Mowgli 2025 Movie Review: మోగ్లీ సినిమా రివ్యూ.. యాంకర్ సుమ కొడుకు హిట్టు కొట్టాడా.. ?
కలర్ ఫోటో వంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రాజ్, బబుల్ గమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఎనర్జిటిక్ హీరో రోషన్ కనకాల కలిసి చేసిన సినిమా మోగ్లీ. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. టైటిల్ దగ్గరి నుంచే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మోగ్లీ ప్రేక్షకులను మెప్పించాడా? రివ్యూలో చూద్దాం.

మూవీ రివ్యూ: మోగ్లీ
నటీనటులు: రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్, వైవా హర్ష, బండి సరోజ్ కుమార్ తదితరులు
సంగీతం: కాల భైరవ
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ: రమా మారుతి
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
దర్శకత్వం: సందీప్ రాజ్
కలర్ ఫోటో వంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రాజ్, బబుల్ గమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఎనర్జిటిక్ హీరో రోషన్ కనకాల కలిసి చేసిన సినిమా మోగ్లీ. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. టైటిల్ దగ్గరి నుంచే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మోగ్లీ ప్రేక్షకులను మెప్పించాడా? రివ్యూలో చూద్దాం.
కథ:
పార్వతీపురం అనే ఓ అటవీ ప్రాంతంలో ఉండే కుర్రాడు మోగ్లీ ఉరఫ్ మురళి (రోషన్ కనకాల). అనాథగా ఉన్న మోగ్లీకి అన్నీ తానేయై చూసుకునే స్నేహితుడు బంటి (వైవా హర్ష). చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలన్నది మోగ్లీ ఆశయం. ఆలోపు బతకడానికి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. అలా ఊళ్లోకి సినిమా షూటింగ్ కోసం వచ్చిన ఓ యూనిట్‌లో డాన్సర్‌గా పని చేస్తున్న మూగ, చెవుడు అమ్మాయి అయిన జాస్మిన్ (సాక్షి మదోల్కర్)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. జాస్మిన్ కూడా మోగ్లీని ప్రేమిస్తుంది. కానీ ఆ సినిమా నిర్మాత కన్ను జాస్మిన్‌పై పడుతుంది. తనని ఎలాగైనా లొంగదీసుకోవాలని చూస్తాడు. దానికోసం ఇద్దర్నీ విడదీయడానికి కొన్ని కుట్రలు చేస్తారు. అవన్నీ మోగ్లీ నమ్మాడా? ఈ ప్రేమ కథలో క్లిస్టఫర్ నోలెన్ (బండి సరోజ్) ఎలా వచ్చాడు అనేది అసలు కథ..
స్క్రీన్ ప్లే:
ఈ రోజుల్లో ప్రేమకథ తీయడం అంటే రిస్క్‌తో కూడుకున్న పనే. ఎందుకంటే లవ్ స్టోరీతో మెప్పించడం అనేది చిన్న విషయం కాదు. ఎంతో అద్భుతమైన ఎమోషన్ ఉంటే తప్ప అది వర్కవుట్ అవ్వదు. రిస్క్ అని తెలిసినా కూడా దర్శకుడు సందీప్ రాజ్ మరోసారి తన బలం అయిన ఎమోషన్స్‌నే నమ్ముకున్నాడు. అడవి నేపథ్యంలో సాగే కథను ఎంచుకున్నాడు. కానీ ఈ మోగ్లీ కథ అంతగా ఆకట్టుకోలేదు. విజువల్స్ పరంగా సినిమా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరో క్యారెక్టరైజేషన్, అడవిలో అతని జీవనశైలిని చూపించిన విధానం చాలా బాగుంది. హీరోకి, సిటీ నుంచి వచ్చిన హీరోయిన్‌కి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కొత్తగా లేకపోయినా, ఎంటర్టైనింగ్‌గా సాగుతుంది. అసలు అసలు కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. అప్పటి వరకు మెల్లగా సాగుతుంది. చాలా నీరసంగా సాగే స్క్రీన్ ప్లే మోగ్లీకి మెయిన్ మైనస్. పెద్ద వాళ్లకు, అమ్మాయికి మధ్య జరిగే సంఘర్షణ ఇది. ఈ క్రమంలోనే వచ్చే కొన్ని సన్నివేశాలు ఇంకా ఆసక్తికరంగా రాసుకోవచ్చు కానీ ఎందుకో సందీప్ మాత్రం వీటిని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోయాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా ఈజీగా తేల్చేసాడు. సందీప్ రాజ్ డైలాగ్స్ అక్కడక్కడ గట్టిగా పేలాయి. కానీ, కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఉన్న జోష్ సెకండాఫ్ ఆరంభంలో మిస్ అయ్యింది. లాజిక్స్ కంటే ఎమోషన్స్‌కే ఎక్కువ పెద్ద పీట వేశారు. కానీ అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు. హీరోయిన్ మూగ చెవుడు అనే కాన్సెప్ట్ తప్పిస్తే.. మిగిలిందంతా పాతికేళ్ల కింద తేజ తెరకెక్కించిన జయం, ఉదయ్ కిరణ్ శ్రీరామ్ సినిమాలను గుర్తుకు తెస్తాయి. సెకండాఫ్ అంతా బండి సరోజ్ కుమార్ లీడ్ తీసుకున్నాడు. ఆయన ఉన్నంత సేపు స్వాగ్ బాగుంటుంది.
నటీనటులు:
రోషన్ కనకాల ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించాడు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో పరిణితి కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ, ఎమోషనల్ సీన్స్‌లోనూ రోషన్ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సాక్షి మదోల్కర్ తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. విలన్‌గా నటించిన బండి సరోజ్ కుమార్ సినిమాకు హైలైట్. మనోడి పాత్ర మామూలుగా లేదు. వైవా హర్ష సైతం అద్భుతంగా నటించాడు. మిగిలిన అన్ని పాత్రలు ఓకే..
టెక్నికల్ టీం:
సాంకేతికంగా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాల భైరవ సంగీతం గురించి. పాటలు సందర్భానుసారంగా బాగున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అడవి అందాలను కెమెరామెన్ తన లెన్స్‌లో బంధించిన తీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు కానీ, సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లను కట్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదని అర్థమవుతుంది. దర్శకుడు సందీప్ రాజ్ మాత్రం ఆసక్తికరమైన కథ తీసుకున్నా.. కథనం నీరసంగా సాగింది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా మోగ్లీ.. ఆకట్టుకోని అడవి ప్రేమకథ..!




