Idli Kottu Review: ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ.. ధనుష్ సినిమా ఎలా ఉందంటే..
ధనుష్ హీరోగా నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ఇడ్లీ కడాయ్. తెలుగులో ఇదే సినిమాను ఇడ్లీ కొట్టుగా డబ్బింగ్ చేసారు. ఇదివరకు దర్శకుడిగా మెప్పించిన ధనుష్.. మరోసారి మెప్పించాడా లేదా..? ఇడ్లీ కొట్టుతో ఎమోషనల్‌గా మాయ చేసాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: ఇడ్లీ కొట్టు
నటీనటులు: ధనుష్, నిత్యా మీనన్, షాలిని పాండే, సముద్రఖని, సత్యరాజ్, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కిరణ్ కౌశిక్
సంగీతం: జివి ప్రకాశ్ కుమార్
ఎడిటర్: ప్రసన్న జికే
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకుడు: ధనుష్
కథ:
మురళి (ధనుష్) ఓ చిన్న ఊరు నుంచి మొదలై బ్యాంకాక్‌లో ఓ పెద్ద కంపెనీలో పని చేస్తుంటాడు. అతడి పని తీరు నచ్చి ఆ కంపెనీ ఓనర్ విష్ణు వర్ధన్ (సత్యరాజ్) ఏకంగా తన కూతురు మీరా (షాలినా పాండే)ను ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటాడు. మురళి కూడా ఒప్పుకుంటాడు. కానీ ముందు నుంచి మురళి అంటే విష్ణు వర్ధన్ కొడుకు అశ్విన్ (అరుణ్ విజయ్)కు అస్సలు నచ్చదు. పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో నాన్న చనిపోవడంతో ఊరుకు వెళ్తాడు మురళి. అక్కడ తన తండ్రి శివ (రాజ్ కిరణ్) ప్రాణంగా చూసుకునే ఇడ్లీ కొట్టుతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. అదే సమయంలో నాన్న చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. తాను చనిపోయిన తర్వాత కూడా తన ఆత్మ ఇదే కొట్టులో ఉంటుందని చెప్తుంటాడు శివ. అదే ఊళ్లో ఉండే కళ్యాణి (నిత్యా మీనన్) మురళి తల్లి దండ్రులను సొంత వాళ్ల కంటే ఎక్కువగా చూసుకుంటుంది. తండ్రి మరణంతో ఊరికి వచ్చిన మురళి.. మళ్లీ బ్యాంకాక్ వెళ్లాడా లేదా.. పెళ్లి చేసుకున్నాడా..? అసలు ఇడ్లీ కొట్టును ఏం చేసాడు అనేది మిగిలిన కథ..
కథనం:
అన్నిసార్లు చెప్పడానికి కొత్త కథలేమీ ఉండవు.. ఉన్న కథలను కొత్తగా చెప్పుకుంటూ వెళ్లాలి అంతే. తన దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమాలో ధనుష్ కూడా అదే చేస్తున్నాడు. చాలా సింపుల్ కథలను తీసుకొని ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తొలి సినిమా పవర్ పాండి నుంచి రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా.. ఇప్పుడు ఇడ్లీ కొట్టు ప్రతీ సినిమాలోనూ ధనుష్ బాగా ఫోకస్ చేసేది ఎమోషన్‌పైనే. ఇడ్లీ కొట్టు సినిమా కూడా అలాంటి ఒక సింపుల్ స్టోరీనే. తల్లిదండ్రుల ఆశయం కోసం.. వాళ్లు పోయిన తర్వాత కూడా కష్టపడే ఒక కొడుకు కథ ఇది. వినడానికి చాలా సింపుల్ లైన్. కానీ దాన్ని వీలైనంతవరకు ఎమోషనల్ గానే చెప్పడానికి ప్రయత్నించాడు ధనుష్. ఫస్టాఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. చాలా అంటే చాలా ఎమోషనల్‌గా కథ ముందుకు వెళ్ళింది. కొన్ని సీన్స్ ఏడిపించేసాడు కూడా. కీలకమైన సెకండాఫ్ మాత్రం ట్రాక్ తప్పినట్టు అనిపించింది. అక్కడి నుంచి కథ ఎమోషనల్ కాకుండా ఇగో సాటిస్ఫైడ్ డ్రామాలా మారిపోయింది. అరుణ్ విజయ్ చేసే పనులు, దానికి సత్యరాజ్ సపోర్ట్ అవన్నీ కాస్త స్లోగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో తీశాడు ధనుష్. ఆయనలో ఇంత గొప్ప దర్శకుడు ఉన్నాడా అనిపిస్తుంది అవి చూస్తుంటే..! ఇందులో కథ కంటే ఎక్కువగా మూమెంట్స్ కనిపిస్తాయి. బిజీ లైఫ్‌లో పడి అమ్మానాన్నలకు దూరంగా ఉన్న వాళ్లకు ఈ కథ ఎమోషనల్ గా బాగానే డిస్టర్బ్ చేస్తుంది. సెకండాఫ్ చాలా వరకు నెమ్మదిగానే సాగినా.. క్లైమాక్స్ పర్లేదు అనిపిస్తుంది.
నటీనటులు:
ధనుష్‌కు నటుడిగా తిరుగులేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. ఇప్పుడు ఇడ్లీ కొట్టులోనూ ఇదే చేసాడు. తండ్రి ఆశయం కోసం పాటు పడే కొడుకుగా బాగా నటించాడు. నిత్యా మీనన్ మరోసారి మాయ చేసింది. సత్యరాజ్, శాలిని పాండే, అరుణ్ విజయ్ పాత్రలు కీలకం. పార్తిబన్ కూడా చిన్న పాత్ర అయినా బాగా నటించాడు. సముద్రఖని పాత్ర ఓకే. మరో కీలకమైన పాత్రలో రాజ్ కిరణ్ అద్భుతంగా నటించాడు. మిగిలిన వాళ్లు ఓకే..
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం ప్రాణం. ముఖ్యంగా అతడి ఆర్ఆర్.. చాలా సన్నివేశాలు కేవలం రీ రికార్డింగ్‌తోనే బాగా అనిపించాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. ఎడిటింగ్ పర్లేదు. సెకండాఫ్ అక్కడక్కడా స్లో అయింది. దర్శకుడిగా ధనుష్ మరోసారి ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌పై ఇంకాస్త ఫోకస్ చేసుంటే ఇడ్లీ కొట్టు మంచి సినిమా అయ్యుండేది. అయినా కూడా ఓ మంచి ఎమోషనల్ డ్రామాను చూసిన ఫీల్ తెప్పిస్తుంది ఇడ్లీ కొట్టు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ఇడ్లీ కొట్టు.. స్లో ఎమోషనల్ డ్రామా..




