Thank You Review: పట్టుదల, ప్రయాణం, గెలుపు, పరివర్తన, కృతజ్ఞతల సమాహారం ‘థాంక్యూ’

Thank you Movie Review: ఓటీటీ, వర్షాలు వంటి అడ్డంకులను దాటుకుని థియేటర్లలోకి వచ్చింది థాంక్యూ. నాగచైతన్య, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా. దిల్‌రాజు కాంపౌండ్‌ నుంచి వచ్చిన సినిమా.

Thank You Review: పట్టుదల, ప్రయాణం, గెలుపు, పరివర్తన, కృతజ్ఞతల సమాహారం 'థాంక్యూ'
Thank You MovieImage Credit source: TV9 Telugu
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 22, 2022 | 12:40 PM

Thank You Movie Review: కోవిడ్‌ తర్వాత సినిమా థియేటర్ కు జనాలు రావడం గగనమైపోతోంది. కోట్లు పెట్టి తీసిన సినిమాలు ఆడియన్స్ లేక వెలవెలబోతున్నాయి. వాటికి తోడు జనాలను కవ్విస్తున్న ఓటీటీలు. అవన్నీ చాలవన్నట్టు వర్షాలు. ఇన్నిటిని దాటుకుని థియేటర్లలోకి వచ్చింది థాంక్యూ. నాగచైతన్య, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా. దిల్‌రాజు కాంపౌండ్‌ నుంచి వచ్చిన సినిమా. మనం లాంటి సెన్సిబుల్‌ మూవీని తెరకెక్కించిన విక్రమ్‌ కుమార్‌ డైరక్ట్ చేసిన సినిమా. ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించిందా?

సినిమా: థాంక్యూ (Thank You)

సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

ఇవి కూడా చదవండి

నటీనటులు: నాగచైతన్య, రాశీ ఖన్నా, మాళవిక నాయర్‌, అవికా గోర్‌, సాయి సుశాంత్‌ రెడ్డి, ప్రకాష్‌రాజ్‌, డా.భరత్‌రెడ్డి, తులసి, రాజేశ్వరి నాయర్‌, సంపత్‌రాజ్‌ తదితరులు

కెమెరా: పీసీ శ్రీరామ్‌

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

సంగీతం: తమన్‌

కథ: బీవీయస్‌ రవి

మాటలు: వెంకట్‌, మిథున్‌

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కుమార్‌

నిర్మాతలు: రాజు, శిరీష్‌

విడుదల: జులై 22, 2022

అభి (నాగచైతన్య) తన తెలివితేటలతో వైద్య అనే యాప్‌ క్రియేట్‌ చేస్తాడు. ప్రపంచంలోని 75 శాతం మందికి తన యాప్‌ ద్వారా చేరువవుతాడు. ఈ ప్రయాణంలో అతనికి ప్రియ (రాశీఖన్నా) సాయం చేస్తుంది. అతను ఫారిన్‌లో అడుగుపెట్టడానికి రావు (ప్రకాష్‌రాజ్‌) హెల్ప్ చేస్తాడు. ఉన్నట్టుండి ఒకరోజు రావు హార్ట్ ఎటాక్‌తో కన్నుమూస్తాడు. అతని మృతికీ, అభి ప్రవర్తనకీ లింకేంటి? అక్కడి నుంచి అభి జీవితంలో ఏం జరిగింది? జీవితాంతం అభితోనే ఉండాలనుకున్న ప్రియ ఎందుకు దూరమైంది? అభి జీవితంలో నారాయణపురానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? పార్వతి (మాళవిక నాయర్‌) వల్ల అభి ఎలా మారాడు? చిన్ను (అవికా గోర్‌) ప్రేమ విషయంలో అభి చేసిన సాయం ఏంటి? చిన్ను అన్నయ్యతో అభికున్న గొడవేంటి? ఇలాంటి ఎన్నో సంఘటనల సమాహారమే థాంక్యూ.

స్కూలుకెళ్లే కుర్రాడు, అక్కడి నుంచి కాలేజీ, ఆ తర్వాత జీవిత ప్రయాణం, తనతోటివారికి జీవనోపాధి కల్పించగలిగిన కంపెనీ సీఈవో. ఇన్ని కేరక్టర్లకు సూటయిన నటుడు నాగచైతన్య. అన్నీ గెటప్పులూ ఆయనకు పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఫారిన్‌లో సెటిలైన అమ్మాయిగా, విలువలున్న అమ్మాయిగా రాశీఖన్నా పాత్ర బావుంది. గట్టిగా పట్టుకోగలిగేదే కాదు, ప్రేమించిన వ్యక్తిని స్వేచ్ఛగా వదిలేయడం కూడా ప్రేమే అని కళ్లతోనే చెప్పిన మాళవిక కేరక్టర్‌ చాలా మందికి కనెక్ట్‌ అవుతుంది. అవికా గోర్‌ కోసం రాసిన చిన్ను కేరక్టర్‌ ఆడియన్స్ కి సర్‌ప్రైజ్‌. కొత్తగా అనిపిస్తుంది.

Thank You

Thank You

సినిమాలో కచ్చితంగా చెప్పుకోవాల్సింది పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రాఫీ. ప్రతి ఫ్రేమూ పెయింటింగ్‌లా ఉంది. పార్వతి, అభి మాట్లాడుకునేటప్పుడు విండో షేడ్స్ పడటం నుంచి, ఫారిన్‌లో మంచు కురిసే దృశ్యాలను చూపించడం, నారాయణపురం అందాలను, రాజమండ్రి బ్రిడ్జి వైశాల్యాన్ని చూపించడంలోనూ ఆయన ప్రత్యేకత కనిపించింది.  తమన్‌ అందించిన నేపథ్య సంగీతం కథకు తగ్గట్టే ఉంది. పాటలు సినిమాతో పాటే సాగినా మళ్లీ మళ్లీ పాడుకునేలా, గుర్తు చేసుకుని హమ్‌ చేసుకునేలా అనిపించవు.

జీవితంలో ఏదో సాధించాలని సాగిన ప్రయాణంలో, నిర్విరామంగా ఎదురయ్యే టార్గెట్లతో, సక్సెస్‌లతో తన చుట్టూ ఉన్నవారిని, వారు చేసిన సాయాన్ని మర్చిపోయి సెల్ఫ్‌ సెంట్రిక్‌గా మారిన వ్యక్తి, మళ్లీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని, తనవారిని గుర్తించి ఆత్మీయతలను కలబోసుకుంటే ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు. నారాయణపురంలో పడవ పోటీలు, వైజాగ్‌లో హాకీ, యుఎస్‌లో యాప్‌ డెవలప్‌మెంట్‌ అంటూ ప్రతి విషయాన్నీ కన్విన్సింగ్‌గా చెప్పగలిగారు. వదులుకున్న ప్రేమలు, వదిలేసుకున్న జీవితాలను మరొక్కసారి గుర్తుతెచ్చే సినిమా అవుతుంది. సెన్సిబుల్‌ సినిమాలను విక్రమ్‌ చక్కగా డీల్‌ చేయగలరనే మాట మరోసారి ప్రూవ్‌ అయింది. ప్రేక్షకుడి ఊహకు అందే కథ, కొత్తదనం లేని స్క్రీన్‌ప్లే సినిమాకు మైనస్‌ పాయింట్లు. మాస్‌ జనాలకన్నా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది థాంక్యూ.

– డా. చల్లా భాగ్యలక్ష్మి

మరిన్ని సినిమా వార్తలు చదవండి..