Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సొంత ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లో.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
ఒకప్పటి ప్రముఖ నటి అశ్విని జీవితం స్టార్‌డమ్ నుండి దయనీయమైన ముగింపు వరకు సాగిన విషాద గాథ. వందకు పైగా చిత్రాలలో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్న అశ్విని, వ్యక్తిగత జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేసిన వాణి, దర్శకుడు ధవళ సత్యం ద్వారా అశ్వినిగా పేరు మార్చుకున్నారు. కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోల సరసన నటించి తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు పొందారు.

సాధారణంగా సినిమా ప్రపంచంలో స్టార్‌డమ్ అనేది తాత్కాలికమని, అది దూరమైతే జీవితం ఎంత దయనీయంగా మారుతుందో ఇదివరకు చాలా మంది నటీనటుల లైఫ్ చూశాం. కోట్ల ఆస్తులు సంపాదించి లగ్జరీ లైఫ్ గడిపిన చాలా మంది తారలు చివరకు ఊహించని విధంగా కష్టాలు ఎదుర్కొన్నారు. తినడానికి తిండి లేక అనాథాల మరణించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి అశ్విని జీవితం ఇందుకు ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఒకప్పటి యువకథానాయిక అశ్విని జీవితం అనూహ్యమైన మలుపులు తిరుగుతూ విషాదకరంగా ముగిసింది. వందకు పైగా చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ, చివరి రోజుల్లో చెన్నైలో ఒక్క ఇల్లు తప్ప ఆమెకు ఇతర ఆస్తులేవీ మిగలలేదు. ఇల్లు గడవని పరిస్థితులు ఏర్పడటంతో ఆ ఇంటిని కూడా అమ్మి అద్దె ఇంట్లో జీవనం సాగించారు. 2012లో రీ-ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించినా, ఆరోగ్యం సహకరించలేదు. అశ్విని అసలు పేరు వాణి. నెల్లూరు స్వస్థలం. ఇంటర్ వరకు చదివి, డాన్స్ నేర్చుకున్న ఆమెకు మెడిసిన్ చదవాలనే కోరిక ఉండేది. ఒకసారి చెన్నైలో బట్టల షాపుకు వెళ్లినప్పుడు నిర్మాత వాకాడ అప్పారావు ఆమెను చూసి, దర్శకుడు కోడి రామకృష్ణకు పరిచయం చేశారు. కోడి రామకృష్ణ సిఫార్సుతో దర్శకుడు ధవళ సత్యం గుడిగంటలు మోగాయి చిత్రంలో వాణికి అవకాశం ఇచ్చారు. ఆమె నక్షత్రం అశ్విని కావడంతో, ధవళ సత్యం ఆమె పేరును అశ్వినిగా మార్చారు. గుడిగంటలు మోగాయి నిర్మాణం ఆలస్యం కావడంతో, ఆమె తొలి చిత్రం రెబల్ స్టార్ కృష్ణంరాజు సరసన నటించిన భారతంలో శంఖారావం అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్‌గా అశ్విని బిజీ అయ్యారు.
కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్ వంటి అగ్ర హీరోల సరసన అశ్విని నటించారు. వజ్రాయుధం, కొడుకు దిద్దిన కాపురం, శ్రీవారు, పెళ్లిచేసిచూడు, వివాహ భోజనంబు, కల్యాణ చక్రవర్తి, ఇంటిదొంగ, భలే తమ్ముడు, అరణ్యకాండ, కలియుగ పాండవులు, స్టేషన్ మాస్టర్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో ఆమె భాగమయ్యారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 150 చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందారు. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో, 1991లో అశ్విని రవీంద్రనాథన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. మద్రాసులో వీడియో స్టూడియో నిర్వహించే రవీంద్రనాథన్‌తో 1991 ఏప్రిల్ 4న ఆళ్వారుపేటలోని కళ్యాణ మండపంలో సంప్రదాయ పద్ధతిలో కాకుండా, కేవలం దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వివాహాన్ని నమోదు చేసుకున్నారు. వారికి కార్తీక్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, కొంతకాలం బాగానే ఉన్న రవీంద్రనాథన్ ఉన్నట్టుండి అశ్వినిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
సినిమాల్లో అవకాశాలు తగ్గడం, భర్త దూరం కావడం, ఆర్థిక ఇబ్బందులు అశ్విని ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఆమె లంగ్ క్యాన్సర్‌కు గురయ్యారు. వైద్యానికి అవసరమైన డబ్బులు లేకపోవడంతో ఆమె సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోయాయి. చివరి రోజుల్లో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమిళ హీరో పార్థిబన్ కుమారుడు రాధాకృష్ణన్, అశ్విని కుమారుడు కార్తీక్ క్లాస్‌మేట్స్ కావడం, కార్తీక్ తమ కష్టాలను స్నేహితుడికి వివరించడంతో పార్థిబన్ ఈ విషయాన్ని తెలుసుకున్నారు. అడపాదడపా పార్థిబన్ అశ్విని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. క్యాన్సర్ ముదిరి 2012 సెప్టెంబర్ 24న అశ్విని కన్నుమూశారు. అప్పటికి ఆమె వయసు కేవలం 36 ఏళ్లే. తన అంత్యక్రియలు సొంత ఊరైన నెల్లూరులో జరగాలని అశ్విని చివరి కోరిక. అయితే, ఆఖరి కోరిక నెరవేర్చడానికి కూడా కుటుంబానికి డబ్బులు లేకపోవడంతో, పార్థిబన్ ముందుకు వచ్చి సొంత ఖర్చులతో ఆమె పార్థివ దేహాన్ని నెల్లూరుకు పంపించారు. అశ్విని కుమారుడు కార్తీక్‌ను చదివించే బాధ్యతను కూడా ఆయన స్వీకరించారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..
