Coolie Movie Review: కూలీ మూవీ రివ్యూ..! హీరోగా రజిని.. విలన్‌గా నాగార్జున.. సినిమా ఎలా ఉందంటే..

- Time - 170 Minutes
- Released - August 14, 2025
- Language - Telugu, Tamil, Kannada, Hindi, Malayalam
- Genre - Action/Thriller
మూవీ రివ్యూ: కూలీ
నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సౌబీన్ షాషిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్, రెబా మోనికా జాన్,
పూజా హెగ్డే తదితరులు
సినిమాటోగ్రఫి: గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్: ఫిలోమన్ రాజ్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
నిర్మాత: కళానిధి మారన్
బ్యానర్: సన్ పిక్చర్స్
కథ:
దేవా (రజనీకాంత్) 30 ఏళ్ళ కింద ఓ కూలీ. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి ఒక హాస్టల్ నడుపుతూ ఉంటాడు. ఆయన ప్రాణ స్నేహితుడు రాజశేఖర్(సత్యదేవ్) చనిపోతే చివరి చూపుకు వెళ్లిన దేవాను రాజశేఖర్ కూతురు ప్రీతి (శృతి హాసన్) అడ్డకుంటుంది. అదే సమయంలో తన స్నేహితుడు రాజశేఖర్ గుండెపోటుతో చనిపోలేదు.. ఎవరో చంపేసారని తెలుసుకుంటాడు. అసలేం జరిగిందని తెలుసుకోడానికి రంగంలోకి దిగుతాడు దేవా. ఆ సమయంలోనే దేవాకు దయాల్ (సౌబిన్ సాహిర్) గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. మరోవైపు దేవా తన గ్రూపులోకి వచ్చాడని ఆ గ్యాంగ్ లీడర్ సైమన్ (నాగార్జున)కు తెలిసిపోతుంది. వీళ్లందరికీ లీడర్ అయిన దహా (అమీర్ ఖాన్) మెక్సికోలో ఉంటాడు. అసలు వీళ్ళందరికీ కనెక్షన్ ఏంటి.. గోల్డ్ బిజినెస్ పేరుతో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది అసలు కథ..
కథనం:
కొన్ని సినిమాల నుంచి కొత్తదనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు.. జస్ట్ ఉన్నది చూసి ఎంజాయ్ చేసి రావాలంతే. కూలీ కూడా అలాంటి రొటీన్ సినిమానే.. కథ తెలుసు.. స్క్రీన్ ప్లే కూడా ఏమంత గొప్పగా లేదు. అలాగని కూలీ తీసిపారేసే సినిమా మాత్రం కాదు. సినిమాలో కొన్ని విజిలింగ్ మూమెంట్స్ ఉన్నాయి.. ఖైదీ, విక్రమ్ స్థాయి గ్రిప్పింగ్ కథ, కథనాలు కూలీలో కనిపించవు. రజిని అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకున్నాడు లోకేష్. ఫస్టాఫ్ వరకు నో కంప్లైంట్స్.. వేగంగానే వెళ్లిపోయింది.. కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం మరోసారి వదిలేసాడు లోకేష్ కనకరాజ్.. లోకేష్‌కు ఈ సెకండాఫ్ ఫీవర్ ఏంటో అర్థం కాదు. ప్రతీసారి ఫస్టాఫ్ వరకు బాగా తీసి.. అసలైన సెకండాఫ్ వదిలేస్తుంటాడీయన. కూలీకి కూడా ఇదే చేసాడు.. అసలే రొటీన్ కథకు సెకండాఫ్ మరీ రొటీన్ అయిపోయింది. మొదటి సీన్ అప్పుడే ఎండ్ సీన్ కూడా అర్థమైపోయేంత ఈజీ స్క్రీన్ ప్లే ఇది. కాకపోతే అక్కడక్కడా వచ్చే యాక్షన్ సీన్స్.. సౌబిన్ షాహిర్ క్యారెక్టర్.. నాగార్జున విలనిజం ఇవన్నీ అభిమానులకు కిక్ ఇస్తాయి. సెకండాఫ్‌లో ఉపేంద్ర వచ్చినపుడు స్క్రీన్ ఊగిపోతుంది. అలాగే క్లైమాక్స్‌లో అమీర్ ఖాన్ ఎంట్రీ అంతగా కిక్ ఇవ్వలేదు. అది పూర్తిగా రోలెక్స్‌కు కాపీగా అనిపించింది. లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే.. మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాలు అవన్నీ కామన్. ఇది కూడా అలాంటి కథనే. అందులోనే కాస్త ఎమోషన్ చూపించే ప్రయత్నం చేసాడు లోకేష్. అది అంతగా వర్కవుట్ అయితే అవ్వలేదు. మరోవైపు నాగార్జున తన వరకు బాగానే చేసినా.. ఇలాంటి విలన్ క్యారెక్టర్స్ ఆయనకు అవసరమా అనిపించక మానదు.
నటీనటులు:
రజినీ దేవాగా రప్ఫాడించాడు.. ఆయన స్టైల్ పీక్స్ అంతే.. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా. బాషాను గుర్తు చేసుకునేలా ఈ కూలీ క్యారెక్టర్ రాసుకున్నాడు లోకేష్. నాగార్జున తనవరకు 1000 శాతం ట్రై చేసాడు.. కానీ మనకే మన నాగ్ మంచోడు అనిపిస్తుంది. ఆయన్ని హీరోగా చూసి చూసి బ్యాడ్ బాయ్‌గా చూడలేకపోయాం. సౌబిన్ షాహిర్ సర్‌ప్రైజింగ్.. అందరికంటే ఈయన క్యారెక్టర్ బలంగా ఉంటుంది. శృతి హాసన్, ఉపేంద్ర ఓకే.. అమీర్ ఖాన్ అయితే పూర్తిగా రోలెక్స్‌కు కాపీ. సత్యరాజ్ ఉన్నంత వరకు బాగానే ఉంది. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
అనిరుద్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. మరోసారి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నిలబెట్టాడు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ పర్లేదు. సెకండ్ హాఫ్ చాలా వరకు స్లో అయింది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చుకు వెనకాడలేదు. దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ ప్రతిసారి ఫస్టాఫ్ వరకు బాగా తీసి సెకండ్ హాఫ్ వదిలేస్తున్నాడు. కూలీ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అయింది.. అయినా కూడా పర్లేదనిపిస్తుంది. చాలావరకు సన్నివేశాలలో లోకేష్ మార్క్ మిస్ అయింది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా కూలీ.. వెరీ రొటీన్ యాక్షన్ డ్రామా..



