Anchor Suma: కేరళలో కోట్లాది రూపాయలతో లగ్జరీ హౌస్.. అసలు విషయం చెప్పేసిన స్టార్ యాంకర్ సుమ.. వీడియో
'స్టార్ యాంకర్ సుమ తన సొంత రాష్ట్రం కేరళలో లగ్జరీ ఇల్లు కట్టించింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆధునిక సౌకర్యాలతో విశాలమైన స్థలంలో ఇంటిని నిర్మించుకుంది'.. ఇలా గత రెండు రోజులుగా స్టార్ యాంకర్ సుమ గురించి యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

సినిమా తారల పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌పై నెట్టింట బోలెడు వార్తలు వస్తుంటాయి. దురదృష్టం కొద్దీ చాలా మంది వీటిని నిజమనుకుంటారు. అంతేకాదు ఇలాంటి వాటికే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ మామూలేనని సెలబ్రిటీలు కూడా పెద్దగా ఈ ఫేక్ న్యూస్ పై స్పందించడం లేదు. కొంతమంది మాత్రం ఈ అబద్దపు వార్తలపై తమదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా స్టార్ యాంకర్ సుమ కూడా ఇదే పని చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి వస్తోన్న ఫేక్ న్యూస్ పై ఆమె రియాక్ట్ అయ్యింది. కేరళలో రూ.278 కోట్లతో స్టార్ యాంకర్ సుమ ఒక లగ్జరీ ఇల్లు కట్టుకున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఒక పెద్ద లగ్జరీ హౌస్ ను చూపిస్తూ.. వెనుక ఒక అమ్మాయి వాయిస్ సుమ గురించి చెప్పుకుంటూ వస్తుంది. సుమ ఇల్లు కేరళలో ఎలా ఉందో చూద్దాం అంటూ మొదలుపెట్టిన ఆమె.. ఆ ఇల్లు విలువ రూ.278 కోట్లని, ఈ ఇంట్లో 500 సీసీ కెమెరాలు ఉన్నాయని, పదిమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇదే వీడియోపై సుమ స్పందించింది.
ఎవర్రా మీరంతా .. నేనెప్పుడు కట్టానురా ఇంత పెద్ద ఇల్లు. నేను కేరళలో ఎలాంటి ఇల్లు కట్టించలేదు. ఇదంతా ఫేక్. 2018 లో రూ.278 కోట్లతో కట్టానని ఈ వీడియోలో ఉంది. అసలు రూ.278 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయమ్మా.. ఏమనుకుంటున్నావమ్మా నువ్వు? నేనేమైనా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా.? 500 సీసీ టీవీ కెమెరాలు అంట.. ఇదేమైనా నమ్మోచ్చా? సాధారణంగా ఒక హౌస్ లో 5 రూమ్ లు ఉంటే.. ఒక్కో రూమ్ లో 5 కెమెరాలు పెట్టినా 25 మాత్రమే వస్తాయి. అలాంటిది 500 కెమెరాలు ఎక్కడ పెడతారండి? అదేమైనా బిగ్ బాస్ హౌస్ నా?’
‘ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే? ఇలాంటి ఫేక్ వీడియోస్ లో ముఖ్యంగా నేను కనిపించకుండా.. నా ఫొటోస్ ను కోలాడ్ చేసి.. ఎక్కడో థాయ్ ల్యాండ్ లోనో, గోవాలోనో ఉన్న ఇళ్లను పెట్టి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ తో క్రియేట్ చేస్తారు. ఇలాంటి వీడియోలన్నీ ఫేక్. మేము సెలబ్రిటీస్.. మా అంతట మేమే వచ్చి మాట్లాడితే తప్ప ఇలాంటి వార్తలను నమ్మకండి. ఇక ఇప్పుడు AI కూడా వచ్చింది. ఇప్పుడు మా పెదాలు చూసి నిజంగా మేమే మాట్లాడుతున్నామా అని నిర్దారించుకోండి” అంటూ క్లారిటీ సుమ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి