AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2026: పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారి ఆ రోజున బడ్జెట్‌.. ఈసారి అన్నీ రికార్డులే..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం (జనవరి 28, 2026) నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో బడ్జెట్‌ సమావేశాలు జరగనుండగా.. రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి.

Budget 2026: పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారి ఆ రోజున బడ్జెట్‌.. ఈసారి అన్నీ రికార్డులే..
Parliament Budget Session 2026
Shaik Madar Saheb
|

Updated on: Jan 27, 2026 | 5:09 PM

Share

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం (జనవరి 28, 2026) నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో బడ్జెట్‌ సమావేశాలు జరగనుండగా.. రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఆ తర్వాత.. ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెడుతుండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఇంకా నిర్మలా సీతారమన్ అరుదైన ఘనతను సాధించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 9వసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే 8సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

భారతదేశ చరిత్రలో అత్యధికంగా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తి మాజీ ప్రధాని, ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ నిలిచారు.. ఆయన మొత్తం 10 సార్లు బడ్జెట్‌ను సమర్పించారు. ఇందులో 8 పూర్తి బడ్జెట్‌లు, 2 మధ్యంతర బడ్జెట్‌లు ఉన్నాయి. ఈయన తర్వాత పి. చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ సమర్పించారు. సీతారామన్ 2026లో తన తొమ్మిదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా, పి. చిదంబరం రికార్డును సమం చేయనున్నారు.

అఖిలపక్ష సమావేశం..

బుధవారం నుంచి పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. విపక్ష పార్టీల సభ్యులు బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కేంద్రం కోరింది. TDP నుంచి శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నుంచి బాలశౌరి, YCP తరపున మిథున్‌రెడ్డి, సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. BRS నుంచి సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. శాసనపరమైన అజెండాను వివరించడంతో పాటు.. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు అన్ని పార్టీలను కోరారు.

ఇక.. కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుండగా.. ఉపాధి హామీ పథకానికి చెందిన “జీ రామ్‌ జీ” బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నిరసనలకు సిద్ధమవుతోంది. AP, తెలంగాణలోని అధికార, విపక్షాలు పార్లమెంట్‌ సమావేశాల అజెండాను ఫిక్స్‌ చేసుకున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించడం, నదుల అనుసంధానం, PPP విధానంపై చర్చకు TDP పట్టుబట్టనుంది. అమరావతి రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌ను YCP లేవనెత్తనుంది. అలాగే.. తెలంగాణలో ప్రకంపనలు రేపుతోన్న సింగరేణి బొగ్గు స్కామ్‌, నదుల అనుసంధానం, నీటి పంపకాలు, విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలను BRS లేవనెత్తబోతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..