Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి ఇల్లు కబ్జా..!
కోట్లమంది గుండెల్లో గూడుకట్టుకున్న అతిలోక సుందరి కన్నమూసి ఏడేళ్లయ్యింది. ఇప్పటికీ తను గుర్తుకొస్తే ప్రతీ అభిమాని గుండె కలుక్కుమంటూనే ఉంటుంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ మకుటం లేని మహారాణిలా ఎన్నో ఏళ్లపాటు చిత్రపరిశ్రమని ఏలిన అందాలతార ఆస్తులపై కొత్త వివాదాలు తెరపైకొస్తున్నాయి. భర్త బోనీకపూర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో చెన్నైలో శ్రీదేవి కొన్న ఇంటి వివాదంపై చర్చ మొదలైంది.

దశాబ్దాల సినీ ప్రయాణంలో కోట్లమంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు అందాలతార శ్రీదేవి. దక్షిణాదిలోనే కాకుండా హిందీ చలనచిత్ర పరిశ్రమపైనా చెరగని ముద్రవేశారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో శ్రీదేవి మరణం కోట్లమంది అభిమానులను విషాదంలో ముంచెత్తింది. మరణించిన ఏడేళ్ల తర్వాత శ్రీదేవి ఆస్తుల వివాదం కోర్టుకెక్కింది. శ్రీదేవి కొనుగోలు చేసిన ఆస్తిని ముగ్గురు ఆక్రమించారంటూ హైకోర్టుని ఆశ్రయించారు శ్రీదేవి భర్త బోనీ కపూర్.
చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో శ్రీదేవి 1988లో ఒక ఆస్తి కొనుగోలు చేశారు. 37 ఏళ్లుగా ఆమె ఆధీనంలో ఉన్న ఆ ఆస్తిపై ఇప్పుడు వివాదం చెలరేగింది. బోనీకపూర్ పిటిషన్ ప్రకారం సంపంధం ముదలియార్ కుటుంబం నుంచి శ్రీదేవి ఆ ఆస్తి కొనుగోలు చేశారు. అయితే ముదలియార్ వారసులమని చెప్పుకుంటూ ముగ్గురు వ్యక్తులు తప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ చూపించి తమకే హక్కుందని వాదిస్తున్నారు. అయితే మొదటి భార్య బతికుండగానే చంద్రశేఖరన్ ముదలియార్ రెండో వివాహం చేసుకున్నాడు. కాబట్టి రెండో భార్య, ఆమె పిల్లలకు వారసత్వ హక్కులు ఉండవని బోనీ కపూర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
శ్రీదేవి ఆస్తిని కొందరు కబ్జా చేయడంపై బోనీకపూర్ ఈ ఏడాది ఏప్రిల్ 22న హైకోర్టులో కేసు వేశారు. ఆ ఆస్తిని తాము కొనుగోలు చేసిన 17ఏళ్ల తర్వాత 2005లో తాంబరం తహశీల్దార్ కార్యాలయం నుంచి వారసులమంటూ ముగ్గురు వ్యక్తులు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకున్నారని బోనీకపూర్ ఆరోపించారు. ఆ సర్టిఫికెట్‌ని రద్దు చేయాలని కోరారు. నకిలీ సర్టిఫికెట్‌పై బోనీ కపూర్ చేసిన ఫిర్యాదుపై, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని జారీ చేయాలని తాంబరం తహశీల్దార్‌ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
కెరీర్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో అందాల తార శ్రీదేవి కోట్ల ఆస్తులు కొనుగోలు చేశారు. శ్రీదేవి చనిపోయాక ఆ ఆస్తులను భర్త, పిల్లల పేర్లమీదికి మార్చుకున్నారు. చెన్నై ఈస్ట్‌రోడ్‌లో శ్రీదేవి ఆస్తిని కొనుగోలు చేసిన సమయంలో .. అమ్మిన వ్యక్తికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారందరి సమ్మతంతోనే శ్రీదేవి ఆ ఆస్తి కొన్నారు. తర్వాత రెండో భార్య కొడుకులం అంటూ ముగ్గురు ఆ ఇంట్లో ఉంటున్నారు. అయితే వారిని వారసులుగా అంగీకరించలేమని విచారణ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ విషయంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి చెన్నైలోని ఆ ఆస్తి శ్రీదేవి కుటుంబానికి దక్కుతుందో లేదో తేలబోతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




