
తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి రోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అందులో సామాన్య జనంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉంటారు. కొందరు కాలినడకతో ఏడుకొండల వాడిని దర్శించుకుంటే మరికొందరు స్పెషల్ దర్శనం, వీఐపీ దర్శనాలు చేసుకుంటారు. అయితే సెలబ్రిటీల్లో ఎక్కువగా వీఐపీ దర్శనం ద్వారానే శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. కాలినడకన స్వామివారిని దర్శించుకోవడం అరుదుగా జరుగుతుంది. గతంలో సమంత పలుసార్లు కాలినడకన తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ నందినీరాయ్ ఏకంగా మోకాళ్లపై నడుచుకుంటూ తిరుమలకు చేరుకుంది. శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంది. అనంతరం తన పర్యటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘చాలా కష్టపడి మెట్లు ఎక్కాను. అయినా చాలా అద్భుతమైన అనుభూతి పొందాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చిందీ అందాల తార.
నందిని విషయానికొస్తే.. మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని, కోతికొమ్మచ్చి, పంచతంత్ర కథలు సినిమాల్లో నటించింది. అంతకుముందు బిగ్‌బాస్ రెండో సీజన్‌లో కూడా సందడి చేసింది. అయితే ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండలేకపోయింది. ఇటీవల ఆమె నటించిన గాలివాన సినిమా ప్రేక్షకుల అభిమానం పొందింది. అలాగే ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అనే వెబ్‌సిరీస్‌లో కూడా నందిని తళుక్కుమంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..