Tollywood: టాలీవుడ్ డబుల్ డోస్.. స్పీడ్ పెంచుతున్న స్టార్ హీరోలు.. ఒకేసారి రెండు సినిమాలు !!
సింపుల్‌గా ఒకేసారి రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఈ వారం ఓ సినిమా.. నెక్ట్స్ వీక్ మరో సినిమా లొకేషన్‌లో తేలుతున్నారు. మరి అలా డబుల్ గేమ్ ఆడుతున్న హీరోలెవరు..?ఒకేసారి రెండు సినిమాలు చేయడం అంటే ఎప్పుడూ ఈజీ కాదు..
![Tollywood: టాలీవుడ్ డబుల్ డోస్.. స్పీడ్ పెంచుతున్న స్టార్ హీరోలు.. ఒకేసారి రెండు సినిమాలు !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/07/tollywood-4.jpg?w=1280)
ఒకసారి ఒకే సినిమా చేయడంలో ప్రత్యేకత ఏముంది..? ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తే కదా అసలు మజా వచ్చేది..? ఇప్పుడు మన హీరోల్లో చాలా మంది ఇదే ఫాలో అవుతున్నారు. కాస్త కష్టం అవుతుంది కానీ పర్లేదంటున్నారు. సింపుల్‌గా ఒకేసారి రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఈ వారం ఓ సినిమా.. నెక్ట్స్ వీక్ మరో సినిమా లొకేషన్‌లో తేలుతున్నారు. మరి అలా డబుల్ గేమ్ ఆడుతున్న హీరోలెవరు..? ఒకేసారి రెండు సినిమాలు చేయడం అంటే ఎప్పుడూ ఈజీ కాదు.. కానీ దీన్ని చెప్పులేసుకున్నంత ఈజీగా చేసి పారేస్తున్నారు మన హీరోలు. ఒక్కరు ఇద్దరు కాదు.. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇదే దారిలో వెళ్తున్నారిప్పుడు. ప్రభాస్‌నే తీసుకోండి.. ఏడాదిగా ఈయన ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నారు. ఎప్పుడే సినిమాకు డేట్స్ ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఈ కన్ఫ్యూజన్‌లోనే రాధే శ్యామ్, ఆదిపురుష్ విడుదలయ్యాయి కూడా.
మొన్నటి వరకు సలార్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ప్రభాస్. పార్ట్ 1 పూర్తవ్వగానే.. ప్రస్తుతం ప్రాజెక్ట్ Kతో బిజీ అయ్యారు. దాంతో పాటు మారుతి సినిమాకు కూడా డేట్స్ ఇచ్చారు ప్రభాస్. కొన్ని రోజులుగా ఈ చిత్ర షెడ్యూల్ జరగట్లేదు.. ఇప్పుడు దాన్ని సెట్స్‌మీదకు తీసుకొస్తున్నారు. విజయ్ దేవరకొండ సైతం ప్రభాస్ దారినే ఫాలో అవుతున్నారు. ఖుషీ షూటింగ్ పూర్తవ్వగానే.. పరశురామ్ సినిమా సెట్స్‌పైకి తీసుకొచ్చారు.
లాస్ట్ వీక్ వరకు ఖుషీ, గౌతమ్ తిన్ననూరి సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు పరశురామ్ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చారు. ఈ చిత్ర షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లోనే మొదలైంది. కూకట్‌పల్లిలో మొదటి షెడ్యూల్ మొదలైంది. దాంతో పాటు గౌతమ్ సినిమా ఎలాగూ సెట్స్‌పై ఉంది. రవితేజ ఈగల్ సినిమాతో పాటు టైగర్ నాగేశ్వరరావును పూర్తి చేస్తున్నారు. ఈ రెండూ మూన్నెళ్ల గ్యాప్‌లో రిలీజ్ కానున్నాయి.
కస్టడీ ఫ్లాప్ తర్వాత నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు నాగ చైతన్య. తనకు గతంలో ప్రేమమ్, మజిలీ లాంటి హిట్స్ ఇచ్చిన చందూ మొండేటి, శివ నిర్వానలతో ప్రాజెక్ట్స్ కమిటయ్యారు. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకేసారి సెట్స్‌పైకి రానున్నాయి. ఇక నితిన్ ఓ వైపు వక్కంతం వంశీ సినిమా చేస్తూనే.. మరోవైపు వెంకీ కుడుముల సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చారు. మొత్తానికి ఈ డబుల్ గేమ్ ఇప్పుడు మన హీరోలకు ఫ్యాషన్ అయిపోయింది.