AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Sohel: ‘శివుడికి పాలాభిషేకం చేశా.. కొండగట్టుకు వెళ్లా.. నన్ను టెర్రిరిస్ట్ అంటావా?’: బిగ్ బాస్ సొహైల్

బిగ్ బాస్ తెలుగు ఫేమ్ సయ్యద్ సొహైల్ ర్యాన్ ఎమోషనల్ అయ్యాడు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తనను ఉగ్రవాదిగా పోలుస్తూ ప్రపంచ యాత్రికుడు చేసిన అసభ్యకర కామెంట్స్ పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ' నేను ఉగ్రవాదిని కాదని.. ఇండియన్ ముస్లింని' అంటూ అన్వేష్ కు బదులిచ్చాడు.

Bigg Boss Sohel: ‘శివుడికి పాలాభిషేకం చేశా.. కొండగట్టుకు వెళ్లా.. నన్ను టెర్రిరిస్ట్ అంటావా?': బిగ్ బాస్ సొహైల్
Bigg Boss Sohel, Naa Anveshana
Basha Shek
| Edited By: |

Updated on: Apr 30, 2025 | 5:36 PM

Share

బిగ్ బాస్ రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సయ్యద్ సొహైల్ ర్యాన్ ఒకడు. నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అతను తన ఆట, మాట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానూ పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. టీవీ షోల్లోనూ మెరుస్తున్నాడు. అయితే తాజాగా సొహైల్ తో పాటు మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఉగ్రవాదులతో పోల్చుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్‌ నా అన్వేషణ. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారందరినీ టెర్రరిస్టులుగా పేర్కొన్నాడు. దీనిపై సొహైల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘బెట్టింగ్‌ యాప్స్‌ గురించి నన్ను తిట్టు.. అంతే కానీ ఉగ్రవాది అని ముద్ర వేయడమేంటి?’ అని అన్వేష్ కు కౌంటర్ ఇచ్చాడు. ‘కశ్మీర్‌లోని పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడ్డవాడు ఎక్కడికో పారిపోయాడు. వాడిని పట్టుకోవడం మానేసి మన ఇంట్లో మనం కొట్టుకుచస్తున్నాం. ఎక్కడో జరిగిన సంఘటనకు నన్ను ఉగ్రవాదిగా చిత్రీకరించడమేంటి? బెట్టింగ్‌ యాప్స్‌ గురించి నన్ను తిట్టు.. అంతేకానీ ఉగ్రవాది అని ముద్ర వేయడమేంటి? వాడెవడో చెప్పినంత మాత్రాన నేను ఉగ్రవాదిని అయిపోను. నేను భారతీయుడిని. చిన్నప్పటి నుంచి కులమత బేధాలు లేకుండా పెరిగాను.’

‘నేను శివుడికి పాలాభిషేకం చేశాను. సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. రంజాన్‌ ఉంటే హిందూ స్నేహితులు నాతో పాటు నమాజ్‌ చదువుతాం. క్రిస్టియన్‌ ఫ్రెండ్సతో కలిసి చర్చికి వెళతాం. పక్కింటి వారితో కలిసి కొండగట్టుకు వెళ్లిన రోజులున్నాయి. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింలలో నేనూ ఒకరిని. ఒక భారతీయుడివై ఉండి నన్ను ఉగ్రవాది అంటున్నావ్‌. నిజమైన ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా.. వాళ్ల మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ప్లాన్‌ బాగా సక్సెస్‌ అయినట్లే. అంటే ఇండియన్ గా నువ్వు ఫెయిల్‌ అయినట్లే’

‘మా అమ్మ గతేడాది చివర్లో చనిపోయారు. కానీ నువ్వు మా అమ్మ గురించి కూడా బూతులు మాట్లాడావు. గుర్తుపెట్టుకో, నీకు కూడా తల్లి ఉంది. మీ తల్లిలాంటిదే నా తల్లి కూడా! నేను కూడా నిన్ను తిరిగి బూతులు తిట్టొచ్చు. కానీ నా క్యారెక్టర్ అది కాదు.. మీ అమ్మానాన్నలను బాగా చూసుకో.. కావాలంటే నన్ను తిట్టుకో, వ్యూస్‌ కోసం నన్ను ఎంతైనా తిట్టుకోండి. కానీ తల్లుల్ని తిట్టొద్దు. వాళ్లేం పాపం చేశారు. అందరికీ ఒకటే చెప్తున్నా.. మీ మతాన్ని ప్రేమించండి.. ఇతరుల మతాల్ని గౌరవించండి’ అని సొహైల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.