అబ్బబ్బ.. ఈ చల్లని వాతావరణంలో.. నెల్లూరు పులిబొంగరాలు ఎర్రకారంతో తింటుంటే ఆ మజానే వేరప్పా..
చల్లని వాతావరణంలో వేడి వేడి నెల్లూరు స్పెషల్ పులిబొంగరాలు తింటే ఆ మజానే వేరు. బయట కరకరలాడుతూ, లోపల గుల్లగా ఉండే ఈ పులిబొంగరాలకు ఎర్రకారం జతైతే రుచి రెట్టింపు అవుతుంది. సరైన కొలతలు, సీక్రెట్ టిప్స్‌తో ఇంట్లోనే నెల్లూరు స్టైల్ పులిబొంగరాలు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

చల్లని వాతావరణంలో కరకర లాడే వేడి వేడి స్నాక్స్ ఉంటే ఆ మజానే వేరు.. అలాంటి వాటిలో నెల్లూరు స్పెషల్ పులిబొంగరాలు ఒకటి.. పులిబొంగరాలకు జతగా వడ్డించే ఎర్రకారంతో దాని టేస్టే మారిపోతుంది.. దీనిగురించి చాలా మందికి తెలుసు.. కానీ.. పెద్దగా ఈ రెసిపీని చేసుకోరు.. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే.. ఈ సీక్రెట్ రెసిపీని సింపుల్ గా చేసుకోవచ్చు.. సరైన పద్ధతులు, కొలతలు పాటిస్తే పైన క్రిస్పీగా, లోపల గుల్లగా ఉండే పర్ఫెక్ట్ పులిబొంగరాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
పులిబొంగరాల పిండి తయారీ:
పులిబొంగరాల కోసం ముందుగా పిండిని సిద్ధం చేసుకోవాలి. ఒక కప్పు మినపగుళ్లకు రెండు కప్పుల లావు బియ్యం (రేషన్ బియ్యం లేదా దోసల బియ్యం) తీసుకోవాలి. వీటితో పాటు ఒక టీస్పూన్ మెంతులను కూడా చేర్చుకోవాలి. ఈ మూడింటినీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, ఐదు ఆరు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. నానిన తర్వాత నీళ్లన్నీ వంపేసి, మిక్సీ జార్ లో వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా, గట్టిగా గ్రైండ్ చేయాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు. గ్రైండ్ చేసిన పిండి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి.
పిండి పులియబెట్టడం:
గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, 10 నుండి 12 గంటల పాటు రూమ్ టెంపరేచర్ లో పులియబెట్టాలి. పిండి చక్కగా పులిస్తేనే పులిబొంగరాలు రుచిగా, గుల్లగా వస్తాయి. దోసల పిండిలో వాడుతున్న అటుకులు, పచ్చిశనగపప్పు వంటి పదార్థాలు, పల్చటి కన్సిస్టెన్సీ వల్ల పులిబొంగరాల రుచి మారిపోతుంది. కాబట్టి, ఈ రెసిపీకి ప్రత్యేకంగా ఈ పిండిని తయారు చేసుకోవడం ఉత్తమం.
పులిబొంగరాల మిశ్రమం తయారీ:
చక్కగా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి రెండు మధ్యస్థాయి ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరిగి, చేత్తో నలుపుతూ వేసుకోవాలి. అలాగే రెండు మూడు పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక గంట ముందు నానబెట్టిన పావు కప్పు పచ్చిశనగపప్పు (వేడి నీటిలో నానబెడితే 15-20 నిమిషాల్లో నానిపోతాయి), రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. పిండి చక్కగా పులిసింది కాబట్టి వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పొరపాటున పిండి పల్చనైతే కొద్దిగా మైదా పిండి, చిటికెడు వంటసోడా వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఎర్రకారం తయారీ:
ఎర్రకారం కోసం మిక్సీ జార్ లోకి రెండు మధ్యస్థాయి ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా, 10-12 వెల్లుల్లి రెబ్బలు, చాలా కొద్దిగా చింతపండు, ఒక టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు లేకుండా మెత్తగా గ్రైండ్ చేయాలి. అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకోవచ్చు. దీన్ని పోపు వేసి తయారు చేసుకోవచ్చు. పోపు కోసం రెండు టేబుల్ స్పూన్ల నూనెలో అర టీస్పూన్ ఆవాలు, మినపగుళ్లు, జీలకర్ర వేసి వేయించాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసి, గ్రైండ్ చేసిన ఎర్రకారాన్ని వేసి, ఉల్లిపాయ పచ్చిదనం పోయి దగ్గరపడే వరకు తక్కువ మంటపై వేయించాలి. ఈ ఎర్రకారం ఇడ్లీ, దోసలకు కూడా అద్భుతమైన కాంబినేషన్..
పులిబొంగరాలను వేయించడం:
డీప్ ఫ్రై కి సరిపడా నూనెను కడాయిలో వేసి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక, మంటను మీడియం ఫ్లేమ్ లోకి తగ్గించి, పిండిని పెద్ద సైజులో పులిబొంగరాలుగా వేయాలి. కడాయికి సరిపడా మాత్రమే వేయాలి, ఎక్కువగా వేస్తే ఒకదానికొకటి అతుక్కుంటాయి. మీడియం మంటపై అన్ని వైపులా తిప్పుకుంటూ బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో వేయిస్తే బయట కాలి లోపల పచ్చిగా ఉంటాయి, లో ఫ్లేమ్ లో వేయిస్తే నూనె పీల్చుకుంటాయి. మంచి బంగారు రంగు వచ్చాక తీసి, వేడివేడిగా ఎర్రకారంతో సర్వ్ చేయాలి. రెండో వాయి వేసేటప్పుడు నూనెను మళ్ళీ వేడి చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ప్రాసెస్ లో చేసిన పులిబొంగరాలు పైన క్రిస్పీగా, లోపల గుల్లగా వస్తాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
