AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarath Babu: ఇండస్ట్రీలో శరత్ బాబు ఆల్ రౌండర్.. హీరోగానే కాదు.. విలనిజంలోనూ..

తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం గుర్తుండిపోయే నటుల్లో శరత్‌బాబు ఒకరు. ఆరడుగుల పొడవు, నిటారైన ముక్కు, ఖంగుమనే స్వరం, జమీందారుగానైనా, మధ్యతరగతి మనిషిగానైనా మెప్పించగల నైజం... అంటూ ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. ఆముదాలవలసలో డిగ్రీ పూర్తికాగానే చెన్నై ట్రైన్‌ ఎక్కేశారు శరత్‌బాబు. 1973లో రామరాజ్యం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.

Sarath Babu:  ఇండస్ట్రీలో శరత్ బాబు ఆల్ రౌండర్.. హీరోగానే కాదు.. విలనిజంలోనూ..
Sarath Babu Movies
Rajitha Chanti
|

Updated on: May 22, 2023 | 3:37 PM

Share

ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి.. సినీప్రియులను అలరించిన అలనాటి నటుడు శరత్‌బాబు… తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు.. లంగ్స్ ఇష్యూతోనూ ఇబ్బంది పడుతున్న ఆయన కొంత కాలంగా చెన్నైలో చికిత్స తీసుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో… వైద్యుల సూచన ప్రకారం ఈ నెల 20న హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్స్‌కు శరత్‌బాబును షిఫ్ట్‌ చేశారు. దాదాపు నెల రోజులు మృత్యువుతో పోరాడిన ఆయన సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ప్రస్తుతం శరత్‌బాబు వయసు 72 ఏళ్ళు. చిత్రపరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చినా ఆయన చెన్నైలోనే సెటిల్‌ అయ్యారు.

తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం గుర్తుండిపోయే నటుల్లో శరత్‌బాబు ఒకరు. ఆరడుగుల పొడవు, నిటారైన ముక్కు, ఖంగుమనే స్వరం, జమీందారుగానైనా, మధ్యతరగతి మనిషిగానైనా మెప్పించగల నైజం… అంటూ ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. ఆముదాలవలసలో డిగ్రీ పూర్తికాగానే చెన్నై ట్రైన్‌ ఎక్కేశారు శరత్‌బాబు. 1973లో రామరాజ్యం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమా షూటింగ్‌లో స్పాట్‌లో శరత్‌బాబును చూసి ‘అరే.. యూరోపియన్‌ కంట్రీస్‌ నుంచి వచ్చినట్టున్నావ్‌’ అని అన్నారట ఎస్వీరంగారావు. తను అంతగా ఆరాధించే నటుడు అలా అనేసరికి ఒక్కసారిగా బూస్ట్ తాగినట్టు అనిపించిందని చెబుతుండేవారు శరత్‌బాబు.

రామరాజ్యంలో శరత్‌బాబు నటనను చూసిన వారు, ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చాడని సంతోషించారు. అందరూ తనను హీరో అన్నారు కదా అని, జస్ట్ హీరోగానే ఉండాలనుకోలేదు శరత్‌బాబు. పెద్ద హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు చేశారు. ఎన్టీఆర్‌తో ఒకటికి నాలుగు సినిమాలు చేశారు. కెమెరా ముందు ఎన్టీఆర్‌ని ఏరా అంటూ పిలుస్తూ ఫ్రెండ్‌గా నటించాల్సి వచ్చినప్పుడు కాస్త తడబడిన విషయాన్ని కూడా గుర్తుచేసుకునేవారు.

ఇవి కూడా చదవండి

శరత్‌బాబు నటనను మెచ్చుకున్నవాళ్లందరూ సహజ నటుడు అని అంటారు. కానీ ఆయన మాత్రం పేరుకు ముందూ వెనుకా ఏమీ ఉండకూడదని అనుకునేవారు. ఎవరైనా సహజనటుడు అని పిలిచినప్పుడు మాత్రం ఆయన ముఖంపై వెలుగు కనిపించేది. ఇండస్ట్రీకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చినవారు రిటైర్‌మెంట్‌ ఏజ్‌ వచ్చినా పక్క పాత్రల జోలికి వెళ్లాలనుకోరు. ఒక్కసారి క్యారక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తే అవకాశాలు తగ్గిపోతాయన్న భయం ఆయనలో ఎప్పుడూ లేదట. తన నటన మీద నమ్మకం ఉంది కాబట్టే అన్ని ప్రయోగాలు చేశానని చెప్పేవారు శరత్‌బాబు. టీవీ ఆర్టిస్టుగానూ మంచి పేరే ఉంది ఈ నటుడికి. ఇండస్ట్రీలో ఎవరూ తనకు అవకాశాలు ఇప్పించలేదని, రికమండేషన్లతో నాలుగున్నర దశాబ్దాలు ఏ వ్యక్తీ నటుడిగా కొనసాగలేడన్నది శరత్‌ విశ్వాసం. సాంఘిక సినిమాల్లో మాత్రమే కాదు పౌరాణిక జానపద చారిత్రక, భక్తి చిత్రాల్లో నటించిన క్రెడిట్‌ ఉంది శరత్‌బాబుకి.

నాయకుడులో దుష్టభూమిక పోషించారు శరత్‌బాబు. మగధీరలో ఉదయగిరి మహారాజుగా నటించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహారాజుగా హుందాతనం, గాంభీర్యం ఉట్టిపడేలా కనిపించారు. ప్రతి ఏటా కార్తీకమాసం రాగానే అయ్యప్ప భక్తులందరూ శరత్‌బాబు నటించిన సినిమాను గుర్తుచేసుకుంటారు. అయ్యప్ప చిత్రంలోనే కాదు, శ్రీరామదాసులోనూ భద్రుని పాత్రలో మెప్పించారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకలోకాన్ని అలరించిన గంభీర స్వరం మూగబోయింది. తిరిగిరాని లోకాలకు తరలివెళ్లింది. శరత్‌బాబు మనతో లేకపోవచ్చు. కానీ నాలుగున్నరదశాబ్దాలకుపైగా ఆయన నటించిన పాత్రలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి.