Tollywood: ఈ టాలీవుడ్ యాంకరమ్మ మనసూ అందమైనదే.. అమర జవాన్ మురళీ నాయక్ ఫ్యామిలీకి ఆర్థిక సాయం
మొదట్లో యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు బుల్లితెరపై బిజి బిజీగా ఉంటోంది. పలు టీవీ ప్రోగ్రామ్స్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూనే సినిమా ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తన గొప్ప మనసుతో మరోసారి వార్తల్లో నిలిచింది.

ఇటీవల జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అటు వైపు పాకిస్తాన్ కూడా ప్రతి దాడులు చేసింది. ఈక్రమంలో శత్రుసైనికులతో పోరాడుతూ పలువురు భారత సైనికులు కూడా అమరులయ్యారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా కళ్లెతండాకు చెందిన మురళీ నాయక్ కూడా ఉన్నాడు. సైనికుడిగా దేశానికి సేవ చేయాలని 2022లోఅగ్నివీర్ గా సైన్యంలో ఆర్మీలో చేరాడు మురళీ నాయక్. ఆపరేషన్ సింధూర్ ముందు వరకు వేరే చోట పనిచేస్తోన్న అతను భారత్- పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలతో కశ్మీర్ కు వచ్చాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పహరా కాస్తూ శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు మురళి. ఈ విషాదం నుంచి అతని కుటుంబం ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. చేతికి అందోచ్చిన ఒక్కగానొక్క కొడుకు దూరం అవ్వడంతో వాళ్ల బాధ వర్ణనాతీతం. ఈ క్రమంలో మురళీ నాయక్ కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ యాంకర్ స్రవంతి కూడా అమర జవాన్ కుటుంబానికి ఆర్ధిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది.
తాజాగా జరిగిన ‘సోలో బాయ్’ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి స్రవంతి యాంకర్ గా వ్యవహరించింది. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఇదే సందర్భంగా యాంకర్ స్రవంతి జవాన్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన బిడ్డను తిరిగి తీసుకురాలేమని, తమవంతుగా ఆర్థిక సాయం మాత్రం చేయగలమని ఆమె ఎమోషనల్ అయ్యింది. దేశాన్ని కాపాడే బిడ్డను కన్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్పింది.
సినిమా ఈవెంట్లతో బిజి బిజీగా యాంకర్ స్రవంతి..
View this post on Instagram
సోలో బాయ్ ట్రైలర్ రిలీజ్ వేడుక పూర్తికాగానే డబ్బులు ట్రాన్సఫర్ చేస్తానని ఆమె తెలిపింది. ఇంతలో సోలో బాయ్ సంగీత దర్శకుడు కూడా మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని మాట ఇచ్చారు. త్వరలో మురళీనాయక్ గ్రామం ‘కళ్లితండా’లో సంగీత కచేరి ఏర్పాటు చేసి వచ్చిన డబ్బు ఆ కుటుంబానికి అందిస్తామని ప్రకటించారు. అదే కార్యక్రమానికి రెమ్యునరేషన్ లేకుండా యాంకరింగ్ చేస్తానని స్రవంతి తెలిపింది. మొత్తానికి స్రవంతి గొప్ప మనసును అందరూ మెచ్చుకుంటున్నారు.
ఐకాన్ స్టార్ తో కలిసి..
View this post on Instagram
కాగా స్రవంతి ఇలా సాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆమె సంపాదించిన డబ్బులో కొంత పలు సందర్భాల్లో సాయం చేసింది. గతేడాదిలో భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైనప్పుడు స్రవంతి కూడా తనవంతుగా లక్ష రూపాయలు ముఖ్యమంత్రి నిధికి పంపింది. మొత్తానికి స్రవంతిలో అందమే కాదు.. మంచి గుణం కూడా ఉందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








