Gen Z vs Millennials: శాలరీ ఎంతైనా జూజూబీ అంటున్న Gen Z.. వర్క్, లైఫ్ బ్యాలెన్స్‌కే ప్రయారిటీ
ఒకప్పుడు ఉద్యోగం అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆఫీసులో ఉండటం. బాస్ చెప్పిన పనిని కాదనకుండా చేయడం.. అవసరమైతే సెలవులు కూడా వదులుకుని కంపెనీ కోసం చాకిరీ చేయడం ఆ ఒత్తిడిలో ఒక్కోసారి ప్రాణాలర్పించడం.

దశాబ్దాలుగా మిలీనియల్స్ అనుసరిస్తున్న ఈ ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ కల్చర్‌కు ఇప్పుడు ఒక పెద్ద బ్రేక్ పడింది. కొత్తగా ఆఫీసుల్లో అడుగుపెడుతున్న కుర్రాళ్లు.. అంటే ఈ జెన్-జీ బ్యాచ్, కార్పొరేట్ రూల్స్‌ను తిరగరాస్తోంది. పనికి ఇచ్చే విలువ కంటే తన ప్రశాంతతకు ఇచ్చే విలువ ఎక్కువని ముక్కుసూటిగా చెబుతోంది. “నేను పని కోసం పుట్టలేదు.. నా జీవితం గడవడానికి మాత్రమే పని చేస్తాను” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ తరం, కంపెనీల యాజమాన్యాలకు చెమటలు పట్టిస్తోంది. మిలీనియల్స్ త్యాగాలకు, జెన్-జీ డిమాండ్లకు మధ్య ఉన్న ఆ ఆసక్తికరమైన పోటీ ఏంటో తెలుసుకుందాం..
మిలీనియల్స్ కెరీర్ ఎదుగుదల కోసం ఎంతటి కష్టానికైనా వెనకాడరు. ప్రమోషన్లు, గుర్తింపు కోసం ఆఫీస్ పనులను ఇంటికి తీసుకెళ్లడం వారికి అలవాటు. అదనపు గంటలు పనిచేయడాన్ని ఒక గ్రేట్ అచీవ్‌మెంట్‌గా భావిస్తారు. కానీ జెన్-జీ ఆలోచనలు దీనికి పూర్తి భిన్నం. వారు ‘క్వైట్ క్విట్టింగ్’ అనే పంథాను అనుసరిస్తున్నారు. అంటే బాస్ చెప్పిన పని మాత్రమే చేయడం.. తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్యోగం కోసం బలిపెట్టకపోవడం. ఆఫీసులో ఎనిమిది గంటలు కూర్చోవాలనే రూల్ కంటే, పని పూర్తయిందా లేదా అన్నదే ముఖ్యం అని వీరు భావిస్తారు.

Millennials
అదే ముఖ్యం..
నిరంతరం ఒత్తిడిలో పనిచేయడం జెన్-జీకి అస్సలు నచ్చదు. మానసిక ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఈ తరం.. హైబ్రిడ్ లేదా రిమోట్ వర్క్ ఆప్షన్ లేని కంపెనీల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఆఫీసులో లంచ్ బ్రేక్ నుంచి పర్సనల్ స్పేస్ వరకు ప్రతి విషయంలోనూ వీరు చాలా క్లారిటీతో ఉంటున్నారు. విపరీతమైన పని గంటల వల్ల మెదడు మొద్దుబారిపోకూడదని, లైఫ్‌ను ఆస్వాదిస్తూనే వర్క్ చేయాలని వీరు కోరుకుంటున్నారు. మిలీనియల్స్ ఏడాదికి ఒకసారి వచ్చే అప్రైజల్స్ కోసం ఓపికగా ఎదురుచూస్తారు.
కానీ డిజిటల్ యుగంలో పెరిగిన జెన్-జీకి ప్రతిదీ వెంటనే జరిగిపోవాలి. వీరికి నిరంతరం ‘ఇన్‌స్టెంట్ ఫీడ్‌బ్యాక్’ కావాలి. ఆఫీస్ పాలిటిక్స్ కంటే ట్రాన్స్‌పరెన్సీ ఉంటేనే ఆ సంస్థలో కొనసాగుతారు. ఏదైనా సమస్య ఉంటే మొహం మీద ముక్కుసూటిగా చెప్పేయడం వీరి నైజం. జీతాల విషయంలోనూ పాత పద్ధతులను వీరు ఇష్టపడరు. తోటి ఉద్యోగులతో జీతాల గురించి చర్చించడానికి, తక్కువ జీతం ఇస్తున్నారని బాస్‌ను ప్రశ్నించడానికి వీరు అస్సలు వెనకాడరు.
జెన్-జీ కేవలం తన జీతం గురించి మాత్రమే ఆలోచించదు. తాము పనిచేసే కంపెనీ సామాజిక బాధ్యత ఎలా ఉంది? పర్యావరణం పట్ల ఆ సంస్థ వైఖరి ఏంటి? వైవిధ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? వంటి విషయాలను కూడా నిశితంగా గమనిస్తారు. తమ వ్యక్తిగత విలువలకు సరిపోని కంపెనీలను ఎంతటి భారీ జీతం ఇస్తున్నా నిర్మొహమాటంగా వదిలేస్తున్నారు.
ఫైనాన్సియల్ సెక్యూరిటీ కంటే ప్రొఫెషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్‌కే వీరు మొగ్గు చూపుతున్నారని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మిలీనియల్స్ కష్టాన్ని గౌరవిస్తే.. జెన్-జీ స్వేచ్ఛను ప్రేమిస్తోంది. ఈ రెండు తరాల మధ్య ఉన్న ఈ అగాధాన్ని భర్తీ చేయడానికి కంపెనీలు ఇప్పుడు తమ పాలసీలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పని గంటల కంటే ఫలితాలకు, త్యాగాల కంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ కొత్త విప్లవం భవిష్యత్తులో మరిన్ని మార్పులకు దారి తీయవచ్చు.
