Balagam: మనసుల్ని కరిగించి… కదిలించిన సినిమా.. ఏళ్ల తర్వాత ఒక్కటైన అన్నదమ్ములు
తెలుగు మట్టి నుంచి పుట్టిన సినిమా బలగం. మన ఇళ్లల్లోని ఆప్యాయతలు, అనుబంధాలు, గిల్లికజ్జాలు, బావా మరదళ్ల సరసాలు అన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. అందుకే ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందుకే ఓటీటీలో విడుదలనప్పటికీ.. థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది ఈ సినిమా
ఎప్పుడో విడిపోయిన అన్నదమ్ములు… ఒక్కటయ్యారు…దశాబ్దాల వైరాన్ని చుట్టుచుట్టి విసిరికొట్టి…అహాన్ని పాతిపెట్టి…తనలోని విద్వేషాన్ని తొలుచుకుని…బయటకొచ్చారు అన్నదమ్ములు… అయితే రక్తంపంచుకుపుట్టిన బిడ్డలు బద్దవిరోధులుగా మెలిగిన వారిని కలిపిన బలం మన బలగానిదే… అదే బలగం సినిమాదే. అవును.. మీరు విన్నది నిజమే…ఆస్తి తగాదా ఇద్దరన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. అంతే స్థలవివాదం రక్తబంధాన్ని సైతం బద్ధ శతృత్వంగా మార్చింది. అంతటి వైరుధ్యాన్ని మర్చిపోయి…వారిలోని రక్తబంధాన్ని మేల్కొల్పేలా చేసింది బలగం సినిమా. నిర్మల్ జిల్లాలో ఆవిష్కృతమైంది ఈ దృశ్యం.
ఇటీవల విడుదలైన బలగం సినిమా చూసి పదేళ్ళ తరువాత మళ్ళీ ఒక్కటయ్యారు ఇద్దరు అన్నదమ్ములు. నిర్మల్ జిల్లా లక్ష్మణచందాలో స్థానిక సర్పంచ్ ముత్యంరెడ్డి బలగం సినిమాను DNR ఫంక్షన్ హాల్ లో ఉచితంగా ప్రదర్శించారు. అయితే ఈ సినిమా చూసిన అదే గ్రామానికి చెందిన గుర్రం పోసులు, గుర్రం రవి అక్కడికక్కడే మనసు మార్చుకుని…వారి స్థల వివాదాన్ని తక్షణమే పరిష్కరించుకొని సర్పంచ్ సమక్షంలో మళ్ళీ ఒక్కటయ్యారు. పదేళ్ళుగా ఇద్దరి మధ్యా పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి… బలగం సినిమాతో అన్నదమ్ముల బంధం మళ్లీ పెనవేసుకోవడంతో గ్రామంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఇక బలగం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమాలోని ఎమోషనల్ సీన్స్‌ను ఆడియెన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాగా ఈ సినిమా ప్రజంట్ థియేటర్లలో ఆడుతూనే ఉంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. ఇకపోతే పల్లెల్లో తెరలు వేసి మరీ బలగం సినిమాను చూస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..