AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikrant Rona Review: విక్రాంత్ రోణ.. కన్ఫ్యూజింగ్ రివేంజ్ విజువల్ డ్రామా..

Vikrant Rona Review: కేజియఫ్ తర్వాత కన్నడ సినిమాలపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. ఈ క్రమంలో సుదీప్ హీరోగా వచ్చిన సినిమా విక్రాంత్ రోణ. చాలా రోజులుగా వార్తల్లో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ భారీగానే విడుదల చేసారు.

Vikrant Rona Review: విక్రాంత్ రోణ.. కన్ఫ్యూజింగ్ రివేంజ్ విజువల్ డ్రామా..
Vikrant RonaImage Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: Jul 28, 2022 | 1:08 PM

Share

Vikrant Rona Movie Review:కేజియఫ్ తర్వాత కన్నడ సినిమాలపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. ఈ క్రమంలో సుదీప్ హీరోగా వచ్చిన సినిమా విక్రాంత్ రోణ. చాలా రోజులుగా వార్తల్లో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ భారీగానే విడుదల చేసారు. విజువల్ వండర్‌గా వచ్చిన విక్రాంత్ రోణ ఎలా ఉంది.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా..? ఇవన్నీ రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: విక్రాంత్ రోణ (Vikrant Rona)

నటీనటులు: సుదీప్, నిరూప్ బంఢారీ, నీతా అశోక్, మధుసూధన్ రావు తదితరులు

ఇవి కూడా చదవండి

ఎడిటర్: అసుక్ కుసుగొల్లి

సినిమాటోగ్రఫర్: విలియమ్ డేవిడ్

సంగీతం: అజ్నీష్ లోక్‌నాథ్

నిర్మాత: అలంకార్ పాండియన్, శాలిని జాక్ మంజు

దర్శకుడు: అనూప్ బంఢారీ

కథ:

కొమరట్టు అనే ఊరు.. ఆ ఊళ్లో చాలా మంది పిల్లలు హత్య చేయబడుతుంటారు. అదే ఊళ్ళో ఉన్న పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ను కూడా చంపేసి.. పాడుబడ్డ బావిలో వేలాడదీస్తారు. అలాంటి సమయంలో ఆ ఊరికి ఇన్స్‌పెక్టర్‌గా చార్జ్ తీసుకుంటారు విక్రాంత్ రోణ (సుదీప్). వచ్చీ రాగానే తన పని మొదలు పెడతారు. ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టి ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు.. వాళ్ళ మోటో ఏంటి అని తెలుసుకునే పనిలో పడతారు. ఈ క్రమంలోనే ఆయనకు కొన్ని విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. కొన్నేళ్ల కింద అదే ఊళ్ళో నిట్టోని అనే వ్యక్తి కుటుంబాన్ని.. గుడి నగలు దొంగిలించారనే నెపంతో కొట్టి తరిమేస్తారు ఊరి జనం. ఆ అవమాన భారంతో నిట్టోని కుటుంబం అంతా చనిపోతుంది. వాళ్ళ ఆత్మలే ఊళ్ళో పిల్లల్ని చంపేస్తున్నాయని అంతా అనుకుంటారు. మరోవైపు చిన్నపుడు ఇంటి నుంచి పారిపోయిన ఆ ఊరి పెద్ద కుమారుడు సంజు (నిరూప్ బండారి) ఊళ్ళోకి చాలా ఏళ్ళ తర్వాత వస్తారు. అతడు పన్ను (నీతా అశోక్)తో ప్రేమలో పడతారు. ఈ ఇద్దరి ప్రేమకు.. ఆ ఊరి హత్యలకు ఏంటి సంబంధం.. అసలు ఈ కేసును విక్రాంత్ రోణ ఎలా చేధించారు అనేది కథ..

కథనం:

పాన్ ఇండియా సినిమా చేయాలంటే ఉండాల్సింది పైసా కాదు.. పర్ఫెక్ట్ కథ. అది వదిలేసి స్టార్ హీరో దొరికాడు కదా అని అనవసరపు హంగామా చేస్తే లాభముండదు. విక్రాంత్ రోణ సినిమా విషయంలో ఇదే జరిగింది. చాలా చిన్న కథకు.. పాన్ ఇండియా ముస్తాబు చేసి ఎటూ కాకుండా చేసారు సినిమాను. సినిమా అంతా చూసాక.. ఈ కథకు ఇంత బడ్జెట్ ఎందుకు అని ప్రతీ ఒక్క ఆడియన్‌కు అనుమానం వస్తుంది. పైగా నాలుగేళ్ళ కింద వచ్చిన రాక్షసుడు సినిమాతో దీనికి పోలిక ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో జరిగిన చాలా చిన్న పాయింట్‌ను ఇప్పటి కథకు ముడి పెడుతూ దర్శకుడు అనూప్ రాసుకున్న రివేంజ్ డ్రామా ఇది. కాకపోతే దాన్ని చాలా గ్రాండ్‌గా, విజువల్ ఫీస్టుగా చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే స్క్రీన్ ప్లేలో చాలాచోట్ల తడబడ్డారు. అసలు హైలైట్ ఏంటంటే.. సినిమా అంతా చూసాక కూడా కథేంటో అర్థం కాదు. కన్ఫ్యూజన్‌కు పరాకాష్టలా ఉంటుంది స్క్రీన్ ప్లే.. ఇందులోనే చాలా లోపాలున్నట్లు అనిపిస్తుంది. దర్శకుడు ఏమనుకున్నాడో.. దాన్ని ఎలా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనుకున్నాడో.. చివరికి అది ఎలా డెలివర్ అయిందో.. అంతా ఎటెటో పోతుంది కథ. క్లైమాక్స్ చూసి.. అరగంట ఆలోచిస్తే కానీ ఓహో ఇదా కథా అనిపిస్తుంది. ఈ కథలో అంత విజువల్ ఎఫెక్ట్స్ ఎందుకో అర్థం కాదు. సస్పెన్స్ సినిమాలో మాదిరి వింత సౌండ్స్ వస్తుంటాయి.. అలాగని ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాదు. దెయ్యాల్లా కొందరు కనిపిస్తుంటారు.. వాళ్లెవరో ఎందుకొస్తారో క్లారిటీ ఉండదు. నేను కూడా ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని సుదీప్ చేసినట్లుంది ఈ చిత్రం. చిన్న కథకు భారీగా ఖర్చు చేయించేసాడు దర్శకుడు అనూప్ బండారీ. ఒక్క ఎగ్జైటింగ్ పాయింట్ కూడా ఉండదు ఈ సినిమాలో.. పైగా చాలా నెమ్మదిగా సాగే కథ ఆసక్తి కలిగించదు. 28 ఏళ్ళ కింద కటుంబమంతా చనిపోయిందని చెప్పిన దర్శకుడు.. ఆ సస్పెన్స్ చివరి వరకు దాచలేకపోయారు. మధ్యలోనే కథపై పట్టు కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సమయానికే కథ గాడి తప్పుతుంది.. సెకండాఫ్ పగ్గాలు వేసి ఆపడానికి ప్రయత్నించినా.. క్లైమాక్స్‌కు చేరుకునే సరికి ఏం అర్థం కాకుండా పోయింది.

Vikrant Rona

Vikrant Rona

నటీనటులు:

కిచ్చా సుదీప్ నటన గురించి చెప్పనక్కర్లేదు. విక్రాంత్ రోణ పాత్రలో ఆయన అదరగొట్టారు.. ఆ పాత్రకు ప్రాణం పోసారు. పైగా సొంత డబ్బింగ్ చెప్పుకోవడంతో సమ్ థింగ్ స్పెషల్ అనిపిస్తుంది. మరో కీలకమైన పాత్రలో నిరూప్ బండారి కూడా బాగా నటించారు. నీతా అశోక్ గ్లామరస్‌గా కనిపించారు. సీనియర్ నటుడు మధుసూధన్ రావు ఊరిపెద్దగా బాగున్నారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీమ్:

విక్రాంత్ రోణ అంతా టెక్నిషియన్స్ ప్రతిభే కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాకపోతే కేజియఫ్ తర్వాత చీకట్లోనే సినిమాలు చేయాలని కన్నడ దర్శకులు ఆలోచిస్తున్నట్లున్నారు. ఇందులోనూ అదే ఎక్కువగా కనిపించింది. ఎడిటింగ్ చాలా వీక్‌గా అనిపించింది. కొన్ని సీన్స్ చాలా నెమ్మదిగా సాగాయి. సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.. అజ్నీష్ లోక్‌నాథ్ సంగీతం బాగుంది.. రార రక్కమ్మ అదిరిపోయింది. బ్యాంగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. దర్శకుడు అనూప్ బండారి మాత్రం కథ విషయంలోనే ఓకే అనిపించినా.. దాన్ని ఇంత భారీగా చేయాలనుకున్నపుడే కన్ఫ్యూజన్‌లో పడిపోయారేమో అనిపిస్తుంది. చిన్న కథకు ఎక్కువ హైప్ ఇచ్చి ఎటూ కాకుండా చేసారు.

ఫైనల్ పంచ్: విక్రాంత్ రోణ.. ఖర్చు భళా.. కథ డీలా..

(ప్రవీణ్ కుమార్, టీవీ9 ET టీమ్, హైదరాబాద్)

మరిన్ని సినిమా రివ్యూలు చదవండి..