AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరితో సినిమాలు చేశా కానీ ఆ ఇద్దరు హీరోలతో ఛాన్స్ రాలేదు.. ఆమని ఆసక్తికర కామెంట్స్

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు క్యారెక్టరర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు కొందరు హీరోయిన్స్. ఆ జాబితాలో సీనియర్ నటి ఆమని ఒకరు. అప్పట్లో ఆమనీకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆమానికి అభిమానులు ఎక్కువ. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు. ఫ్యామిలీ ఎంటటైనర్ మూవీస్ లో ఆమని ఆకట్టుకున్నారు.

అందరితో సినిమాలు చేశా కానీ ఆ ఇద్దరు హీరోలతో ఛాన్స్ రాలేదు.. ఆమని ఆసక్తికర కామెంట్స్
Aamani
Rajeev Rayala
|

Updated on: Jan 19, 2026 | 9:34 PM

Share

ఒకప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలిన తారల్లో ఆమని ఒకరు. తన నటీనహో ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసారు ఆమని. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలతో పాటు పలు సీరియల్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్‌ను ఒక దశలో గోల్డెన్ పీరియడ్ అని, కొన్నిసార్లు ప్లాటినం పీరియడ్ అంటూ చెప్పుకొచ్చారు. తొలుత హీరోయిన్‌గా మోడ్రన్ డ్రెస్సులు, గ్లామరస్ పాటలు ఉంటాయని భావించిన ఆమెకు, మిస్టర్ పెళ్లాం వంటి చిత్రాలు అనూహ్యంగా మధ్యతరగతి మహిళ పాత్రలతో గుర్తింపు తెచ్చాయి. జంబలకడి పంబలో పూర్తి గ్లామరస్, బబ్లీ పాత్ర చేసిన ఆమనిలో మిస్టర్ పెళ్లాం వంటి విభిన్న పాత్రను బాపు గారు చేయించడం అద్భుతమని ఆమె అన్నారు. మిస్టర్ పెళ్లాం సినిమా అవకాశం రాజేంద్ర ప్రసాద్ గారి వల్ల లభించిందని ఆమని వెల్లడించారు.

ఎన్టీ రామారావు బ్యానర్‌పై బాపు దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్‌తో కలసి శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రంలో ఒక పాట చేసిన తర్వాత, రాజేంద్ర ప్రసాద్‌ ఆమెను మిస్టర్ పెళ్లాం కోసం బాపు గారికి సిఫార్సు చేశారని తెలిపారు ఆమని. బాపు గారు మౌనంగానే ఓకే అన్నారని, వారం రోజుల్లో షూటింగ్ ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో బాపు, రాజేంద్ర ప్రసాద్ ల నుంచి క్రమశిక్షణ, నటనలోని మెళకువలు నేర్చుకున్నానని ఆమని చెప్పారు. ఉదయం 7 గంటలకు కాల్‌షీట్ అంటే బాపు గారు 6 గంటలకే సెట్‌లో ఉండేవారని, రాజేంద్ర ప్రసాద్ కూడా సమయపాలన పాటించేవారని పేర్కొన్నారు ఆమని. తన కెరీర్ టైంలో రమ్యకృష్ణ, మీనా, రోజా, సౌందర్య, ఇంద్రజ వంటి స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ, వారి మధ్య పోటీ తత్వం లేదని, మంచి స్నేహం ఉండేదని ఆమని వివరించారు.

రమ్యకృష్ణ స్వయంగా వచ్చి శుభలగ్నంలో తన నటనను ప్రశంసించారని ఆమె గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలతో నటించినా, చిరంజీవి, వెంకటేష్ లతో పనిచేసే అవకాశం రాలేదని ఆమె అన్నారు. కె. విశ్వనాథ్, దాసరి నారాయణ రావు, కె. రాఘవేంద్ర రావు వంటి లెజెండరీ దర్శకులతో పనిచేయడం తన అదృష్టంగా భావించా అన్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఉండగా వివాహం కారణంగా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని, మంచి క్యారెక్టర్లను కోల్పోయానని ఆమని అన్నారు. నటిగా ఎప్పటికీ సంతృప్తి ఉండదని, ఇంకొన్ని మంచి పాత్రలు చేయాలనిపిస్తుందని ఆమె అన్నారు. సౌందర్య చేసిన ఆవిడే మా ఆవిడ చిత్రం మొదట తనకు ఆఫర్ వచ్చిందని, అయితే సౌందర్య అద్భుతంగా చేసిందని చెప్పారు. శుభలగ్నం తన కెరీర్‌కు గేమ్ టర్నర్‌గా నిలిచిందని, ఆ సినిమాకు రాష్ట్ర అవార్డు రాకపోయినా, ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించిందని, మోహన్‌లాల్ చేతుల మీదుగా అందుకున్నానని తెలిపారు. మిస్టర్ పెళ్లాం, శుభ సంకల్పం చిత్రాలకు ఉత్తమ నటిగా నంది అవార్డులు వచ్చాయని, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ వంటి నటులతో చేసిన సినిమాలకు అవార్డులు రావడం గర్వకారణమని ఆమని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..