష్ణుమూర్తి అవతారంగా చూపడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.
హిందూ మతం ఆవిర్భావించక ముందే కర్నాటక నేలకు సొంత సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర ఉందని కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింస- ట్వీట్ ద్వారా నిరసనను తెలిపారు. వేల సంవత్సరాలకు ముందు నుంచే ఆదివాసీ సంస్కృతిలో భూత కోల వంటి సంప్రదాయాలున్నాయని ఆయన అంటున్నారు. చేతన్ చేసిన ఆరోపణలపై హీరో రిషబ్ శెట్టి స్పందించలేదు. కాని సినిమా నిర్మాణంలో తాను అనేక జాగ్రత్తలు తీసుకున్నానని స్పష్టం చేసారు. మరో వైపు చేతన్ వ్యాఖ్యలు హైందవ మతాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. అంతే కాదు ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచిన వరాహ రూపం పాట తమదని దాన్ని కాపీ కొట్టారని కేరళకు చెందిన తైకుడం బ్రిడ్జి అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. నవరసం పేరుతో తాము ఐదేళ్ల క్రితమే రూపొందించిన పాటను కాపీ కొట్టి వరాహ రూపం పాటను రూపొందించారని ఈ మ్యూజిక్ బ్రాండ్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. తైకడం బ్రిడ్జి రూపొందించిన నవరసం పాటకు యూట్యూబ్‌లో ఈ పాటకు 48 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఈ నవరస పాట, వరాహ రూపం రెండింటిని చూస్తే పెద్దగా తేడా అనిపించదు. నవరస పాటలోని ఆర్కెస్ట్రాను కాంతారాలోని వరాహారూపం పాటకు యథాతథంగా తీసుకున్నారని మ్యూజిక్ బ్యాండ్ తెక్కుడం బ్రిడ్జి ఆరోపిస్తోంది. ఈ పాటను ఉపయోగించుకుంటున్నందుకు కనీసం తమకు కరెస్టీ కూడా ఇవ్వలేదని అంటోంది. దీనిపై తాము చట్టపరంగా చర్యలు చేపడతామని మ్యూజిక్ బ్యాండ్ ఇన్‌స్టాలో హెచ్చరించింది. అయితే ఈ ఆరోపణలను కాంతారా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ అజనీశ్ కొట్టిపారేశారు. రెండు పాటల్లో ఒకే రాగం ఉపయోగించడం వల్ల ఒకలాగా అనిపిస్తోందని అంటున్నారు.
పింగారాను కాపీ కొట్టి కాంతారా తీశారా..?
ఈ వివాదాలు సద్దుమణగకముందే ఇప్పుడు మరో వివాదం కాంతారాను చుట్టుముట్టింది. 2019లో వచ్చిన తుళు చిత్రం పింగారకు కాపీ అనే మాటలు వినిపిస్తున్నాయి. పింగారా చిత్రానికి ఉత్తమ తుళు సినిమాగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆత్మల ఆరాధన లేదా దైవారాధన ఇతివృత్తంతో ఈ సినిమా సాగుతుంది. పింగారా చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో దానికి పెద్దగా గుర్తింపు రాలేదు. కాని అవార్డులు, క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది పింగారా. ఈ కథకే కమర్షియల్ హంగులు అద్ది ఇప్పుడు కాంతారా పేరుతో రిషబ్ శెట్టి తీశారని విమర్శలు వస్తున్నాయి. వివాదాలు ఏమున్నా దేశంలోని చాలా ప్రాంతాల వారికి తెలియని ఆచారాలు, సంప్రదాయాలను ఆకట్టుకునేలా చూపడంలో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సినిమాను కాంట్రోవర్సీలు చుట్టుముడుతుంటే దానికి క్రేజ్ మరింత పెరుగుతోంది.