Animal Movie Review: ‘యానిమల్’ రివ్యూ.. సందీప్ కథకు ప్రాణం పోసిన రణబీర్.. ఎలా ఉందంటే..
పేరుకు హిందీ సినిమా అయినా కూడా తెలుగులోనూ యానిమల్ సినిమాపై ఉన్న అంచనాలు మాటల్లో చెప్పడానికి లేదు. మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన సినిమా కావడంతో.. ఆసక్తి కూడా పెరిగిపోయింది. మరి ఈ సినిమా కూడా అర్జున్ రెడ్డి స్థాయిలో ఉందా.. దాన్ని మించిపోయిందా..? అసలేంటి యానిమల్ సంగతి.. పూర్తి రివ్యూలో చూద్దాం.. నా సినిమా రెగ్యులర్‌గా ఉండదు.. అందరూ తీసేలా నేను తీయనంటూ అర్జున్ రెడ్డి టైమ్‌లోనే స్టేట్‌మెంట్ ఇచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
మూవీ రివ్యూ: యానిమల్
నటీనటులు: రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు
సినిమాటోగ్రఫర్: అమిత్ రాయ్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా
ఎడిటర్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
పేరుకు హిందీ సినిమా అయినా కూడా తెలుగులోనూ యానిమల్ సినిమాపై ఉన్న అంచనాలు మాటల్లో చెప్పడానికి లేదు. మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన సినిమా కావడంతో.. ఆసక్తి కూడా పెరిగిపోయింది. మరి ఈ సినిమా కూడా అర్జున్ రెడ్డి స్థాయిలో ఉందా.. దాన్ని మించిపోయిందా..? అసలేంటి యానిమల్ సంగతి.. పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
ఇండియాలోనే రిచెస్ట్ ఫ్యామిలీ, బిజినెస్ మెన్ బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్). అతడికి స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది. రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) ఆయన కుమారుడు. చిన్నప్పటి నుంచి కూడా చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. ముఖ్యంగా తన కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు.. ఏ చిన్న తప్పును కూడా సహించడు.. ఏ ఇబ్బంది వచ్చినా చంపేసేంత అగ్రెసివ్. ఆ కోపాన్ని చూసి కొడుకును హాస్టల్‌లోనే ఉంచేస్తాడు బల్బీర్. ఆ తర్వాత అక్క భర్తతో జరిగిన చిన్న గొడవ కారణంగా తను ప్రేమించిన గీతాంజలి (రష్మిక మందన్న) ను తీసుకుని అమెరికా వెళ్లిపోతాడు రణ్ విజయ్. కొన్నేళ్ల తర్వాత తండ్రిపై అటాక్ జరిగిందని తెలుసుకుని ఇండియాకు వస్తాడు. ఆ వచ్చిన తర్వాత ఏం జరిగింది.. అసలెందుకు బల్బీర్‌పై అటాక్ జరిగింది.. చేసిన వాళ్లెవరు.. ఇవన్నీ తెలుసుకునే క్రమంలో విజయ్ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అదేంటి అనేది తెరమీదే చూడాలి..
కథనం:
నా సినిమా రెగ్యులర్‌గా ఉండదు.. అందరూ తీసేలా నేను తీయనంటూ అర్జున్ రెడ్డి టైమ్‌లోనే స్టేట్‌మెంట్ ఇచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు యానిమల్ కూడా తెరకెక్కించాడాయన. చాలా సింపుల్ కథను తన స్టైల్లో తీసాడు. సుకుమార్ నాన్నకు ప్రేమతో లైన్ కూడా ఇదే. కాకపోతే ఆయన మేకింగ్ వేరు.. ఈయన మేకింగ్ వేరు. ఈ సినిమా అద్భుతంగా అనిపించడానికి ప్రధానమైన కారణం మేకింగ్. మేకింగ్ అయితే మరో స్థాయిలో ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్. అలాగే రైటింగ్ కూడా అంతే.. ఒక స్టార్ హీరోతో ఇలాంటి సినిమా ఊహించడం కష్టం. రణబీర్ కపూర్ కథను కాదు సందీప్ వంగాను నమ్మి ఈ సినిమా చేశాడని అర్థమవుతుంది. ఆ మేకింగ్ కు మెంటల్ వచ్చేస్తుంది..
సినిమాను ఇలాగే తీయాలి అనే బౌండరీస్ మరోసారి చెరిపేసాడు సందీప్. అర్జున్ రెడ్డి టాలీవుడ్ పాత్ బ్రేకింగ్ అయితే.. యానిమల్ ఇండియన్ సినిమాకు పాత్ బ్రేకింగ్.. మేకింగ్ పరంగా..! అలాగే ఈ సినిమా కొందరికి నచ్చకపోవడానికి కూడా కారణాలు లేపోలేదు. దానికి ముఖ్యమైన కారణం స్క్రీన్ ప్లే. ఫస్టాఫ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.. చిన్న కంప్లైంట్ కూడా లేదు. కానీ సెకండాఫ్ మాత్రం అక్కడే తిరిగింది. ఒరిజినల్ మేకింగ్ పేరుతో అక్కడక్కడ కాస్త డోస్ బాగా పెంచాడు సందీప్. అది హాట్ సీన్స్ కానీ.. వయోలెన్స్ కానీ.. ఎక్కడ మొహమాటమే పడలేదు. ఇందులో చాలా సీన్స్ సెన్సార్ నుంచి బయటపడటం ఆశ్చర్యంగా ఉంది. సెకండాఫ్ చాలా వరకు స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది. ఆయన ఇష్టపడి చేసిన సినిమా కాబట్టి ట్రిమ్ చేయలేకపోయాడేమో కానీ.. కొన్ని సన్నివేశాలు బాగా విసిగిస్తాయి. స్టోరీ టెల్లింగ్ లో మరోసారి తన బ్రిలియన్స్ చూపించాడు సందీప్ రెడ్డి వంగా. ఇలా కథ చెప్పడం మాత్రం చాలా మంది దర్శకుల వల్ల కాదు. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. ఇలాంటి రిలేషన్ చాలా తక్కువ సినిమాల్లోనే చూపించారు. కొంతవరకు కంప్లైంట్స్ ఉన్నా కూడా ఆ మేకింగ్‌తోనే యానిమల్ బయటపడింది. యాక్షన్ సీన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. సెకండాఫ్‌లో వచ్చే జోయా ఎపిసోడ్‌తో పాటు కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసినా కథలో ఎలాంటి తేడా కనిపించదు.
నటీనటులు:
రణబీర్ కపూర్ నటన మరో స్థాయిలో ఉంది.. ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అసలు ఆ పాత్రను ఆయన ఓన్ చేసుకున్న తీరు అద్భుతం అంతే. ఇక తండ్రి పాత్రలో అనిల్ కపూర్ అద్భుతంగా నటించాడు. బాబీ డియోల్ ఉన్నది కాసేపే అయినా కూడా చాలా బాగుంది కారెక్టర్. రష్మిక మందన క్యారెక్టర్ చాలా బోల్డ్‌గా ఉంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. రష్మిక డేర్‌కు మెచ్చుకోవాల్సిందే. శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా సహా మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
సినిమాకు సంగీతం సగం బలం. హర్షవర్ధన్ రామేశ్వర్ ఆర్ఆర్ అదిరిపోయింది. చాలా సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ సందీప్ రెడ్డి వంగానే కాబట్టి.. ట్రిమ్ చేయాల్సిన సీన్స్ ఏవో ఆయన కంటే బాగా ఎవరికీ తెలియదు.. కానీ దానికి ఒప్పుకోలేదు సందీప్. దర్శకుడిగా మాత్రం సగమే సక్సెస్ అయ్యాడు.. కానీ రైటింగ్ పరంగా సూపర్ పవర్ ఫుల్. అందుకే కమర్షియల్‌గా యానిమల్ కు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా యానిమల్.. Sandeep Reddy Vanga’s Version of నాన్నకు ప్రేమతో..