Anil Ravipudi: 2027 సంక్రాంతి కోసం మాస్టర్ ప్లాన్.. వెంకీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న హిట్ డైరెక్టర్..!
టాలీవుడ్‌లో అపజయం ఎరుగని దర్శకుల్లో ఆయన ఒకరు. కామెడీని పండించాలన్నా, మాస్ ఎమోషన్‌ను వెండితెరపై ఆవిష్కరించాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించే హంగామా మామూలుగా ఉండదు.

తాజాగా మెగాస్టార్‌తో కలిసి ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు తన తదుపరి మిషన్ కోసం సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన చేయబోయే ప్రయోగం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తన ఫేవరెట్ హీరోతో కలిసి ఐదోసారి బాక్సాఫీస్‌పై దండయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. కేవలం తెలుగు నటులతోనే కాకుండా, పక్క రాష్ట్రాల స్టార్ హీరోలను కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకురావాలని పెద్ద స్కెచ్ వేశారు. “టైటిల్ వింటేనే వామ్మో వీడేంట్రా బాబూ” అంటారని స్వయంగా ఆ దర్శకుడే చెబుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతకీ ఆ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎవరు?
సంక్రాంతి సెంటిమెంట్..
వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా ‘మన శంకర వరప్రసాద్’ సినిమా రూపంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరిశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అనిల్ రావిపూడి సత్తా చాటింది. సంక్రాంతి సీజన్ లో ఇప్పటికే నాలుగు హిట్లు కొట్టిన అనిల్, 2027 సంక్రాంతికి కూడా మరో సినిమాను సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. తన తదుపరి సినిమా కోసం ఇప్పటికే ఒక అదిరిపోయే ఐడియా వచ్చిందని, టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే ఒక విచిత్రమైన జర్నీ స్టార్ట్ అవుతుందని ఆయన వెల్లడించారు.
ఐదోసారి ‘విక్టరీ’ కోసం..
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీ కోసం మళ్ళీ వెంకటేష్ తోనే చేతులు కలపబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘F2’, ‘F3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్’ వంటి నాలుగు విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రాబోయే ఐదో సినిమా కోసం అనిల్ రావిపూడి ఒక క్రేజీ మల్టీస్టారర్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. వెంకటేష్ సరసన మరో పవర్‌ఫుల్ హీరో ఉండాలని అనిల్ భావిస్తున్నారు.

Venky Anil Karthi Fahad
ఈ ప్రాజెక్టులో మరో హీరో పాత్ర కోసం తమిళ స్టార్ హీరో కార్తీ లేదా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వీరు కుదరకపోతే దగ్గుబాటి రానాను రంగంలోకి దించి ‘బాబాయ్-అబ్బాయ్’ కాంబోతో థియేటర్లను షేక్ చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం వెంకటేష్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం – AK 47’ సినిమా చేస్తున్నారు. 2026 సమ్మర్ లో ఆ సినిమా విడుదలైన వెంటనే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
అనిల్ రావిపూడి సినిమాలంటేనే వినోదం గ్యారెంటీ. అందుకే ట్రేడ్ వర్గాల్లో ఆయన నెక్స్ట్ మూవీపై భారీ ఆసక్తి నెలకొంది. టైటిలే విచిత్రంగా ఉంటుందని అనిల్ చెబుతుండటంతో.. అది ఏ జోనర్ సినిమా అయి ఉంటుందని అభిమానులు ఆరా తీస్తున్నారు. వెంకటేష్ టైమింగ్‌ను వాడుకోవడంలో అనిల్ దిట్ట కాబట్టి, మరోసారి సంక్రాంతి బాక్సాఫీస్‌ను వీరిద్దరూ కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులకు ఒక నమ్మకం. వీరిద్దరి నుంచి రాబోతున్న ఐదో సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
