Prasad Behara: “పనిమనిషిని ఇంటిమనిషిలా చూసుకుంటే బాగా గడ్డి పెట్టింది..”
నటుడు, యూట్యూబర్ ప్రసాద్ బెహరా తన ఇంట్లోని పనిమనిషితో ఎదురైన సంఘటన గురించి వివరించారు. విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు పనిమనిషిని కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నానని, అధిక జీతంతో పాటు అన్నీ సమకూర్చినా, ఆమె తన వాచీలను దొంగిలించిందని తెలిపారు. ఈ అనుభవం తనలో మనుషులను నమ్మే గుణాన్ని మార్చివేసిందని ప్రసాద్ బెహరా చెప్పుకొచ్చారు.

నటుడు, యూట్యూబర్ ప్రసాద్ బెహరా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, పనిమనిషితో ఎదురైన సంఘటనల గురించి వివరించారు. విడాకుల తర్వాత తీవ్ర ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, ఇంటి పనుల కోసం ఒక పనిమనిషిని నియమించుకున్నట్లు తెలిపారు. ఆ పనిమనిషి కేవలం 3,000 రూపాయలు వేతనంగా అడిగినా.. తాను అంతకంటే ఎక్కువ నెలకు 6,000 రూపాయలు ఇవ్వడానికి అంగీకరించానన్నారు. ప్రసాద్ బెహరా తన పనిమనిషిని కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారని వెల్లడించారు. ప్రతి వారం ఆమెకు ఒక కేజీ మటన్ కొనిచ్చేవాడినని, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు నాలుగు రెక్లైనర్ సీట్ల టిక్కెట్లను కూడా తానే కొనేవారని తెలిపారు. అంతేకాకుండా, నెలాఖరున ఆమెకు అవసరమైన బియ్యం, ఇతర సరుకులను కూడా తానే కొని ఇచ్చేవారట.
ఇంటి పనులతో పాటు.. తన ఒంటరితనాన్ని తగ్గించడానికి ఆవిడ తనతో ఇరుగుపొరుగు కబుర్లు చెప్పేదట. దీనివల్ల ఆమెతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని ప్రసాద్ వివరించారు. అయితే, ఈ నమ్మకానికి భిన్నంగా ఒక సంఘటన జరిగింది. తన ఇంట్లో ఉన్న దాదాపు నాలుగు వాచీలు మిస్ అయినట్లు ప్రసాద్ బెహరా గమనించారు. చివరికి, తన ఆపిల్ వాచ్‌ను పనిమనిషి కొంగులో కట్టుకుని తీసుకువెళ్తుండగా.. బజర్ మోగడంతో ఆమె పట్టుబడింది. ఈ విషయంపై ప్రశ్నించగా, పనిమనిషి ఆ వాచీలను 400 రూపాయలకు అమ్మేశానని చెప్పిందని, ఇది మరింత ఆశ్చర్యం కలిగించిందని ప్రసాద్ తెలిపారు. దాదాపు లక్షన్నర విలువైన వాచీలను కేవలం 400 రూపాయలకు అమ్మినట్లు చెప్పడంతో ఎంతో బాధ కలిగిందని ప్రసాద్ తెలిపారు. ఈ సంఘటన తనను మానసికంగా చాలా ప్రభావితం చేసిందన్నారు.
Also Read: తన రెండు కీడ్నీలు పాడవడానికి రీజన్ ఏంటో చెప్పిన పంచ్ ప్రసాద్..
తన మంచితనాన్ని.. దుర్వినియోగం చేయడం వల్ల మనుషులను గుడ్డిగా నమ్మడం మానేశానని, తన జీవితంలో ఎదురైన ఇతర అనుభవాలు కూడా దీనికి తోడయ్యాయని వెల్లడించారు. గతంలో స్నేహితులు, తన మాజీ భాగస్వామితో ఎదురైన చేదు అనుభవాలను ఉదాహరణలుగా తెలిపారు. ప్రస్తుతం తాను ఎవరినీ సులభంగా నమ్మనని, డబ్బు విషయంలో కూడా పొదుపు చేయకుండా, తనకు నచ్చినవి కొనుక్కుంటూ జీవిస్తున్నానని చెప్పారు. ఇతరులకు సహాయం చేసే విషయంలో కూడా తాను మునపటిలాగా లేనని స్పష్టం చేశారు. తన సోదరి వివాహం అయ్యిందని, బావ లెక్చరర్‌గా పనిచేస్తున్నారని, తనకు చిన్నపాటి అప్పులు ఉన్నా, అవి పెద్ద కష్టమైనవి కాదని ప్రసాద్ బెహరా ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జెప్టో వంటి యాప్‌ల ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తూ, తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా గడుపుతున్నానని తెలిపారు. ఈ సంఘటనలన్నీ తనను మరింత దృఢంగా మార్చాయని, మనుషుల పట్ల ఒక రకమైన కఠిన వైఖరిని అలవర్చుకునేలా చేశాయని ప్రసాద్ బెహరా స్పష్టం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




