14ఏళ్లకే హీరోయిన్ అయ్యాను.. వాళ్ళకి బోల్డ్‌గా కనిపించాలి.. రాశి చెప్పిన షాకింగ్ విషయాలు
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రాశి. మమతల కోవెల, రావు గారి ఇల్లు, పల్నాటి పౌరుషం, బాలగోపాలుడు, ఆదిత్య 369 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో బాల నటిగా యాక్ట్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ సినిమాల్లోనూ ఛైల్డ్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా రాణించిన వారిలో రాశి ఒకరు. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి పేక్షకులను విశేషంగా మెప్పించారు రాశి. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన రాశి.. ఇప్పుడు అమ్మ, అత్తా, వదిన పాత్రల్లో నటిస్తూ అలరించారు. అలాగే పలు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తమిళ, తెలుగు చిత్రసీమలలోని తన విభిన్న అనుభవాలను, అలాగే తన పేరు మార్పు వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. 11 నుంచి 14 ఏళ్ల మధ్య అమ్మాయిలకు ఏ పాత్రలు చేయాలనే గందరగోళం ఉంటుందని, సిస్టర్ పాత్రలు, సెకండ్ హీరోయిన్ లేదా ఫ్రెండ్ పాత్రల్లోకి ఎంటర్ అయితే అవే కొనసాగుతాయని రాశి అన్నారు. అందుకే, ఆ సమయంలో తన తల్లి ఆమెను నేరుగా హీరోయిన్ ఆఫర్ వచ్చేవరకు వేచి చూడమని సలహా ఇచ్చారని పేర్కొన్నారు.
తన స్క్రీన్ ప్రెజెన్స్ పట్ల అదృష్టంగా భావించిన రాశి, 14 ఏళ్ల వయస్సులోనే తమిళంలో ప్రియం సినిమాలో అరుణ్ విజయ్ సరసన తొలి అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా అనూహ్యంగా మ్యూజికల్ హిట్‌గా నిలిచి, రాశికి తమిళంలో గ్లామరస్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చింది. ఆ సమయంలో బొంబాయి ప్రియుడు రంభ తరహాలో ఆమెకు విజయవంతమైన గ్లామర్ ఇమేజ్ లభించిందని గుర్తుచేసుకున్నారు. అనంతరం విజయ్, అజిత్, ప్రభు, విజయకాంత్, సత్యరాజ్ వంటి అగ్రనటులతో కలిసి వరుసగా తమిళ సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలోనే భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో శుభాకాంక్షలు సినిమా ఆఫర్ వచ్చింది. భీమినేని శ్రీనివాసరావుకు తమిళ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత, శుభాకాంక్షలులో నందిని పాత్రకు ఎంపిక చేశారు.
తమిళ చిత్రసీమలో తన ఇమేజ్ బోల్డ్‌గా ఉండేదని, అది తన తొలి సినిమా పాత్రల ద్వారా ఏర్పడిందని రాశి తెలిపారు. కానీ తెలుగు చిత్రసీమలోకి వచ్చిన తర్వాత శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, గోకులంలో సీత వంటి చిత్రాలతో సంప్రదాయ దుస్తులలో నటించే అవకాశాలు వచ్చాయని తెలిపారు. చీరలు, సల్వార్ కమీజ్‌లు, హాఫ్ సారీలు ధరించడానికి ఇష్టపడే రాశి, తెలుగులో లభించిన పాత్రలలో ఎంతో సౌకర్యంగా ఉంటుందని భావించారట. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఒక చెల్లిగా, ఇంట్లో అమ్మాయిగా, అక్కగా, స్నేహితురాలిగా సొంతం చేసుకున్నారని. బయట కలిసినప్పుడు పెద్దలు తన బుగ్గలు పట్టి తల్లి బాగున్నావా.. అని ఆప్యాయంగా పలకరించడం తనకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుందని రాశి పంచుకున్నారు. ఇది తన వ్యక్తిత్వానికి, తాను ధరించే దుస్తులకు దగ్గరైన ఇమేజ్ కావడంతో తెలుగులోనే ఎక్కువ దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు రాశి చెప్పుకొచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
