Major Movie Review : జవాన్ల జీవితాలకు అద్దం పట్టే… మేజర్
మనకోసం మనం బతకడమే బరువనుకునే వాళ్లున్న ఈ రోజుల్లో, జనం కోసం బతుకుతున్న వాళ్ల కథలు ప్రజలకు తెలియాలి. మేకర్స్ చెప్పాలి. ఇల్లూ, వాకిళ్లూ, కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లకు దూరంగా బతికే జవాన్ల గురించి పరిచయం..
మనకోసం మనం బతకడమే బరువనుకునే వాళ్లున్న ఈ రోజుల్లో, జనం కోసం బతుకుతున్న వాళ్ల కథలు ప్రజలకు తెలియాలి. మేకర్స్ చెప్పాలి. ఇల్లూ, వాకిళ్లూ, కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లకు దూరంగా బతికే జవాన్ల గురించి పరిచయం చేయాలి. అందులోనూ సాహసమే ఊపిరిగా బతికి, ఎందరికో ప్రాణాలు పోసిన వాళ్ల గురించి తప్పక వివరించాలి. విజువలైజ్ చేయాలి. అలాంటి అద్భుతమైన ప్రయత్నమే మేజర్.
సినిమా: మేజర్
సంస్థ: సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్, ఎ ప్లస్ యస్ మూవీస్
నటీనటులు: అడివి శేష్, ప్రకాష్‌రాజ్, సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, రేవతి, మురళీశర్మ, అనీష్ కురువిల్ల తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటింగ్: విజయ్ కుమార్ సిరిగినీడి, కోదాటి పవన్ కల్యాణ్
కెమెరా: వంశీ పచ్చిపులుసు
విడుదల: 3.6.2022
సందీప్ ఉన్నికృష్ణన్ చిన్నప్పటి నుంచి నేవీ ఆఫీసర్ కావాలని కలలు కంటాడు. అప్లై కూడా చేస్తాడు. కానీ కంటి సమస్య కారణంగా రిజక్ట్ అవుతాడు. ఆ తర్వాత మిలిటరీలో జాయిన్ అవుతాడు. నార్త్ లో కఠోరమైన శిక్షణ తీసుకుంటాడు. ఆ క్రమంలోనే సోల్జర్ అనే పదానికి సిసలైన మీనింగ్ తెలుసుకుంటాడు. సోల్జర్ అనేది ఒక ఉద్యోగమో, పదవో కాదు. బాధ్యత, బతికే విధానం అని అర్థం చేసుకుంటాడు. మరోవైపు తనతో చదువుకున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అన్నీ విధాలా అర్థం చేసుకునే అనుకూలమైన తల్లిదండ్రులు, నచ్చిన అమ్మాయితో జీవితం.. అయినా సందీప్‌కి వీటన్నిటి కన్నా దేశమే ముఖ్యం. కర్తవ్యం ముందు కంటికి ఇంకేవీ కనిపించవు. అలాగని ఎవరినీ రిస్ట్రిక్ట్ చేయడు. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లని బతకనిస్తాడు. తెగువతో ఉండాలంటాడు. తను ఎంచుకున్న రంగంలో అత్యుత్తమ స్థాయికి చేరుకుంటాడు. చివరికి ముంబై ఉగ్రదాడుల్లో అమాయకులను కాపాడే మిషన్‌లో ప్రాణాలు పోగొట్టుకుంటాడు. మూడు పదుల సందీప్ జీవితం ఇంతే. కానీ లోతుగా ఆలోచిస్తే అతని జీవితంలో ఓ స్ఫూర్తి ఉంది. అనుకున్నది చేయాలి. ఫోకస్‌గా చేయాలి. కాంప్లికేషన్స్ వద్దు. క్లియర్‌గా ఉండాలి. నిజాయతీగా బతకాలి. సాటి మనిషిని ప్రోత్సహించాలి. యూనిటీని నమ్మాలి. జీవితంలో ఎవరికీ ఎక్కువ టైమ్ కేటాయించలేం. కానీ కేటాయించడానికి ఉన్న సమయాన్నంతా తనవారికే కేటాయించాలి… ఇలాంటి ఎన్నెన్నో విలువలున్న జీవితం సందీప్‌ది.
అడివి శేష్ సందీప్ కేరక్టర్‌కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ఆ మధ్య మాధవన్ ఓ ఇంటర్వ్యూలో అన్నట్టు… బయోపిక్స్ చేసేటప్పుడు ఒరిజినల్ వ్యక్తుల్ని తెరమీద రిఫ్లెక్ట్ చేయడం ముఖ్యం. ఆ విషయంలో అడివి శేష్ సక్సెస్ అయ్యారు. తనని తాను సోల్జర్‌గా మలచుకుని కెమెరా ముందు నిలుచున్న విధానం, ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించిన తీరు జనాల మెప్పు పొంది తీరుతుంది. స్క్రీన్ మీద ప్రతి సన్నివేశంలోనూ, ప్రతి క్షణంలోనూ నిజాయతీగా కనిపించారు శేష్. మంచి పాత్రలు దొరికితే ప్రకాష్‌రాజ్‌లాంటి నటులను ఆపగలమా? సందీప్ తండ్రి కేరక్టర్‌లో జీవించేశారు ప్రకాష్‌రాజ్. సందీప్ తండ్రి ఆయనేనేమో, తల్లి నిజంగా రేవతేనేమో అన్నంత నేచురల్‌గా కనిపించారు వారిద్దరూ. సందీప్ చనిపోయాడని వార్త తెలుసుకున్నప్పుడు రోడ్డు మీద వారిద్దరు ఏడుస్తుంటే ప్రేక్షకుడి హృదయం ద్రవించకమానదు. సందీప్ భార్యగా సయీ మంజ్రేకర్ పర్ఫెక్ట్ గా సూటయ్యారు. స్కూలు స్టూడెంటుగా, గ్రాడ్యుయేట్‌గా, వర్కింగ్ విమెన్‌గా, దూరంగా ఉన్న తన భర్తకు దగ్గరవ్వాలని తాపత్రయపడే ఇల్లాలిగా, అన్నీ ఎమోషన్స్ బాగా పండించారు. శోభిత స్క్రీన్ టైమ్ తక్కువే అయినా, ఇంపార్టెన్స్ ఉన్న కేరక్టర్ చేశారు. మురళీశర్మ, అడిశిశేష్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బావున్నాయి. శశికిరణ్ తిక్క ఈ సబ్జెక్ట్ ని చక్కగా డీల్ చేశారు. అందరి వర్క్ ని అప్రిషియేట్ చేసి ఎలివేట్ చేసేలా ఉంది శ్రీచరణ్ పాకాల మ్యూజిక్. సన్నివేశాలకు తగ్గట్టు నేపథ్య సంగీతం ఇచ్చి సినిమాకు ఒకరకంగా ప్రాణం పోశారు శ్రీచరణ్. అబ్బూరి రవి సింపుల్ డైలాగులే రాసినా సిట్చువేషనల్‌గా సూటయ్యాయి. అందరికీ మీలా ఫెవికాల్ బాండింగ్ ఉండదు కదా అని హీరో తల్లిదండ్రులతో చెప్పే తీరు, హాస్పిటల్‌లో ఏం జరిగింది అని హీరో తన భార్యనడిగితే, నువ్వుండు చెప్తా… నువ్వుంటే చెప్తా అని హీరోయిన్ అనే మాట… మురళీశర్మ ఎమోషనల్‌గా చెప్పే డైలాగులు… సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. కాస్ట్యూమ్స్, లొకేషన్స్, లైటింగ్, కెమెరా, ఎడిటింగ్ అందకి పనితీరు పక్కాగా కుదిరింది. సరదాగా కాదు, మనకోసం బార్డర్‌లో కష్టపడే జవాన్ల జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే అప్పుడప్పుడూ ఇలాంటి సినిమాలు చూడాల్సిందే. లాస్ట్ ఇయర్ రిలీజైన షేర్‌షా, ఇప్పుడు మేజర్… జవాన్ల జీవితాలను సామాన్యులకు పరిచయం చేసేవే.
– డా. చల్లా భాగ్యలక్ష్మి