AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections: ‘మా’రాజులూ… మీ శాశ్వత భవనానికి ఓ మంచి ఐడియా ఉంది… ఏంటంటే?

MAA Elections: కార్పస్ ఫండ్ ఎంతుంది? అందులో ఎవరెవరు ఎంతెంత మింగారు...? అనేదాకా వచ్చింది 'మా'లో పైసల పంచాయతీ. ఎన్నికలు పెడతారా? పెట్టరా? అనే సస్పెన్స్ తో..

MAA Elections: ‘మా'రాజులూ... మీ శాశ్వత భవనానికి ఓ మంచి ఐడియా ఉంది... ఏంటంటే?
Maa
Janardhan Veluru
|

Updated on: Aug 10, 2021 | 11:36 AM

Share

MAA Controversy: కార్పస్ ఫండ్ ఎంతుంది? అందులో ఎవరెవరు ఎంతెంత మింగారు…? అనేదాకా వచ్చింది ‘మా’ (MAA) లో పైసల పంచాయతీ. ఎన్నికలు పెడతారా? పెట్టరా? అనే సస్పెన్స్ తో విగ్గులు ఊడిపొయ్యేంతలా జుట్టు పీక్కుంటున్నారు ‘మా’లో చిన్నా పెద్దా అందరూ. ఒకవేళ ఎన్నికలు పెడితే.. అక్కడ వినిపించే మేజర్ చిక్కుముడి… మా శాశ్విత భవనం. దాని మీదయితే ఎలక్షన్ కాన్వాసింగ్‌లో బిగ్ టాక్ తప్పేలా లేదు. కానీ అంత చిక్కుముడిని కూడా చిటికెలో విప్పెయ్యొచ్చు అంటూ ఒక సావధాన పరిష్కారం చూపెడుతున్నారు.. ‘మా’లోనే వుండే ఒక మెంబర్.

‘మా’ బిల్డింగ్‌కి ఎన్ని కోట్లయినా మేమే ఖర్చుపెడతాం.. ఇదే నా ప్రతిజ్ఞ అంటూ మంచు విష్ణు శపధం చేసినప్పుడు.. ఆ ఖర్చు అటూఇటుగా నాలుగైదు కోట్లు అనే హింట్ కూడా ఇచ్చారు. ఆ నాలుగైదు కోట్ల భారం ఒక్కరి మీదే ఎందుకు పడాలి? తలో చెయ్యీ వేసి.. ఇటుకా ఇటుకా చేరవేసి.. మా రాజభవనం కట్టుకోవచ్చన్నది ఒక స్మార్ట్ ఐడియా. దాని అమలుకు ఒక సింపుల్ అండ్ షార్ట్ కట్ కూడా ఉందట. మా సభ్యుడొకరు తన సన్నిహితుల చెవిలో చెప్పుకున్న ఆ మాట.. మీడియా దాకా వచ్చేసింది. ఏమిటది?

మొత్తం వెయ్యి మంది మా సభ్యుల్లో… క్రియాశీలకంగా… అంటే అడపాదడపా అయినా సినిమాల్లో నటిస్తూ ఓ మోస్తరు బిజీగా వుండే ఆర్టిస్టులు నాలుగైదు వందల మంది. వీళ్లందరూ నిర్మాతల నుంచి తీసుకునే చెక్కు బరువులో తేడా ఉంటే ఉండొచ్చు. కానీ.. సంఘంలో మాత్రం అందరూ సమానులే. ఒక్కో సినిమాకు వందకోట్లు తీసుకునే కటౌట్ స్టార్లతో పాటు.. రోజువారీ కాల్షీట్లతో వెయ్యో పదిహేనొందలో తీసుకునే చిన్న సైజు నటులు కూడా వుంటారు. వీళ్లందరి నుంచి రెమ్యునరేషన్‌లో ఏడాది పాటు.. ఒక్క శాతం… ఒక్కటంటే ఒక్కశాతం ‘బిల్డింగ్’ సెస్ పేరిట తాత్కాలిక పన్ను వసూలు చేస్తే చాలు. సంవత్సరం తిరిగేసరికల్లా.. కావాల్సిన కోట్లు టక్కున వచ్చి చేరతాయి.

ప్రస్తుత లెక్కల ప్రకారం.. టాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు యాభై కోట్ల దాకా తీసుకునే హీరోలు ఐదారుమంది వున్నారు. ఒక్క రోజు కాల్షీట్‌కి లక్ష దాటి రెమ్యునరేషన్‌ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టులు పాతికమంది వరకూ వున్నారు. శాలరీ చేతికందగానే ఒక్క శాతం అంటే.. వందకు ఒక్క రూపాయి చొప్పున ‘మా’ హుండీలో వెయ్యడానికి వీళ్ళకెవరికీ అభ్యంతరాలు వుండవు కదా? ఒకవేళ అభ్యంతరం ఉంటే లిఖిత పూర్వకంగా రాసివ్వమనండి? ఎవరి చిత్తశుద్ధి ఎంతో తేలిపోతుంది?… అలా వసూలైన రొఖ్ఖంతో ‘మా’ కోసం ఒక ఇంద్రభవనమే కట్టుకోవచ్చు…

ఇదీ మా భవనం కోసం పరితపిస్తున్న సగటు మా సభ్యుల్లో ఒకరి మనసులో మాట. ఐనా… ఈ మాత్రం చిటుకు ఆ ‘మా’రాజులకు తెలీదా ఏంటి?

– రాజా శ్రీహరి, ET డెస్క్‌, టీవీ9 తెలుగు

Also Read..

బుట్టబొమ్మ, బుట్టబొమ్మా… ఇంత అందాన్ని తట్టుకునేదెలాగమ్మా.. షేక్‌ చేస్తోన్న పూజా లేటెస్ట్‌ ఫొటోలు.

 నీరజ్ చోప్రా బయోపిక్‌.. హీరోగా ఎవరంటే.. వైరలవుతోన్న బాలీవుడ్ నటుడి ట్వీట్