Agent Movie Review: ‘ఏజెంట్’ మూవీ రివ్యూ.. లవర్ బాయ్ యాక్షన్ సక్సెస్ అయ్యిందా ?..
కొన్ని రోజులుగా అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ గురించి చర్చ బాగా జరుగుతుంది. దానికి కారణం ఆయన మార్కెట్‌కు మించిన ఖర్చు పెట్టడం ఒకటైతే.. యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకోవడం మరో ఎత్తు. సిక్స్ ప్యాక్ చేసి బీస్ట్ మోడ్‌లోకి వచ్చారు అఖిల్. మరి ఈయన కష్టం వర్కవుట్ అయిందా.. ఏజెంట్ ఎలా ఉంది..?
మూవీ రివ్యూ: ఏజెంట్
నటీనటులు: అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, విక్రంజీత్, ఊర్వశి రౌతేలా తదితరులు
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, జార్జ్ సి విలియమ్స్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: హిప్ హాప్ తమిళన్, భీమ్స్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపా రెడ్డి
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
కొన్ని రోజులుగా అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ గురించి చర్చ బాగా జరుగుతుంది. దానికి కారణం ఆయన మార్కెట్‌కు మించిన ఖర్చు పెట్టడం ఒకటైతే.. యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకోవడం మరో ఎత్తు. సిక్స్ ప్యాక్ చేసి బీస్ట్ మోడ్‌లోకి వచ్చారు అఖిల్. మరి ఈయన కష్టం వర్కవుట్ అయిందా.. ఏజెంట్ ఎలా ఉంది..?
కథ:
రామకృష్ణ అలియాస్ రిక్కీ (అఖిల్ అక్కినేని) ఓ హ్యాకర్. ఎలాగైనా ఇండియన్ RAW లో చేరి ఏజెంట్‌గా మారాలనేది ఆయన కల. దానికోసమే బతుకుతుంటాడు రిక్కీ. అలాంటి రిక్కీ జీవితంలోకి అనుకోకుండా వైద్య (సాక్షి వైద్య) ప్రేమలో పడతాడు. అదే సమయంలో రా కోసం అప్లై చేస్తుంటాడు. కానీ ప్రతిసారి రిజెక్ట్ అవుతూ ఉంటాడు రిక్కీ. దాంతో తను రా కు వెళ్లడం కాదు.. రా తనను పట్టించుకోవాలని ఏకంగా రా అకౌంట్‌నే హ్యాక్ చేస్తాడు రిక్కీ. అది చూసి రా ఛీఫ్ చీఫ్ మహదేవ్ అలియాస్ డెవిల్ (మమ్ముట్టి) అక్కడికి వస్తాడు. ఇక రా మాజీ ఏజెంట్ ధర్మ అలియాస్ గాడ్ (డినో మోరియా) ఓ సిండికేట్‌ను ఏర్పాటు చేసి ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలతో కలిసి పని చేస్తుంటాడు. అతన్ని పట్టుకోడానికి డెవిల్ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ వర్కవుట్ అవ్వదు. ఆ సమయంలోనే డెవిల్ దృష్టిలో రిక్కీ పడతాడు. ఆ మిషన్ అతడికి అప్పచెప్తాడు. దానికోసం వెళ్లిన రిక్కీ ఊహించని విధంగా కేంద్ర మంత్రి జయకిషన్ (సంపత్‌రాజ్) దగ్గరికి చేరతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది అసలు కథ..
కథనం:
స్పై డ్రామా తెరకెక్కించడం అంత ఈజీ కాదు. అన్ని సినిమాలకు ఇంచుమించు ఒకే కథ ఉంటుంది.. దేశాన్ని కాపాడడం కోసం ప్రాణం సైతం లెక్కచేయని ఏజెంట్ కథలే అన్ని. అఖిల్ ఏజెంట్ కూడా దీనికి మినహాయింపు కాదు. దేశాన్ని నాశనం చేయాలనుకునే టెర్రరిస్టుల నుంచి RAW ఎలా కాపాడింది అనేది లైన్. దాన్ని సురేందర్ రెడ్డి తన స్టైల్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. కాకపోతే యాదృచ్ఛికంగా పఠాన్ సినిమా కథ ఇదే కావడం ఏజెంట్ కు మైనస్ గా మారింది. రెండిట్లోనూ చాలా సన్నివేశాలు సేమ్ టు సేమ్ ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ అయితే పఠాన్ చూసినట్లే అనిపిస్తుంది. ట్విస్ట్ కూడా అదే కావడంతో మరింత మైనస్‌గా మారింది. దీనికి స్క్రీన్ ప్లే కూడా చాలా వీక్‌గా ఉంది. యాక్షన్స్ సన్నివేశాల వరకు ఏజెంట్ అదరగొట్టాడు అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త సీరియస్ గా ఉండుంటే బాగుండేది. ఫస్టాఫ్ కొన్ని సీన్స్ బాగున్నాయి.. ముఖ్యంగా అఖిల్ కేంద్ర మంత్రి ఇంటికి వచ్చి బెదిరించే సీన్ భలేగా వర్కవుట్ అయింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ మ్యాడ్ అంతే. కీలకమైన సెకండాఫ్ మాత్రం గాడి తప్పింది. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్లుకోలేదు. మధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. వాటికోసమే సినిమా చూడాలా అనిపించేంతలా తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి.
నటీనటులు:
అఖిల్ సినిమా కోసం ప్రాణం పెట్టాడు.. అందులో ఎలాంటి అనుమానం లేదు. సిక్స్ ప్యాక్ చేయడమే కాకుండా.. స్పెషల్‌గా బాడీ బిల్డ్ చేసాడు. కాకపోతే ఆ కష్టానికి తగ్గ కథ పడలేదు. మమ్ముట్టి పాత్ర కూడా బాగుంది. ఆయన్నే ఎందుకు తీసుకున్నారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆయన కారెక్టరైజేషన్ కూడా ఆకట్టుకుంటుంది. సాక్షి వైద్య ఉన్నంతలో బెటర్.. అందంగానూ ఉంది. డినో మోరియా విలనిజం పెద్దగా ఆకట్టుకోలేదు. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
ఏజెంట్‌కు మ్యూజిక్ పెద్ద మైనస్. పాటలు అస్సలు ఆకట్టుకోలేదు. కాకపోతే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ కాస్త వీక్. సెకండాఫ్ డల్ అయిపోయింది. యాక్షన్ సీన్స్ మినహా మిగిలిన సీన్స్ చూడలేం. దర్శకుడిగా సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ చూపించాడు కానీ స్టోరీ టెల్లింగ్ విషయంలో మాత్రం తడబడ్డాడు. ఇలాంటి కథలు చాలా రావడంతో ఏజెంట్ కొత్తగా ఏం అనిపించదు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ఏజెంట్.. యాక్షన్ సక్సెస్.. మిషన్ ఫెయిల్యూర్..