AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదేళ్ల తర్వాత బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో..! హోస్ట్‌గానూ ప్రేక్షకులను మెప్పిస్తాడా?

బాలీవుడ్ యాక్షన్ స్టార్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఆయనే. వెండితెరపై సాహసోపేతమైన విన్యాసాలు చేయాలన్నా, కామెడీతో కడుపుబ్బ నవ్వించాలన్నా ఆయనకు ఆయనే సాటి. అయితే ఆయన కేవలం వెండితెరకే పరిమితం కాలేదు. బుల్లితెరపైనా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.

పదేళ్ల తర్వాత బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో..! హోస్ట్‌గానూ ప్రేక్షకులను మెప్పిస్తాడా?
Star Hero And Host
Nikhil
|

Updated on: Jan 31, 2026 | 7:15 AM

Share

ఒకప్పుడు బుల్లితెరపై రియాలిటీ షోలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ అంటూ సాహసాలు చేసి టీవీ రేటింగ్‌లను అమాంతం పెంచేసిన ఆ స్టార్ హీరో.. గత పదేళ్లుగా హోస్టింగ్ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇన్నాళ్లకు తన పాత గూటికి చేరుకుంటూ ఒక క్రేజీ గేమ్ షోతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 58 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఆ ‘ఖిలాడీ కుమార్’ ఎవరు?

పదేళ్ల విరామం తర్వాత..

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. సుమారు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన పూర్తిస్థాయి హోస్ట్‌గా ఒక రియాలిటీ గేమ్ షో బాధ్యతలు చేపట్టారు. సోనీ టీవీలో ప్రారంభమైన ప్రసిద్ధ గేమ్ షో ‘వీల్ ఆఫ్ ఫార్చ్యూన్’ భారతీయ వెర్షన్‌కు అక్షయ్ కుమార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 2017లో ‘ది గ్రేట్ ఇండియన్​ లాఫ్టర్ ఛాలెంజ్’లో కాసేపు మెరిసినా, ఒక పూర్తి స్థాయి షోని నడిపించడం మాత్రం పదేళ్ల తర్వాత ఇప్పుడే జరుగుతోంది.

అక్షయ్ కుమార్ కి బుల్లితెర కొత్తేమీ కాదు. 2004లో ‘సెవెన్ డెడ్లీ ఆర్ట్స్’తో ఆయన టీవీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ షోతో ఆయన పాపులారిటీ శిఖర స్థాయికి చేరింది. మాస్టర్ చెఫ్ ఇండియా, డేర్ 2 డ్యాన్స్ వంటి వైవిధ్యమైన షోలతో అలరించిన అక్షయ్ కుమార్, ఇప్పుడు ‘వీల్ ఆఫ్ ఫార్చ్యూన్’తో సరికొత్తగా మన ముందుకు వస్తున్నారు. “నేను ఏదైనా అర్థవంతమైన, సంతోషాన్నిచ్చే పని చేయాలనుకున్నాను. ఈ షోలో చురుకైన ఆలోచనలు, కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యత ఉంటుంది.. అందుకే దీనికి ఓకే చెప్పాను” అని అక్షయ్ వివరించారు.

Akshay Kumar

Akshay Kumar

అసలు రహస్యం..

తన కెరీర్‌లో అదృష్ట చక్రం ఎప్పుడు తిరిగింది అన్న ప్రశ్నకు అక్షయ్ కుమార్ చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. “నా జీవితంలో అదృష్టం అనేది ఏదో ఒక అద్భుతం వల్ల రాలేదు. సౌకర్యవంతమైన జీవితం కంటే క్రమశిక్షణే మిన్న అని నేను నమ్ముతాను. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన నాకు ప్రతి అవకాశం నేను పడ్డ కష్టం వల్లే దక్కింది” అని అక్షయ్ పేర్కొన్నారు. సమయపాలన, కష్టపడే తత్వం, వృత్తి పట్ల నిజాయితీ ఉంటేనే అదృష్టం తలుపు తడుతుందని ఈ 58 ఏళ్ల నటుడు యువతకు హితవు పలికారు.

జనవరి 27 నుంచి సోనీ టీవీతో పాటు సోనీ లివ్ (SonyLIV) ఓటీటీలో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కంటెస్టెంట్లు ఒక పెద్ద చక్రాన్ని తిప్పి ప్రైజ్ మనీ గెలుచుకుంటూ, పదాల పజిల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘భూత్ బంగ్లా’, అలాగే ‘వెల్‌కమ్ టు ది జంగిల్’, ‘హైవాన్’ వంటి సినిమాలతో త్వరలో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

తన సినిమా కెరీర్‌ను, టీవీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ అక్షయ్ కుమార్ మళ్ళీ రేసులోకి వచ్చారు. అక్షయ్ కుమార్ హోస్టింగ్‌కు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఆయన మాట తీరు, కంటెస్టెంట్లతో మమేకమయ్యే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పదేళ్ల తర్వాత మళ్ళీ బుల్లితెరపై కనిపిస్తున్న అక్షయ్ కుమార్ ఈ షోతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.