
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు విశ్వంభర సినిమాతో పాటు అనిల్ రావిపూడి సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం వీఎఫెక్స్ ఉంటుందని తెలుస్తుంది. అలాగే మరో వైపు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న మెగాస్టార్. అనిల్ ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసి మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. రేపు ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టిన రోజు. ఈ పుట్టిన రోజుతో చిరంజీవి 70వసంతాలు పూర్తి చేసుకోనున్నారు. మెగాస్టార్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉంటే మెగాస్టార్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో చిరు మాట్లాడుతూ.. తన పై విషప్రయోగం జరిగిందని తెలిపారు. ఒక అభిమాని తనపై విషప్రయోగం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. ‘మరణమృదంగం అనే సినిమా షూటింగ్ సమయంలో ఓ అభిమాని చేసిన పని నా ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ అభిమాని కేక్ తెచ్చి బలవంతంగా నా నోట్లో పెట్టాడు. అయితే నాకు కేక్ లాంటి వాటిని స్పూన్‌తో తినడం అలవాటు. అయితే అతను నా నోట్లో పెట్టిన కేక్ చేదుగా అనిపించడంతో బయట పడేశా. అయితే అ సమయంలో అతను చేత్తో నాకు కేక్ తినిపించాడు. అంతేకాకుండా చేదుగా కూడా అనిపించింది. దీంతో వెంటనే బయట పడేశా. వెంటనే సెట్‌లో ఉన్నవారితో ఈ విషయం చెప్పాను. అతన్ని పట్టుకుని కొడితే అసలు నిజం బయటపెట్టాడు.
అభిమాని తెచ్చిన కేక్ శాంపిల్స్‌ను టెస్టింగ్‌కు పంపించారు. టెస్ట్ చేసిన తర్వాత ఆ కేక్ లో విషం కలిసినట్లు తేలింది. కేరళ నుంచి ఏదో వశీకరణం పౌడర్ తీసుకొచ్చి కేక్‌లో కలిపినట్లు తెలిసింది. ఇది విని అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయమేమిటంటే కేక్ తినిపించినది నాకు పిచ్చి అభిమాని. అయితే అతనిని పట్టించుకోలేదనే కోపంతో నాపై వశీకరణ ప్రయోగం చేశాడు. ఈ విషయం తెలుసుకుని నేను వెంటనే అతన్ని క్షమించి వదిలేశా’ అని చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.