AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punch Prasad: తన రెండు కీడ్నీలు పాడవడానికి రీజన్ ఏంటో చెప్పిన పంచ్ ప్రసాద్..

జబర్దస్త్ కమెడియన్ పంచు ప్రసాద్ తన కిడ్నీ సంబంధిత సమస్యలు, డయాలసిస్ ప్రక్రియ, ఆత్మహత్య ఆలోచనలు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్.. వంటి వ్యక్తిగత పోరాటాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ కష్టకాలంలో తన భార్య, జబర్దస్త్ జడ్జిలు నాగబాబు, రోజా.. సహచర కమెడియన్స్ గెటప్ శ్రీను, రాంప్రసాద్‌తో పాటు మల్లెమాల సంస్థ అందించిన అండదండల గురించి వివరించారు.

Punch Prasad: తన రెండు కీడ్నీలు పాడవడానికి రీజన్ ఏంటో చెప్పిన పంచ్ ప్రసాద్..
Punch Prasad
Ram Naramaneni
|

Updated on: Dec 09, 2025 | 2:39 PM

Share

భార్య కిడ్నీ దానం చేయడంతో.. కొత్త జీవితాన్ని పొందిన కమెడియన్ పంచ్ ప్రసాద్.. కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నారు. కాగా ఆయన  తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరీక్షల గురించి, ముఖ్యంగా కిడ్నీ వైఫల్యం, దాని వల్ల ఎదురైన భావోద్వేగ పోరాటం గురించి ఓ ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా పంచుకున్నారు. తన జీవితంలో దేవుడు అనేక కష్టాలను ఇచ్చాడని, ప్రొఫెషనల్‌గా విజయం సాధించినప్పటికీ ఆరోగ్యం సహకరించక వెనకబడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తన కిడ్నీ వైఫల్యానికి కారణం బీపీ అని, ఈ విషయం తనకు ముందుగా తెలియదని ప్రసాద్ వివరించారు. ఎంగేజ్‌మెంట్ తర్వాత తన భార్య ముక్కు నుంచి రక్తం కారడాన్ని గమనించి, వైద్య పరీక్షలు చేయించమని చెప్పడంతోనే కిడ్నీ సమస్య బయటపడిందని తెలిపారు. ఆ సమయంలో క్రియేటినిన్ స్థాయిలు అధికంగా ఉన్నాయని, అప్పటినుంచి డయాలసిస్ చేయించుకుంటున్నానని చెప్పారు. డయాలసిస్ తనకు ఒక నిత్యకృత్యంగా మారిందని, కొన్నిసార్లు స్టేజ్ మీద ప్రదర్శన ఇవ్వడానికి ముందు కూడా డయాలసిస్ చేయించుకున్నానని ఆయన తెలిపారు. ఒకానొక దశలో, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, శారీరక నొప్పితో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా తన మదిలోకి వచ్చాయని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో నటుడు, జబర్దస్త్ జడ్జ్ నాగబాబు ఫోన్ చేసి మద్దతు ఇవ్వడంతో పాటు, జబర్దస్త్ టీమ్‌ లీడర్స్, ఆర్టిస్టులు అందరూ కలిసి ఆపరేషన్ ఖర్చులకు డబ్బును సమకూర్చారని కృతజ్ఞతలు తెలిపారు. శ్రీను, రాంప్రసాద్ వంటి సహోద్యోగులు తనను ఆసుపత్రిలో చేర్చడంలో, ఆర్థిక సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.

ప్రసాద్ భార్య తన కిడ్నీని దానం చేయడంతో 2023లో ఆయనకు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. అప్పటి మంత్రి రోజా చొరవతో.. ఆనాడు అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పంచ్ ప్రసాద్ ఆస్పత్రికి ఖర్చులను భరించింది.  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా పంచ్‌ ప్రసాద్‌కు వైద్య సహాయం  చేశారు.

కాగా తన భార్య అద్భుతమైన వ్యక్తి అని, తాను ఆమె స్థానంలో ఉంటే అంత రిస్క్ చేసేవాడిని కాదని ప్రసాద్ అన్నారు. ఆమె ఎప్పుడూ తన బాధను వ్యక్తం చేయదని, తన అనారోగ్యాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుందని ఆయన తెలిపారు. జబర్దస్త్ కుటుంబం తన సొంత కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ మద్దతు ఇచ్చిందని, మానసికంగా, ఆర్థికంగా ఎంతో ఆదుకుందని పంచు ప్రసాద్ స్పష్టం చేశారు.

సో.. బీపీ అనేది సైలెంట్ కిల్లర్. దాన్ని అస్సలు అశ్రద్ద చేయొద్దు. అది తెలియకుండానే కిడ్నీలు, గుండె వంటి ఆర్గాన్స్‌ని దెబ్బ తీస్తుంది. సో.. ఎప్పటికప్పుడు బీపీ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. డాక్టర్ల సూచనలు మేరకు లైఫ్ స్టైల్ మార్పులతో పాటు మందులు వాడాలి. యోగా, ప్రాణాయామం వంటివి బీపీ ఉన్నవారికి మెరుగైన ఫలితాలు ఇస్తాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి