Thamma Movie Review: థామా మూవీ రివ్యూ.. రష్మిక హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే
మ్యాడాక్ సంస్థ అంటేనే దెయ్యాల సినిమాలకు కేరాఫ్ అడ్రస్. స్త్రీ 2, భేడియా, ముంజ్యా లాంటి సినిమాల తర్వాత ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమా థామా. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: థామా
నటీనటులు: ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీ, వరుణ్ ధావన్ (గెస్ట్ రోల్), అభిషేక్ బెనర్జీ (గెస్ట్ రోల్), పరేష్ రావల్, సత్యరాజ్ తదితరులు
సంగీతం: సచిన్ జిగర్
ఎడిటర్: హేమంతీ సర్కార్
సినిమాటోగ్రఫర్: సౌరభ్ గోస్వామి
నిర్మాతలు: అమర్ కౌశిక్, దినేష్ విజన్
దర్శకుడు: ఆదిత్య సర్పోద్కర్
మ్యాడాక్ సంస్థ అంటేనే దెయ్యాల సినిమాలకు కేరాఫ్ అడ్రస్. స్త్రీ 2, భేడియా, ముంజ్యా లాంటి సినిమాల తర్వాత ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమా థామా. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ జర్నలిస్ట్. అడవిలోకి అడ్వంచర్ చేయడానికి స్నేహితులతో కలిసి వెళ్తాడు. అదే సమయంలో ఆయనపైకి ఓ ఎలుగుబంటి దాడి చేస్తుంది. అప్పుడే అతడ్ని కాపాడటానికి వస్తుంది తడకా (రష్మిక మందన్న). ఈమె మనిషి కాదు భేతాళ జాతికి చెందింది. వాళ్ల నియమాల ప్రకారం మనుషుల రక్తం తాగకూడదు. కానీ వాళ్ల పూర్వీకుడు, థామా అంటే నాయకుడు అయిన యాక్షసన్ (నవాజుద్ధీన్ సిద్ధిఖీ) ఓసారి నియమాలకు విరుద్ధంగా మనుషుల రక్తం తాగుతాడు. దాంతో అతన్ని 100 ఏళ్ల పాటు ఓ గుహలో బంధిస్తారు. తనలా మళ్లీ ఎవరైనా భేతాళుడు నియమం తిప్పినపుడే యాక్షసన్‌కు విడుదల. అలాంటి సమయంలో అనుకోకుండా తన నియమం తప్పాల్సి వస్తుంది తడకా. ఆ తర్వాత ఏమైంది..? మధ్యలో భేడియా (వరుణ్ ధావన్) ఎందుకొచ్చాడు అనేది మిగిలిన కథ..
కథనం:
ఒక యూనివర్స్ క్రియేట్ అయ్యాక అందులో కథలు రాసుకోవడం కాస్త ఈజీనే. అక్కడక్కడ చమక్కులు ఉన్నా కూడా సినిమా పాస్ అయిపోతుంది. బాలీవుడ్‌లో మ్యాడాక్ సంస్థ చేస్తున్నది ఇదే. కొన్నేళ్లుగా వాళ్లు సింపుల్‌గా ఓ ప్రపంచాన్ని సృష్టించి అందులోనే మాయ చేస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ కథలను తీసుకుని.. అద్భుతమైన విజువల్స్‌తో మ్యాజిక్ చేస్తున్నారు. ఒక యూనివర్స్‌లో ఒకదానితో ఒకటి లింక్ పెట్టి సినిమాలు చేస్తూ పోతున్నారు వాళ్ళు. భేడియా, స్త్రీ, ముంజ్యా, స్త్రీ 2 లాంటి సినిమాల తర్వాత.. థామాలో కూడా వాటినే లింక్ చేస్తూ స్టోరీ రాసుకున్నాడు డైరెక్టర్ ఆదిత్య సర్పోద్కర్. ఇందులోనూ అక్కడక్కడా చమక్కులున్నాయి. గత సినిమాల స్థాయిలో ఇందులో హైలైట్స్ లేవు కానీ.. పర్లేదు టైం పాస్ అయ్యే సినిమా. ఫస్ట్ 10 నిమిషాల్లోనే కథ మొదలైపోతుంది.. మరీ ముఖ్యంగా మొదలు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. రష్మిక మందన్న, ఆయుష్మాన్ మధ్య సీన్స్ కాస్త నెమ్మదిగా సాగుతాయి. ఇంటర్వెల్ సీన్ జస్ట్ ఓకే.. సెకండాఫ్‌లోనే అసలు కథ ఉంటుంది. భేతాళుడి కాన్సెప్ట్ గురించి బాగానే వివరించారు. హార్రర్ థ్రిల్లర్ అంటారు కానీ భయపెట్టే అంశాలైతే అంతగా లేవు. స్త్రీ, ముంజ్యా లాంటి సినిమాల్లో హార్రర్ మామూలుగా ఉండదు.. నెక్ట్స్ లెవల్ భయపెట్టే సన్నివేశాలున్నాయి. ఇందులో ఆ స్థాయి భయం వర్కవుట్ కాలేదు. భేడియా, స్త్రీ 2లతో లింక్ పెట్టిన సీన్స్ బాగున్నాయి. చివర్లో నెక్ట్స్ పార్ట్స్‌కు లీడ్ కూడా ఇచ్చారు.
నటీనటులు:
ఆయుష్మాన్ ఖురానా బాగా నటించాడు. కామెడీతో పాటు యాక్షన్ కూడా బాగుంది. రష్మిక మందన్న గ్లామర్ షోతో పాటు బాగా నటించింది కూడా. సినిమాలో చాలా వరకు సీన్స్ అన్నీ ఆమె చుట్టూనే తిరుగుతుంటాయి. చాలా పెద్ద క్యారెక్టర్ పడింది. నవాజుద్ధీన్ సిద్ధిఖీ ఉన్నది కాసేపే కానీ బాగున్నాడు.. పరేష్ రావల్ కూడా. ఆయన కామెడీ బాగుంది. సెకండాఫ్‌లో పరేష్ చుట్టూ అల్లుకున్న సీన్స్ ఆకట్టుకుంటాయి. సత్యరాజ్ ఉన్నది రెండు సీన్లే కానీ బాగుంది. వరుణ్ ధావన్ కూడా ఉన్న ఒక్క సీన్ అల్లాడించాడు. మిగిలిన వాళ్లు ఓకే..
టెక్నికల్ టీం:
సచిన్ జిగర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ఎడిటింగ్ పరంగా చూస్తే ఫస్టాఫ్ బాగా వీక్. అక్కడక్కడా సీన్స్ లెంత్ అయ్యాయి కూడా. సెకండాఫ్ పర్లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ అయితే టాప్ నాచ్‌లో ఉంది. నిర్మాణ విలువలకు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. మ్యాడాక్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. దర్శకుడు ఆదిత్య సర్పోద్కర్ కథను ముందు భాగాలకు లింక్ పెడుతూ రాసుకున్నాడు. కాకపోతే అది ఆ స్థాయిలో పేలలేదు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా థామా.. యూనివర్స్‌లో కాస్త వీక్.. అంచనాల్లేకుండా చూస్తే ఓకే..!




