Bangarraju Review: సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ సినిమా ‘బంగార్రాజు’.. మూవీ రివ్యూ
సోగ్గాడే చిన్ని నాయనా సినిమా వచ్చినప్పుడు టైటిల్ చాలా విచిత్రంగా ఉందే అనుకున్నారంతా. ఆ సినిమాలో నాగార్జున పంచెకట్టు, నాగార్జున - రమ్యకృష్ణ మధ్య సరదాగా..
Bangarraju Movie Review: సోగ్గాడే చిన్ని నాయనా సినిమా వచ్చినప్పుడు టైటిల్ చాలా విచిత్రంగా ఉందే అనుకున్నారంతా.. ఆ సినిమాలో నాగార్జున(Akkineni Nagarjuna) పంచెకట్టు, నాగార్జున – రమ్యకృష్ణ మధ్య సరదాగా జరిగే సంభాషణలు, పాటలూ అన్నీ హైలైట్ అయి సినిమాను హిట్ చేశాయి. ఆ సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది బంగార్రాజు. తెల్లటి పంచెకట్టుతో నాగార్జున, ఫ్లోరల్ డిజైన్ షర్ట్స్ తో నాగ చైతన్య(Naga Chaitanya)… అక్కినేని అభిమానులకే కాదు, అందరిలోనూ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. ఇంతకీ ఈ లేటెస్ట్ బంగార్రాజు ఎలా ఉన్నాడు? చదివేయండి.
సినిమా: బంగార్రాజు
కథ – మాటలు – దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ కురసాల
స్క్రీన్‌ప్లే: సత్యానంద్
నిర్మాత: అక్కినేని నాగార్జున
నటీనటులు: అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, ఝాన్సీ, అనితా చౌదరి, రోహిణి, ప్రవీణ్, గోవింద్ పద్మసూర్య, రంజిత్, నాగబాబు, దువ్వాసి మోహన్ తదితరులు
కెమెరా: జె.యువరాజ్
ఎడిటింగ్: విజయ్ వర్ధన్.కె
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాణ సంస్థలు: అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్
విడుదల: 14 జనవరి 2022
భూమ్మీదకు వచ్చిన పనులన్నీ పూర్తి చేసుకుని మళ్లీ స్వర్గానికి వెళ్తాడు బంగార్రాజు (నాగార్జున). అక్కడ రంభ, మేనక, ఊర్వశిలతో కబడ్డీలు ఆడుకుంటూ ఆయనకు నచ్చినట్టు ఉంటాడు. ఆ సమయంలో అనుకోకుండా భార్య సత్యభామ (రమ్యకృష్ణ) అతని దగ్గరకు వెళ్తుంది. భూమ్మీద చిన బంగార్రాజు (నాగచైతన్య) ఎలా ఉన్నాడన్నది ఆమెకు దిగులు. అక్కడి నుంచే దంపతులు చినబంగార్రాజు చేష్టలను చూస్తుంటారు. ఎలాగైనా అతనికి, నాగలక్ష్మి (కృతిశెట్టి) తో పెళ్లి చేయాలని అనుకుంటారు. ఓ శివకార్యం కోసం… సరిగ్గా అదే సమయంలో పెద బంగార్రాజును భూమ్మీదకు పంపాలని అనుకుంటారు ఇంద్రుడు, యముడు. స్వామి కార్యం, సొంతకార్యం చేసుకోవడానికి భూమ్మీదకు వచ్చిన బంగార్రాజు ఏం చేశాడు? తన మనవడి పెళ్లి ఫిక్స్ చేయగలిగాడా? చిన బంగార్రాజుకు పిల్లనిచ్చి పెళ్లి చేసే రమేష్ అసలు స్వభావం ఏంటి? అతనికి ఆదితో ఉన్న బంధం ఏంటి? వంటి విషయాలన్నీ ఆసక్తికరం.
బంగార్రాజు నాగార్జునకి బాగా కలిసొచ్చే జానర్. మన్మథుడిగా, సోగ్గాడిగా నాగార్జునను చూడటానికి ఇష్టపడతారు జనాలు. దానికి తోడు వాసి వాడి తస్సాదియ్యా అంటూ నాగార్జున చెప్పే డైలాగులు ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. ట్రైలర్‌లోనే నాగచైతన్యలోనూ ఈజ్ చూపించేశారు దర్శకుడు కల్యాణకృష్ణ. ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టే. బంగార్రాజు కొడుకు రాముకి ఓ కొడుకు పుడితే… అతను ఎలా పెరిగాడు? ఆ ఊరిలో ఉన్న శివాలయానికి వచ్చిన సమస్య ఏంటి? దాన్ని బంగార్రాజు కుటుంబీకులు ఎలా అడ్డుకున్నారు? అనే కథ కూడా ఊహించగలిగిందే. అయినా సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ కావడానికి కారణం కలర్‌ఫుల్‌గా చెప్పిన విధానం. సత్యభామ కేరక్టర్‌లో రమ్యకృష్ణ ఎమోషన్స్ బాగా పండించారు.
అమాయకపు రాము కేరక్టర్ లో నాగార్జున యాజ్ ఇట్ ఈజ్‌గా ఇమిడిపోయారు. రమ్యకృష్ణను పుటుకీ అంటూ ఆటపట్టించే బంగార్రాజు కేరక్టర్ అయితే కింగ్‌కి కొట్టిన పిండి అన్నట్టే ఉంది. గత సినిమాలతో పోలిస్తే చైతన్యలో ఈజ్ బాగా కనిపించింది. నాగార్జున ఎనర్జీని, ఆయన మేనరిజాన్ని మ్యాచ్ చేస్తూ చాలా సన్నివేశాల్లో శభాష్ అనిపించుకున్నారు చైతన్య. నాగలక్ష్మి కేరక్టర్‌లో కృతిశెట్టి చక్కగా చేశారు. పల్లెటూరి అమ్మాయి, దానికి తోడు లీడర్ అనిపించుకోవాలనుకునే అమ్మాయిగా మెప్పించారు. వెన్నెలకిశోర్, బ్రహ్మాజీ కేరక్టర్లు ఉన్నంతలో మెప్పించాయి. రావు రమేష్ కేరక్టర్‌ని ఎవరూ ఊహించరు. ఆది కేరక్టర్ చేసిన తనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సంపత్ కేరక్టర్ సినిమాలో సర్‌ప్రైజ్ ఎలిమెంట్.
సినిమా ప్రారంభంలో గుడిలో పాముతో వచ్చే ఫైట్ సీన్ ఐ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమాలో సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. ఇంకాసేపుంటే కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా అని కూడా అనిపించేలా ఉన్నాయి. స్వర్గం సెట్టింగ్ బావుంది. అక్కడ రంభ, ఊర్వశి, మేనకతో నాగార్జున లడ్డుండ పాట, పూవులతో అలంకరించిన కోర్టులో కబడ్డీ బావున్నాయి.
పెళ్లి అంటే తంతు కాదు, ఒట్టు అని చిన బంగార్రాజుతో చెప్పించిన డైలాగులు, ప్రాణం విలువ గురించి బంగార్రాజు సత్యభామతో చెప్పిన మాటలు, తండ్రి ప్రేమ కోసం చిన బంగార్రాజు ఎంతగా అల్లాడిపోతున్నాడో చెప్పిన మాటలు, క్లైమాక్స్ లో వచ్చే డైలాగులు సినిమాకు ప్లస్ అవుతాయి. భైరవా… మనవడు భైరవా అని బంగార్రాజు పోట్లగిత్తతో చెప్పే మాట కూడా చాలా సెన్సిటివ్‌గా అనిపించింది. ఫరియా అబ్దుల్లా చేసిన స్పెషల్ సాంగ్‌తో పాటు, పాటలన్నీ మెప్పించాయి. అన్ని కేరక్టర్స్ కీ కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి.
కుట్రలు చేసే వాళ్లు పక్కనే ఉన్నా, చుట్టు అంత జరుగుతున్నా…. ఎవరికీ తెలియదా..? తరహా చిన్న చిన్న లాజిక్కులను పక్కన పెడితే పండక్కి పర్ఫెక్ట్ సినిమా బంగార్రాజు
– డా. చల్లా భాగ్యలక్ష్మి
Also Read..
Shyam Singha Roy Review: స్క్రీన్ మీద కలర్‌ఫుల్‌గా శ్యామ్ సింగరాయ్.. నాని మూవీ రివ్యూ..
83 Movie Review: 83 మన చరిత్ర… తరతరాలు గర్వంగా చెప్పుకునే ఘనచరిత్ర!