AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Emotional Song: ఆ పాట విని యాంకర్ సుమతో పాటు అక్కడున్న అందరూ కన్నీళ్లు పెట్టారు..

సూపర్ సింగర్ 2 రెండవ సిరీస్, అనేక మంది గాయకులకు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదవ ఎపిసోడ్‌లో గాయని మధుప్రియ ఆడపిల్లనమ్మా అనే హృద్యమైన గీతాన్ని ఆలపించారు. ఈ పాట బాలికల పట్ల సమాజంలో నెలకొన్న వివక్ష, ఎదురవుతున్న కష్టాలను ప్రధానంగా తెలియజేస్తుంది.

Telugu Emotional Song: ఆ పాట విని యాంకర్ సుమతో పాటు అక్కడున్న అందరూ కన్నీళ్లు పెట్టారు..
Anchor Suma
Ram Naramaneni
|

Updated on: Feb 03, 2026 | 7:40 PM

Share

సింగర్ మధుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. తెలుగు ప్రజల మనసులను చిన్నప్పుడే గెలిచేసింది. తెలుగు జానపదం అంటే ఒకప్పుడు గ్రామాలకే పరిమితమై ఉండేది. కానీ ఆ జానపదానికి టీవీ స్క్రీన్ మీద, యూట్యూబ్‌లో, యువత మనసుల్లో చోటు దక్కేలా చేసిన కొద్దిమంది గాయనుల్లో మధుప్రియ ఒకరు. చిన్నప్పటి నుంచే సంగీతమే ప్రపంచంగా పెరిగిన మధుప్రియ..  సాధారణ కుటుంబం నుంచి వచ్చి, కష్టాల్ని మెట్లుగా మార్చుకుని, తన గొంతుతోనే తనను తాను నిలబెట్టుకుంది. పాట ఆమెకు ఉద్యోగం కాదు.. వ్యాపకం కాదు.. జీవితం. జానపద పాటలు పాడటం అంటే కేవలం స్వరం సరిపోదు. ఆ మాటల వెనకున్న బాధ, ఆనందం, సంస్కృతి.. అన్నీ కలిపి గొంతులో పెట్టాలి. అది మధుప్రియ ప్రత్యేకత.

టీవీ రియాలిటీ షోల్లో ఆమె పాడిన ప్రతి పాట.. గ్రామీణ జీవనాన్ని గుర్తు చేస్తూ, అమ్మమ్మల పాటల్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. సినిమా పాటలైనా.. జానపద గీతాలైనా.. భక్తి పాటలైనా..  మధుప్రియ గొంతులో ఒక స్వచ్ఛత ఉంటుంది. ఆ స్వరం వినిపిస్తే.. ఇది మధుప్రియ పాటే అని చెప్పాల్సిన అవసరం ఉండదు.

పాటల ప్రపంచంలో పోటీ ఎక్కువ. కానీ ఆ పోటీని తట్టుకుని నిలబడాలంటే ప్రత్యేకత కావాలి. మధుప్రియ ఆ ప్రత్యేకతను తెలుగు నేల వాసన నుంచే తెచ్చుకుంది. నేడు ఆమె పేరు ఒక బ్రాండ్. జానపదం అంటే మధుప్రియ, మధుప్రియ అంటే జానపదం అన్న స్థాయికి ఆమె చేరుకుంది. పాట మారొచ్చు.. స్టేజ్ మారొచ్చు..  కానీ మధుప్రియ గొంతులోని ఆ మట్టివాసన మాత్రం ఎప్పటికీ మారదు. ఈ అగ్గి కణం ఇప్పుడు కాదు.. చిన్ననాటి నుంచే సామాజిక సమస్యలపై తన గాత్రంతో బాణాన్ని ఎక్కుపెట్టింది. ముఖ్యంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనని.. అంటూ తను రాసి.. పాడిన పాట దాదాపు 17 ఏళ్ల క్రితమే సంచలనం క్రియేట్ చేసింది. చిన్న వయస్సులో ఓ కార్యక్రమంలో కంటెస్టెంట్‌గా ఉన్న మధుప్రియ ఈ పాట పాడగా.. హోస్ట్ సుమతో పాటు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన సుద్దాల అశోక్ తేజ కంటతడి పెట్టారు. తనలోని వేదనను ఆమె పాటగా మలిచి.. ఆలపించిన తీరుకు… లిరిసిస్ట్ చంద్రబోస్, మనో, గోరటి వెంకన్న నిశ్చేష్టులయ్యారు. ఆమె భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు వెళ్తుందని.. కితాబిచ్చారు. వాళ్లు దీవించినట్లుగానే.. మధుప్రియ ఇప్పుడు తన మార్క్ పాటలతో దూసుకుపోతుంది. పల్లె పాటలతో పాటు సినిమా గేయాలకు గాత్రం అందిస్తూ ముందుకు సాగుతోంది. ఫిదా సినిమాలోని “వచ్చిందే” పాటకు  ఆమె ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. మధుప్రియ మరిన్ని మంచి పాటలతో శ్రోతలను అలరించాలని కోరుకుందాం…

మధుప్రియ చిన్నతనంలో పాడిన “ఆడపిల్లనమ్మ” సాంగ్ దిగువన చూడండి…