AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కౌన్ బనేగా’ గెలిచాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. నా భార్యతో విడాకుల వరకు వెళ్లా

భారతీయ బుల్లితెర వీక్షకులకు కౌన్ బనేగా క్రోర్‌పతి ప్రోగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

'కౌన్ బనేగా' గెలిచాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. నా భార్యతో విడాకుల వరకు వెళ్లా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 14, 2020 | 1:02 PM

Share

Kaun Banega Sushil Kumar: భారతీయ బుల్లితెర వీక్షకులకు కౌన్ బనేగా క్రోర్‌పతి ప్రోగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలో పాల్గొన్న కొంతమంది లక్షాధికారులు అవ్వగా.. మరికొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు. వారిలో బీహార్‌కి చెందిన సుశీల్ కుమార్ ఒకరు. ఐదో సీజన్‌లో పాల్గొన్న సుశీల్‌.. 5కోట్లను గెలుచుకున్నారు. అయితే అంత డబ్బులు సాధించినా.. అతడి జీవితం సాఫీగా సాగలేదట. నిజానికి చెప్పాలంటే అదొక చెత్త సమయమని, చాలా సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందని అతడు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో సుశీల్‌ ఓ పోస్ట్ చేశారు.

”2015 నుంచి 2016 వరకు నా జీవితంలో చాలా క్లిష్టమైన సమయం. కౌన్ బనేగాలో నేను గెలిచిన తరువాత బీహార్‌లోని పలు ప్రోగ్రామ్‌లకు నన్ను ఆహ్వానించారు. ఇలా నెలలో 15 రోజులు నేను వాటికి హాజరయ్యేందుకు సరిపోయింది. ఆ సమయంలో నా చదువు కూడా గాడి తప్పింది. నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు. ఆ సమయంలో వారికి చెప్పాలని పలు బిజినెస్‌ల్లో పెట్టుబడులు పెట్టా. అందులో నష్టాలే ఎక్కువగా వచ్చాయి. ఆ తరువాత నలుగురికి సాయం చేయాలన్న ఆలోచనతో ప్రతి నెల రూ.50వేలు దానం చేసేవాడిని. ఎవరి మీద నమ్మకం కలగలేదు. నా వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నా. నా భార్యతో విడాకుల వరకు వెళ్లా.

అదే సమయంలో కొన్ని మంచి సంఘటనలు కూడా జరిగాయి. ఢిల్లీలో కొన్ని స్టూడెంట్‌ గ్రూప్‌లను కలిశా. కొత్త విషయాలు తెలుసుకున్నా. ఆ సమయంలో సిగరెట్‌, ఆల్కాహాల్‌కి బాగా అలవాటు పడ్డా. సినిమాలంటే పిచ్చితో చాలా సమయం వాటిని చూసేందుకు కేటాయించేవాడిని. అంతేకాదు అప్పుడు సినిమాలపై ఆసక్తి పెరగడంతో ముంబయికి వెళ్లా. కొన్ని అడ్వర్టైజ్‌మెంట్‌లు చేశా. ఓ సినిమాకు స్క్రిప్ట్‌ని రాశా. దానికి 20వేలు వచ్చింది. అయితే ఇదంతా సాగుతున్నప్పుడే జీవితం అంటే ఏంటో తెలిసింది. మన మనసుకు నచ్చినట్లు ఉండటం నిజమైన సంతోషమనిపించింది. ప్రాచుర్యం పొందడం కంటే ఒక మంచి మనిషిగా జీవించడం వంద రెట్లు మంచిదని అనిపించింది. అందుకే వెనక్కి వచ్చి నాకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నా” అని తెలిపారు. కాగా ప్రస్తుతం తన సొంత ఊరిలో సుశీల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. 2016లో మద్యం తాగడాన్ని మానుకున్నానని, గతేడాది నుంచి ధూమపానం కూడా మానేశానని ఈ విజేత చెప్పుకొచ్చారు.

Read More:

సుశాంత్ కేసు.. మరో ఆరుగురిని అరెస్ట్‌ చేసిన ఎన్సీబీ

‘యాత్ర’ దర్శకుడితో నాగార్జున మూవీ..!