AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mass Jathara Movie Review: పక్కా కమర్షియల్‌ సినిమా ‘మాస్‌ జాతర’.. రవితేజ ఖాతాలో హిట్ పడిందా.?

కొన్ని సినిమాల మీద ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో యూనిట్‌ చేసిన కామెంట్స్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలా 'మాస్‌ జాతర' ఈవెంట్లో రాజేంద్రప్రసాద్‌ ఓ మాటన్నారు. 'మాస్‌ జాతర' ఆడకపోతే ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతానని. ఈ సినిమా ప్రమోషన్లలోనే తన చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటానని చెప్పారు మాస్‌ మహరాజ్‌. మరి 'మాస్‌ జాతర' జనాలకు కనెక్ట్ అయిందా? చదివేద్దాం వచ్చేయండి.

Mass Jathara Movie Review: పక్కా కమర్షియల్‌ సినిమా 'మాస్‌ జాతర'.. రవితేజ ఖాతాలో హిట్ పడిందా.?
Mass Jathara Movie
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 01, 2025 | 8:14 AM

Share

సినిమా: మాస్‌ జాతర

సమర్పణ: శ్రీకర స్టూడియోస్‌

నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌

విడుదల: అక్టోబర్‌ 31 ప్రీమియర్స్ తో..

నటీనటులు: రవితేజ, శ్రీలీల, రాజేంద్రప్రసాద్‌, నరేష్‌, నవీన్‌ చంద్ర, హైపర్‌ ఆది, అజయ్‌ ఘోష్‌, ప్రవీణ్‌, వీటీవీ గణేష్‌, నవ్య స్వామి, తారక్‌ పొన్నప్ప తదితరులు

సంగీతం: భీమ్స్

కెమెరా: విదు అయ్యన్న

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

మాటలు: నందు సవిరిగాన

రచన – దర్శకత్వం: భాను భోగవరపు

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

కథ:

లక్షణ్‌ భేరి (రవితేజ) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. తన తండ్రిలాగా పోలీస్‌ కావాలని కలలు కంటాడు. కానీ అతని తాత హనుమాన్‌ భేరి (రాజేంద్రప్రసాద్‌) అందుకు ఒప్పుకోడు. తన కొడుకులాగా మనవడిని కూడా అదే యూనిఫార్మ్ లో పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనని అతని భయం. అయినా లక్ష్మణ్‌ పట్టుబడతాడు. చేసేదేమీ లేక చివరికి రైల్వే పోలీస్‌ కావడానికి అనుమతిస్తాడు హనుమాన్‌. అక్కడ రిస్క్ తక్కువన్నది అతని ఫీలింగ్‌. అయితే లక్ష్మణ్‌ మామ పోలీస్‌ ఆఫీసర్‌ (సముద్రఖని) మాత్రం మేనల్లుడిలో ఫైర్‌కి తగ్గ పని చెబుతానని మాటిస్తాడు. ఆ మాట ప్రకారమే కేసులను తన మేనల్లుడు ఉన్న రైల్వే స్టేషన్‌ పరిధిలోకి డైవర్ట్ చేస్తుంటాడు. అలా… ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి ట్రాన్స్ ఫర్‌ అవుతుంటాడు లక్ష్మణ్‌. అడవివరంలో శీలావతి గంజాయి సమస్య ఉందని తెలుసుకుని అక్కడికి తన మేనల్లుడిని పంపిస్తాడు పోలీస్‌ ఆఫీసర్‌. స్టేషన్‌లో దిగగానే అన్యాయాన్ని ప్రశ్నించడం మొదలుపెడతాడు లక్ష్మణ్‌. అయితే అక్కడి లోకల్‌ అధికారులు అతనికి సహకరించరు.

మరోవైపు అడవి వరంలో తులసి (శ్రీలీల) అనే టీచర్‌తో పరిచయం అవుతుంది లక్ష్మణ్‌కి. అప్పటిదాకా పెళ్లి కాని లక్ష్మణ్‌ ఆమెని ప్రేమిస్తాడు. ఆ ఊళ్లోనే శివుడు (నవీన్‌ చంద్ర) అని ఓ గంజాయి వ్యాపారి ఉంటాడు. చుట్టు పక్కల ఊళ్లల్లో రైతులతో గంజాయి పండించి కలకత్తాలో ఉన్న పాత్రోకి విక్రయిస్తుంటాడు. తను మనసుపడ్డ గంగ (నవ్య)ను బలవంతంగా తీసుకొచ్చి ఇంట్లో గొలుసులతో కట్టేస్తాడు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. ఈ విషయాలన్నీ లక్ష్మణ్‌ దృష్టికి వస్తాయి. ఒక్కో విషయాన్ని చేధించుకుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో అతనికి తులసి గురించి ఓ నిజం తెలుస్తుంది. అది ఏంటి? అసలు తులసి ఎవరు? శివుడితో తులసికి ఉన్న సంబంధం ఏంటి? శివుడి ఇంట్లో ఉన్న గంగను అడవి మనుషులు అంత ప్రేమగా ఎందుకు చూసుకున్నట్టు? అసలు పాత్రో ఎవరు? హనుమాన్‌ భేరి ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటి? ఇవన్నీ సినిమాలో ఎప్పటికప్పుడు ఇంట్రస్ట్ క్రియేట్‌ చేసే అంశాలు.

ఎవరెలా చేశారు?

పోలీస్‌ ఆఫీసర్‌ కేరక్టర్‌ రవితేజకు కొట్టిన పిండి. కోరమీసాన్ని ఎగదువ్వుతూ రవితేజ డైలాగులు చెబుతుంటే వింటేజ్‌ పోలీస్‌ గెటప్పులను మరోసారి గుర్తుచేసుకుంటారు ఫ్యాన్స్. రైల్వే ట్రాక్‌ మీద, రైల్వే స్టేషన్‌లో రవితేజ కనిపించే సన్నివేశాలన్నీ మరో రేంజ్‌ స్వాగ్‌ అన్నమాట. శ్రీలీల చీరకట్టులోనూ, లంగా ఓణీలోనూ కనిపించినా స్క్రీన్‌ మీద కలర్‌ఫుల్‌గా అనిపించారు. తండ్రి కేరక్టర్‌లో నరేష్‌, తాత కేరక్టర్‌లో రాజేంద్రప్రసాద్‌, కరడుగట్టిన శివుడుగా నవీన్‌ చంద్ర, రైల్వే పోలీస్‌ సుబ్రమణ్యంగా ప్రవీణ్‌, పాత్రో అసిస్టెంట్‌గా వీటీవీ గణేష్‌, శివుడు వైపు నిలుచున్న వ్యక్తులుగా హైపర్‌ ఆది, అజయ్‌ ఘోష్‌.. ప్రతి ఒక్కరూ తమ పరిధి మేర చక్కగా నటించారు.

ఎలా ఉంది?

నందు రాసిన డైలాగులు అక్కడక్కడా ప్రేక్షకులను బాగానే నవ్వించాయి. అడవివరం స్టేషన్‌, లొకేషన్లు, నైట్‌ షూట్‌, జాతర ఎపిసోడ్స్ ని బాగా డీల్‌ చేశారు డైరక్టర్‌. ఎటొచ్చీ కథే ఆల్రెడీ తెలిసినట్టు, చూసినట్టు అనిపిస్తుంది. అవినీతికి పాల్పడి కొడుకును పోగొట్టుకున్న పోలీస్‌, న్యాయాన్ని నమ్ముకున్నప్పుడు తానే లేకుండా పోతాడు… ఇలాంటి కొన్ని పాయింట్స్ ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు డైరక్టర్‌. రచన పరంగా టోటల్‌ యాంబియన్స్ ని కొత్తగా క్రియేట్‌ చేసినప్పటికీ, రవితేజ మార్క్ హిట్‌ సినిమాల తాలూకు స్పెషల్‌ అంశాలు చాలా చోట్ల గుర్తుకొస్తాయి. అందులోనూ శీలావతి, గంజాయి, అడవివరం అనేసరికి రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఘాటిని గుర్తుచేసుకున్నారు ప్రేక్షకులు. పలు సన్నివేశాల్లో బలం లేకపోయినా హుషారైన నేపథ్య సంగీతంతో వాటిని రక్తికట్టించే ప్రయత్నం చేశారు భీమ్స్. యాక్షన్‌ ఎపిసోడ్స్ గగుర్పొడిచేలా ఉన్నాయి. ఫస్టాఫ్ లో ఉన్న ఫ్లో, సెకండ్‌ హాఫ్లోనూ ఉండుంటే బావుండేది. సన్నివేశాలన్నీ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపించేసరికి కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయింది. పాత్రో కేరక్టర్‌ని చివరి దాకా రివీల్‌ చేయకుండా సస్పెన్స్ మెయింటెయిన్‌ చేసిన తీరు ఆకట్టుకుంది. మొత్తానికి మాస్‌ మహరాజ్‌ ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఈ సినిమా. మాస్‌ మహరాజ్‌ ఒన్‌ మ్యాన్‌ షోలా కట్‌ చేశారు సినిమాను.

చివరిగా… మాస్‌ ప్రేక్షకులకు… పక్కా కమర్షియల్‌ మూవీ ‘మాస్‌ జాతర’