Akkineni Nagarjuna: “మంత్రి వ్యాఖ్యల వల్ల మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది..” కోర్టుకు నాగార్జున వాంగ్మూలం
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకొవాలని కోర్టును కోరారు హీరో నాగార్జున. మంత్రి చేసిన వాఖ్యల వలన తమ కుటుంబానికి పెద్ద డ్యామేజ్ జరిగిందని.. కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను జత చేశారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. దేనికోసం పిటిషన్ ఫైల్ చేసారని నాగార్జునను ప్రశ్నించింది కోర్టు. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాద పూర్వక వాఖ్యలు చేశారని నాగర్జున కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన తెలిపారు. మంత్రి హోదాలో ఉండి నా కొడుకు నాగచైతన్య, సమంత విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు.
“సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మా కుటుంబానికి ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నాం. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి సురేఖ అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని అసత్య ఆరోపణలు. రాజకీయ దురద్దేశంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మా కుటుంబం ఆమె వ్యాఖ్యలతో తీవ్ర ఆవేదనకు లోనైంది. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానెల్స్ ప్రసారం చేసాయి. అన్ని పేపర్స్ ప్రచురితం చేసాయి. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందే” అంటూ కోర్టుకు తెలుగులో తన వాంగ్మూలాన్ని తెలియజేశారు హీరో నాగార్జున.
నాగార్జున వెంట కోర్టుకి ఆయన భార్య అమల, తనయుడు నాగచైతన్య, సోదరి నాగ సుశీల, మేనకోడలు సుప్రియ యార్లగడ్డ కూడా హాజరయ్యారు. సాక్షులుగా కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్ కూడా కోర్టు రికార్డు చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: ఈ అబ్బాయిని గుర్తుపట్టారా.. ఇప్పుడు తోపు హీరో.. తన పేరే ఓ సెన్సేషన్